UGC New Chairman| యూజీసీ ఛైర్మన్ గా తెలంగాణకు చెందిన మామిడాల జగదీశ్ నియామకం
యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) ఛైర్మన్ గా తెలంగాణకు చెందిన మామిడాల జగదీశ్ కుమార్ ను నియమిస్తున్నట్లు కేంద్రప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఐదేళ్లపాటు.. జగదీశ్ కుమార్ యూజీసీ ఛైర్మన్ గా కొనసాగనున్నారు.
యూజీసీ ఛైర్మన్ గా తెలంగాణకు చెందిన మామిడాల జగదీశ్ కుమార్ నియమితులయ్యారు. ఆయన స్వస్థలం నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం మామిడాల గ్రామం. ఆయన ఇంటిపేరు.. ఊరిపేరు ఒక్కటే కావడం విశేషం. యూజీసీ ఛైర్మన్ గా 2018లో ప్రొఫెసర్ డీపీ సింగ్ బాధ్యతలు స్వకరించారు. 65 ఏళ్లు నిండిన తర్వాత రాజీనామా చేశారు. దీంతో డిసెంబర్ 7, 2021న యూజీసీ ఛైర్మన్ పదవి ఖాళీగా ఉంది. అంతేకాకుండా ఉన్నత విద్యా నియంత్రణ సంస్థ వైస్-ఛైర్మెన్ పదవి కూడా ఖాళీగా ఉంది.
జెఎన్ యూ వైస్ ఛాన్సలర్ గా మామిడాల జగదీశ్ కుమార్ జనవరి 26 వరకు కొనసాగారు. ఆ తర్వాత.. ఆయనను యూజీసీ ఛైర్మన్ గా నియమిస్తున్నట్టు కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. మద్రాసులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT)లోని ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విభాగం నుండి MS(EE), PhD (EE) పొందారు.
జూలై 1994 నుంచి డిసెంబర్ 1995 మధ్య ఖరగ్‌పూర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేశాడు. ఆ తర్వాత ఆయన ఢిల్లీకి వచ్చారు. డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో పని చేశారు. 1997 నుంచి అసోసియేట్ ప్రొఫెసర్ గా విధులు నిర్వర్తించారు. జనవరి 2005లో ప్రొఫెసర్ అయ్యారు. జనవరి 2016లో జేఎన్ యూ వైస్ ఛాన్సలర్ గా బాధ్యతలు స్వీకరించారు.
మామిడాల జగదీశ్.. యూజీసీ ఛైర్మన్ నియమితులు అవ్వడంతో పలువురు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఆయన స్టూడెంట్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.