Hyderabad Power Cuts : నేటి నుంచి ఫిబ్రవరి 10 వరకు హైదరాబాద్ లో పవర్ కట్స్, ఎందుకంటే?-hyderabad news in telugu power cuts up to february 10th in city due to maintenance electric lines repair works ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Hyderabad Power Cuts : నేటి నుంచి ఫిబ్రవరి 10 వరకు హైదరాబాద్ లో పవర్ కట్స్, ఎందుకంటే?

Hyderabad Power Cuts : నేటి నుంచి ఫిబ్రవరి 10 వరకు హైదరాబాద్ లో పవర్ కట్స్, ఎందుకంటే?

HT Telugu Desk HT Telugu
Jan 17, 2024 07:30 PM IST

Hyderabad Power Cuts : హైదరాబాద్ లో నేటి నుంచి ఫిబ్రవరి 10వ తేదీ వరకు పవర్ కట్స్ ఉంటాయని విద్యుత్ అధికారులు తెలిపారు. మెయింటినెన్స్ పనుల్లో భాగంగా విద్యుత్ కోతలు విధిస్తున్నట్లు ప్రకటించారు.

హైదరాబాద్ లో విద్యుత్ కోతలు
హైదరాబాద్ లో విద్యుత్ కోతలు (Pixabay )

Hyderabad Power Cuts : హైదరాబాద్ నగరంలో నేటి నుంచి కరెంట్ కోతలు అమల్లోకి రానున్నాయి. రాబోయే వేసవి కాలం దృష్ట్యా మరమ్మతు పనుల్లో భాగంగా ఈ కోతలను అమలు చేస్తున్నట్లు టీఎస్ఎస్పీడీసీఎల్ ఎండీ ముసరాఫ్ అలీ షారుక్కి పేర్కొన్నారు. ఈ విద్యుత్ కోతల వల్ల ప్రజలకు కలిగే అసౌకర్యానికి చింతిస్తున్నామని, జీహెచ్ఎంసీ పరిధిలోని పలు ప్రాంతాల్లో పవర్ కట్స్ ఉంటాయని ఆయన పేర్కొన్నారు. నేటి నుంచి ఫిబ్రవరి 10 వరకు పవర్ కట్స్ ఉంటాయని చెప్పారు. వేసవి, రబీ సీజన్ లో అధిక విద్యుత్ డిమాండ్ కు సిద్ధం కావడానికి వార్షిక నిర్వహణలో భాగంగా రెండు గంటల వరకు విద్యుత్ కోతలు ఉండే ఛాన్స్ ఉందని ఆయన చెప్పారు.

మెయింటైనెన్స్ పనుల కోసం నగరంలో కరెంటు కోతలు

మెయింటినెన్స్ పనుల్లో భాగంగా విద్యుత్ తీగల పైకి పెరిగిన చెట్లను తొలగించడం, విద్యుత్ లైన్లను సరిచూసుకోవడం, అవసరమైతే కొత్త వాటిని వేస్తామని టీఎస్ఎస్పీడీసీఎల్ ఎండీ అలీ షారుక్కి తెలిపారు. విద్యుత్ కోతలు ఉంటాయని చెప్పినంత మాత్రాన రోజువారి కోతలు ఉండవని ఒక్కో ఫీడర్ ఒక్కో రోజు మాత్రమే ఉంటాయని పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో దాదాపు 3000 బెస్ ఫీడర్లు ఉన్నాయని .....నేటి నుంచి ఫిబ్రవరి 10 వరకు (ఆదివారాలు, పండుగలు మినహా) 10 నిమిషాల నుంచి రెండు గంటల వరకు విద్యుత్ నిలిపి వేసి నిర్వహణ పనులను పూర్తి చేయాలని క్షేత్ర స్థాయి సిబ్బందిని ఆదేశించామన్నారు. నిర్వాహణ పనులు జరిగే ప్రాంతాల్లో మాత్రమే పవర్ కట్స్ ఉంటాయని చెప్పారు. విద్యుత్ అంతరాయాలకు సంబంధించిన పూర్తి వివరాలను http://tssouthernpower.com వెబ్ సైట్ లో అప్లోడ్ చేస్తామన్నారు.

విద్యుత్ కోతలపై బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్

ఇదిలా ఉంటే హైదరాబాద్ లో కరెంట్ కోతల విషయంపై సామాజిక మాధ్యమాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. బీఆర్ఎస్,కాంగ్రెస్ శ్రేణులు ఒకరిపై ఒకరు మాటల యుద్ధం కొనసాగిస్తున్నారు. ఒకవైపు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కరెంట్ కోతలు తప్పవని మాజీ సీఎం కేసిఆర్ అప్పటికే ప్రతీ సభలో చెప్పారని, ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు గడవక ముందే కరెంటు కోతలు మొదలు అయ్యాయని బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ చెప్పిందే ఇప్పుడు నిజమైందనీ బీఅర్ఎస్ శ్రేణులు అంటుంటే....మరోవైపు విద్యుత్ రంగంలో తీవ్రంగా అవినీతి జరిగిందని, విద్యుత్ కొనుగోలులో కేసీఆర్ అవినీతికి పాల్పడ్డారని కాంగ్రెస్ శ్రేణులు ఆరోపిస్తున్నారు. అసెంబ్లీ సాక్షిగా విడుదల చేసిన శ్వేతపత్రం ఆధారంగా బీఆర్ఎస్ పై కాంగ్రెస్ శ్రేణులు విమర్శలు చేస్తున్నారు. కేసీఆర్ దాదాపు రూ.8 వేల కోట్ల అప్పులు చేశారని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తోంది.

రిపోర్టింగ్ : కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్ జిల్లా

Whats_app_banner