Jagga Reddy : కాంగ్రెస్ అధికారంలోకి వస్తే బెల్ట్ షాపులు ఎత్తివేస్తాం - జగ్గారెడ్డి
Congress Leader Jagga Reddy: సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే బెల్ట్ షాప్ లు ఎత్తివేస్తామని ప్రకటించారు.
Jagga Reddy News: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే బెల్ట్ షాప్ లు ఎత్తివేస్తామని సంగారెడ్డి ఎమ్మెల్యే, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జయప్రకాశ్ రెడ్డి అలియాస్ జగ్గారెడ్డి ప్రకటించాడు. బీఆర్ఎస్ పార్టీ నాయకులూ ప్రజలకు ఏమి పనులు చేయకపోయినా… ఎన్నికల మూడు రోజుల ముందు ఓటరుకు 1,000 రూపాయలు ఇచ్చి, ఒక మందు బాటిల్ ఇస్తే ప్రజలు ఓటు వేస్తారు అనే ఆలోచనలో ఉన్నారని ఎద్దేవా చేసారు. డబ్బులు తీసుకొని ప్రజలు ఓట్లు వేస్తారంటే తాను నమ్మనని అన్నారు. మందు బాబులకు కోపం వచ్చినా పర్వాలేదని.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఎట్టి పరిస్థితుల్లోనూ బెల్ట్ షాపులను ఎత్తేస్తాం అని ఆయన ప్రకటించారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా సదాశివపేట మండలంలోని వెల్లటూరు గ్రామంలో ప్రజలతో జగ్గారెడ్డి మాట్లాడుతూ… మందు పంచి గెలుద్దాం అని బీఆర్ఎస్ పార్టీ చూస్తుంది అని, అందులో వారు ఏమాత్రం కూడా సఫలీకృతులు కాలేరు అని ఆయన అభిప్రాయపడ్డారు. ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ ఇచ్చే వెయ్యి రూపాయలు కావాలా, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి మహిళలకు నెలకు ఇచ్చే రూ 2,500 కావాలా అనేది ప్రజలే తేల్చుకోవాలి అని ఆయన వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, సోనియాగాంధీ కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రకటించిన అన్ని హామీలు నెరవేరుస్తాం అని జగ్గారెడ్డి ఓటర్లతో మాట్లాడుతూ చెప్పారు. ఇంట్లో ఎంతమంది ఉంటే అంత మందికి కాంగ్రెస్ పార్టీ రూ 4,000 పెన్షన్ ఇస్తుందని అన్నారు. ఇన్నిరోజులు గ్యాస్ సిలిండర్ మీద సబ్సిడీ ఇవ్వని బీఆర్ఎస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ రూ 500 కే సిలిండర్ ఇస్తామని ప్రకటించగానే, తాము రూ. 400కే ఇస్తామని ప్రకటించారన్నారు.
ఈ నెల 29వ తేదీన ఆదివారం రోజున సంగారెడ్డి కి అల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే రానున్నారు. ఇందులో భాగంగా మల్కాపూర్ చౌరస్తా వెంకటేశ్వర ఫంక్షన్ హాల్ లో జగ్గా రెడ్డి కాంగ్రెస్ ముఖ్య నాయకులతో సమావేశం అయ్యారు. ఈ సభకి కాంగ్రెస్ అగ్ర నాయకులూ రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ,దామోదర రాజనర్సింహ తో పాటు ఇతర ముఖ్య నాయకులు హాజరు కానున్నారు ఆయన ప్రకటించారు. మొత్తం 30 వేల మంది తో స్థానిక గంజి మైదానంలో బహిరంగ సభ ఏర్పాటు చేస్తామని జగ్గా రెడ్డి చెప్పారు. ఉదయం 10 గంటలకు హెలికాప్టర్ లో మల్లికార్జున ఖర్గే సంగారెడ్డి కి చేరుకోనున్నారు అని సంగారెడ్డి ఎమ్మెల్యే అన్నారు.
2,000 మందితో బైక్ ర్యాలీ....
ప్రతి మండలానికి 5 వేల చొప్పున 20 వేల మంది, సంగారెడ్డి, సదాశివ పేట మున్సిపాలిటీ లకు 10 వేల చొప్పున మందిని సమీకరించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు .