TSRTC Special Buses : క్రికెట్ ఫ్యాన్స్ కు టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్, ఉప్పల్ స్టేడియానికి 60 ప్రత్యేక బస్సులు
TSRTC Special Buses : ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో ఇండియా, ఇంగ్లాండ్ టెస్ట్ మ్యాచ్ వీక్షించేందుకు వెళ్లే అభిమానులకు టీఎస్ఆర్టీసీ శుభవార్త చెప్పింది. మ్యాచ్ జరిగే రోజుల్లో ఉప్పల్ స్టేడియానికి 60 ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ప్రకటించింది.
TSRTC Special Buses : క్రికెట్ అభిమానులకు టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. హైదరాబాద్ ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో రేపటి(గురువారం) నుంచి ఐదు రోజుల పాటు ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ టెస్ట్ మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్ ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు వెళ్లే క్రికెట్ అభిమానుల కోసం టీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. హైదరాబాద్ లోని వివిధ ప్రాంతాల నుంచి ఉప్పల్ స్టేడియానికి 60 బస్సులను నడుపుతోంది. ప్రతి రోజు ఉదయం 8 గంటలకు ప్రారంభమై.. తిరిగి రాత్రి 7 గంటల వరకు స్టేడియం నుంచి ఈ బస్సులు బయలుదేరుతాయి. ఈ ప్రత్యేక బస్సులను వినియోగించుకుని మ్యాచ్ ను వీక్షించాలని క్రికెట్ అభిమానులను టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కోరారు.
ఉప్పల్ స్టేడియం వద్ద ట్రాఫిక్ ఆంక్షలు
హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో గురువారం నుంచి భారత్, ఇంగ్లాండ్ మధ్య తొలి టెస్ట్ జరుగనుంది. మ్యాచ్ భద్రతా ఏర్పాట్లపై రాచకొండ సీపీ సుధీర్ బాబు సమీక్షించారు. గురువారం ఉదయం 6.30 నుంచి క్రికెట్ ప్రేక్షకులను స్టేడియం లోపలికి అనుమతిస్తామని తెలిపారు. ఉప్పల్ స్టేడియం చుట్టూ 360 సీసీ కెమెరాలు ఉన్నాయని, నిరంతరం స్టేడియం పరిసరాలపై నిఘా ఉంచుతామన్నారు. భారీ సంఖ్యలో ప్రేక్షకులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి రద్దీ సమయాల్లో స్టేడియం చుట్టూ ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తామన్నారు. 1500 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశామని సీపీ సుధీర్ బాబు తెలిపారు. వీరితో పాటు ఆక్టోపస్ బలగాలను రంగంలోకి దించామన్నారు. 100 షీ టీమ్స్ మఫ్టీలో ఉంటాయన్నారు. స్టేడియంలోకి కెమెరాలు, ల్యాప్ టాప్స్, బ్యాగ్స్, సిగెరెట్స్, హెల్మెట్స్, వాటర్ బాటిల్స్, పెన్స్, పవర్ బ్యాంక్స్, బయటి ఫుడ్ అనుమతించమని స్పష్టం చేశారు. అన్ని వెరిఫై చేసిన తర్వాత స్టేడియంలోకి అనుమతిస్తామన్నారు. ఒకసారి బయటకు వస్తే తిరిగి లోపలికి అనుమతించమని చెప్పారు. మ్యాచ్‌కి వచ్చే ప్రేక్షకులకు పార్కింగ్ సదుపాయాలు కల్పించామన్నారు. ప్రేక్షకులు కూడా క్రమశిక్షణతో ఉండాలని సీపీ సుధీర్ బాబు కోరారు.
ప్రత్యేక వ్యూహంతో బరిలోకి- రోహిత్ శర్మ
భారత్, ఇంగ్లాండ్ ఐదు టెస్టుల సిరీస్ రేపటి నుంచి ప్రారంభం కానుంది. టెస్టు సిరీస్ సన్నద్ధతపై టీమ్‌ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ మీడియాతో మాట్లాడాడు. ప్రత్యర్థుల ఆటపై తనకు ఆసక్తి లేదని, మన ఆటను మనం ఆడాల్సిందే అన్నారు. జట్టుగా మైదానంలో మన ప్రదర్శనపై దృష్టి పెట్టినట్లు తెలిపాడు. గతేడాది మా ఆటగాళ్లు నిలకడ ప్రదర్శించారన్నాడు. టెస్టు మ్యాచ్‌లో ఆడటం ప్రతి క్రికెటర్ పెద్ద సవాల్ అన్నాడు. ఉప్పల్ మ్యాచ్ లో ప్రత్యేక వ్యూహంతో బరిలోకి దిగుతామన్నాడు. ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌ను గెలుస్తామనే నమ్మకం ఉందన్న రోహిత్.... భారత్ జట్టులో అద్భుతమైన ప్లేయర్లు ఉన్నారన్నాడు. 20 ఏళ్ల కిందట టెస్టు సిరీస్‌కు ఇప్పటికి ఎన్నో మార్పులను చూశామన్నాడు. ఈ సిరీస్‌లో కుల్‌దీప్ రాణిస్తాడని ఆశిస్తున్నామన్నాడు. హైదరాబాదీ పేసర్ సిరాజ్ జట్టులో కీలకమైన బౌలర్ అన్నాడు. తొలి రెండు టెస్టులకు కోహ్లీ లేకపోవడం పెద్ద లోటే అని రోహిత్ తెలిపాడు.