KTR on TMV : 4 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా.. తెలంగాణ మొబిలిటీ వ్యాలీ
KTR on TMV : ఆటోమోటివ్ రంగంలో 5 ఏళ్లలో రూ. 50 వేల కోట్ల పెట్టుబడులు.. 4 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా.... తెలంగాణ మొబిలిటీ వ్యాలీని మంత్రి కేటీఆర్ ప్రకటించారు. నాలుగు క్లస్టర్ లతో కూడిన టీఎంవీ ద్వారా వాహన తయారీ, పరిశోధనలకు తెలంగాణ గమ్యస్థానంగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈవీ సదస్సులో పలు దిగ్గజ సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది.
KTR on TMV : తెలంగాణ మొబిలిటీ వ్యాలీ (Telangana Mobility Valley - TMV) ద్వారా రాష్ట్రానికి త్వరలో రూ. 3 వేల కోట్ల పెట్టుబడులు రానున్నాయని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ రంగంలో ఇప్పటికే రాష్ట్రానికి రూ. 8 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని... కొత్తగా వచ్చే ఇన్వెస్ట్ మెంట్స్ తో రాష్ట్రంలో మొబిలిటీ రంగం మరింతగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. ఎలక్ట్రిక్ వాహనాలు.. ఎనర్జీ స్టోరేజ్ సొల్యూషన్స్ (EV - ESS) పాలసీ 2020 ని అన్ని రాష్ట్రాల కంటే ముందుగా తెలంగాణ అందిపుచ్చుకుందని.. అందుకే భారీ పెట్టుబడులు వస్తున్నాయని వివరించారు. నగరంలో కాలుష్యాన్ని తగ్గిస్తూ.. సుస్థిర ఎలక్ట్రిక్ వాహనాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ హెచ్ఐసీసీలో ప్రభుత్వం నిర్వహిస్తోన్న మొబిలిటీ వీక్‌లో భాగంగా రెండో రోజు జరిగిన ఈవీ సదస్సుకు కేటీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా...పెట్టుబడులను మరింతగా పెంచి.. ఎలక్ట్రిక్ వాహన తయారీకి గమ్యస్థానంగా మార్చే లక్ష్యంతో... తెలంగాణ మొబిలిటీ వ్యాలీని మంత్రి కేటీఆర్ ప్రకటించారు.
తెలంగాణ మొబిలిటీ వ్యాలీ ద్వారా 5 ఏళ్లలో రూ. 50 వేల కోట్ల పెట్టుబడులు.. నాలుగు లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా నిర్దేశించుకున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు. వాహన తయారీ, పరిశోధనలకు మంచి మౌలిక సదుపాయాలను ఈ వ్యాలీ అందిస్తుందని వివరించారు. ఇందుకోసం జహీరాబాద్, సీతారాంపూర్‌లో ఈవీ తయారీ క్లస్టర్‌లను, దివిటిపల్లిలో ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ (ESS) క్లస్టర్‌ను, యెంకతల వద్ద ఇన్నోవేషన్ క్లస్టర్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు పేర్కొన్నారు. తద్వారా... కంపెనీలు తక్కువ ఖర్చు, తక్కువ సమయంలోనే యూనిట్లను నిర్వహణలోకి తీసుకొచ్చే అవకాశం ఉంటుందని తెలిపారు. ఎంకతలలో ఈ సౌకర్యాల అభివృద్ధికి జర్మన్ సర్వీస్ ప్రొవైడర్ ఏటీఎస్-టీయూవీ రైన్‌ల్యాండ్‌తో రాష్ట్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. సౌకర్యాల అభివృద్ధి కోసం ఆ సంస్థ రూ. 250 కోట్ల పెట్టుబడి పెడుతుంది.
ఈవీ సదస్సులో పలు దిగ్గజ సంస్థలతో తెలంగాణ ప్రభుత్వం ఎంఓయూలు కుదుర్చుకుంది. అమర్ రాజా సంస్థ రూ. 9,500 కోట్ల పెట్టుబడితో బ్యాటరీ తయారీ... ఆటోమోటివ్ ప్రూవింగ్ గ్రౌండ్స్ కోసం హుందాయ్ రూ. 1,400 కోట్లు పెట్టుబడిగా పెట్టనున్నాయి. త్రీ వీలర్ ఈవీ వాహనాల తయారీ కోసం బిల్టీ ఎలక్ట్రిక్ రూ. 1,100 కోట్లు... మల్టీ గిగావాట్ క్యాథోడ్ తయారీ యూనిట్ కోసం అల్లాక్స్ రూ. 750 కోట్లు... బ్యాటరీ రీసైక్లింక్ కోసం అట్టెరో రూ. 600 కోట్లు... ఎలక్ట్రిక్ బైక్ ల తయారీ కోసం గ్రావటాన్ రూ. 150 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నాయి. డ్రైవింగ్ నైపుణ్యాలను మెరుగుపరిచేందుకు అపోలో టైర్స్ డిజిటిల్ ఇన్నోవేషన్ కేంద్రాన్ని స్థాపించనుంది. అటోమోటివ్ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్.. సేఫ్టీ సొల్యుషన్స్ అభివృద్ధి కోసం బాష్ గ్లోబల్ సాఫ్ట్ వేర్ టెక్నాలజీస్ సంస్థ 3 వేల మందికి ఉపాధి కల్పించనుంది.