Hyderabad Crime : హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రి భవనం పై నుంచి దూకి రోగి ఆత్మహత్య-hyderabad crime news in telugu patient committed suicide in nims hospital ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Hyderabad Crime : హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రి భవనం పై నుంచి దూకి రోగి ఆత్మహత్య

Hyderabad Crime : హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రి భవనం పై నుంచి దూకి రోగి ఆత్మహత్య

HT Telugu Desk HT Telugu
Jan 29, 2024 03:17 PM IST

Hyderabad Crime : హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రి పై నుంచి దూకి ఓ రోగి ఆత్మహత్య చేసుకున్నాడు. అనారోగ్యం, మానసిక ఒత్తిడి వల్లే తన తండ్రి ఆత్మహత్యకు పాల్పడ్డారని మృతుడి కుమారుడు తెలిపారు.

నిమ్స్ ఆసుపత్రిలో రోగి ఆత్మహత్య
నిమ్స్ ఆసుపత్రిలో రోగి ఆత్మహత్య

Hyderabad Crime :హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఓ రోగి ఆదివారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం వై.లక్ష్మీపురం గ్రామానికి చెందిన ఆరెంపుల లచ్చయ్య (55) అనారోగ్యం బారిన పడడంతో కుటుంబ సభ్యులు అతన్ని ఈ నెల 19వ తేదీన నిమ్స్ ఆస్పత్రిలో చేర్చారు. లచ్చయ్యకు వైద్యులు ఆపరేషన్ చేసి స్పెషాలటీ బ్లాక్ రెండో అంతస్తులోని ఓపి బ్లాక్ లో రూమ్ కేటాయించారు. అయితే శనివారం రాత్రి 11 గంటల ప్రాంతంలో భోజనం చేసిన తర్వాత లచ్చయ్య బెడ్డుపై నిద్రపోయాడు. ఆయన కుమారుడు గురునాథం బెడ్ పక్కనే కుర్చీపై పడుకున్నాడు. తెల్లవారుజామున మూడున్నర గంటల ప్రాంతంలో కొడుకు గురునాథం లేచి చూడగా....మంచంపై తండ్రి లచ్చయ్య కనిపించలేదు. వెంటనే వెయిటింగ్, వాష్ రూమ్ లో వెతికినా కనిపించకపోవడంతో..... కిటికీలోంచి కొందరు చూడగా కొంతమంది లచ్చయ్యను దూకొద్దని అరుస్తుండటం కొడుకు గురునాథం గమనించారు. అతడు కిందికి వెళ్లే లోపే తండ్రి లచ్చయ్య కిందకు దూకేశాడు. రక్తపుమడుగులో పడి ఉన్న లచ్చయ్యను సెక్యూరిటీ సిబ్బంది ఆస్పత్రిలోని అత్యవసర విభాగానికి తరలించారు. వైద్యులు లచ్చయ్యకు చికిత్స అందించినా ఫలితం లేకపోయింది. ఉదయం ఐదున్నర గంటలకు లచ్చయ్య మృతి చెందాడు. అనారోగ్యం, మానసిక ఒత్తిడి వల్లే తన తండ్రి ఆత్మహత్యకు పాల్పడినట్లు కుమారుడు గురునాథం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే నిమ్స్ ఆస్పత్రి సెక్యూరిటీ సిబ్బంది తొందరగా స్పందించి అప్రమత్తమై ఉంటే లచ్చయ్య బతికే వాడని ఆస్పత్రిలో పలువురు ఆరోపిస్తున్నారు.

yearly horoscope entry point

ఆర్థిక ఇబ్బందులతో యువకుడు ఆత్మహత్య

ఆర్థిక ఇబ్బందులతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం...... అల్వాల్ సూర్యనగర్ లో నివాసం ఉండే శివప్రసాద్ (25) కార్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. శివ ప్రసాద్ ప్రైవేట్ బ్యాంకులో లోన్ తీసుకొని కారు నడుపుతున్నాడు. ఇటీవల ఆర్థిక ఇబ్బందులతో కార్ లోన్ చెల్లించకపోవడంతో ఫైనాన్స్ వాళ్ల నుంచి ఒత్తిడి పెరిగింది. దీంతో తీవ్ర మానసిక ఆందోళనకు గురయ్యాడు. వారం కిందట అతని భార్య పిల్లలు బంధువుల ఇంటికి వెళ్లగా....ఆదివారం అర్ధరాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఉదయం భార్య ఫోన్ చేస్తే సమాధానం రాకపోవడంతో స్థానిక బంధువులకు ఫోన్ చేసి ఇంటికి పంపించింది. బంధువులు ఇంటికి వెళ్లి చూడగా..... శివప్రసాద్ మృతి చెంది ఉన్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

రోడ్డు ప్రమాదంలో ఇంజినీరింగ్ విద్యార్థి దుర్మరణం

అతివేగంగా వచ్చిన కారు మూలమలుపు వద్ద అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టిన ప్రమాదంలో ఓ ఇంజినీరింగ్ విద్యార్థి అక్కడికక్కడే మృతి చెందాడు. కారులో ప్రయాణిస్తున్న మరో నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటన దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది . సిద్దిపేట జిల్లా ఇమాబాద్ గ్రామానికి చెందిన నాయిని మహేందర్ రెడ్డి కుమారుడు నాయక్ కళ్యాణ్ రెడ్డి ( 20) మైసమ్మగుడలోని సీఎంఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. స్నేహితులు జానకిరామ్, చందు, ధనుష్ శివ లతో కలిసి కొంపల్లిలో ఉంటున్నాడు. వీరంతా శనివారం రాత్రి కారులో బాచుపల్లిలో ఇతర స్నేహితులను కలిసి భోజనం చేశారు. అనంతరం తిరిగి ఆదివారం తెల్లవారుజామున ఒంటిగంట సమయంలో కారులో కొంపల్లి వైపు వస్తున్నారు. ఈ క్రమంలో వేగంగా వస్తున్న కారు సాయినాథ్ సొసైటీ మూలమలుపు దగ్గర అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టి బోల్తా పడింది. కారు ముందు సీట్లో కూర్చున్న కళ్యాణ్ రెడ్డి తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. కారు నడుపుతున్న జానకిరామ్, స్నేహితులు చందు ,ధనుష్ లకు స్వల్ప గాయాలు అయ్యాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

రిపోర్టింగ్ : కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్

Whats_app_banner