Hyderabad Crime : రామంతపూర్ లో దారుణం, ఆస్తి కోసం అమ్మనే కడతేర్చిన కొడుకు
Hyderabad Crime : హైదరాబాద్ రామంతపూర్ లో దారుణం జరిగింది. ఆస్తి కోసం కన్న తల్లినే హత్య చేశాడు కొడుకు.
Hyderabad Crime : హైదరాబాద్ ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రామంతపూర్ లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఆస్తి కోసం తన కన్న తల్లినే హత్య చేశాడు ఓ కొడుకు. ఉప్పల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...రామంతపూర్ లోని వెంకట్ రెడ్డి నగర్ లో కాసవేని సుగుణమ్మ (65) అనే వృద్ధురాలు కొడుకు అనిల్, కోడలు తిరుమలతో కలిసి గత కొన్నేళ్లుగా నివాసం ఉంటుంది. కొడుకు అనిల్ అధిక అప్పులు చేసి ఎలాంటి పని చేయకుండా ఇంట్లోనే కాలం వెళ్లదీస్తున్నాడు. ఈ నేపథ్యంలో సుగుణమ్మ పేరుపై ఉన్న ఇంటి కోసం తల్లితో తరుచూ గొడవపడేవాడు. కొడుకు వేధింపులు భరించలేక తల్లి సుగుణమ్మ ఐదేళ్ల క్రితమే ఇంటిని కోడలు తిరుమల పేరిట రిజిస్ట్రేషన్ చేసింది. అయితే ఈనెల 4న అర్ధరాత్రి సుగుణమ్మ ఇంట్లో నిద్రపోయింది. అదే రాత్రి కొడుకు అనిల్, కోడలు తిరుమల మరో వ్యక్తి ఆమెను హత్య చేయాలని ప్లాన్ వేశారు. సుగుణమ్మ నిద్రలో ఉండగానే ఆ ముగ్గురూ కలిసి దిండుతో ఊపిరాడకుండా చేసి హత్య చేశారు. నిద్రలోనే ఆమె చనిపోయినట్టు మరుసటి రోజు బంధువులకు సమాచారం ఇచ్చారు. సాధారణ మరణంగా నమ్మించే ప్రయత్నం చేశారు కొడుకు, కోడలు.
బంధువులు సుగుణమ్మ మృతదేహానికి స్నానం చేస్తుండగా మెడపై కమిలిపోయిన ఆనవాళ్లు కనిపించడంతో..... అనుమానంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. సుగుణమ్మ మృతదేహానికి వైద్యులు శవపరీక్ష చేయగా.....సుగుణమ్మది సాధారణ మరణం కాదని, ఆమెది హత్యే అని వైద్యులు పోస్ట్ మార్టం రిపోర్ట్ లో స్పష్టం చేశారు. దీంతో ఉప్పల్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చెయ్యడంతో శనివారం అసలు నిందితులు కొడుకు అనిల్, కోడలు తిరుమల అని పోలీసులు నిర్ధారించారు. దీంతో అనిల్, తిరుమలతో పాటు మరో వ్యక్తి పై హత్యా నేరం కింద కేసు నమోదు చేశారు.
పాత కక్షలతో వ్యక్తి దారుణ హత్య
పాత కక్షలతో వ్యక్తి దారుణ హత్యకు గురైన ఘటన కాలపత్తర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై నాయుడు తెలిపిన వివరాల ప్రకారం... మెయిలర్ దేవ్ పల్లికి చెందిన షేక్ అఫ్రోజ్(45) కు భార్య, ఐదుగురు పిల్లలు ఉన్నారు. శనివారం అర్ధరాత్రి పురాణపూల్ నుంచి మెయిలర్ దేవ్ పల్లికి స్కూటీ పై వెళుతుండగా మార్గ మధ్యలో అఫ్రోజ్ తో పాత కక్షలు ఉన్న ఇద్దరు వ్యక్తులు ఎదురుకావడంతో.....అఫ్రోజ్, ఆ ఇద్దరి మధ్య మాట మాట పెరిగి గొడవ పెద్దదైంది. దీంతో ఆగ్రహానికి గురైన ఆ ఇద్దరు వ్యక్తులు తమ వెంట తెచ్చుకున్న కత్తులతో షేక్ అఫ్రోజ్ పై విచక్షణారహితగా దాడి చేసి పరారయ్యారు. తీవ్రంగా గాయపడ్డ అఫ్రోజ్ ను స్థానికులు ఆస్పత్రికి తరలించగా మార్గమధ్యంలోనే ప్రాణాలు కోల్పోయాడు. మృతుడి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కాలపత్తర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
రిపోర్టింగ్ : కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్ జిల్లా