Hyderabad Crime : హాస్టళ్లలో ల్యాప్ టాప్ లు చోరీ, యాప్ లో విక్రయాలు- ఇంజినీరింగ్ విద్యార్థి అరెస్ట్-hyderabad crime news engineering student arrested laptops robbery in hostels ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Hyderabad Crime : హాస్టళ్లలో ల్యాప్ టాప్ లు చోరీ, యాప్ లో విక్రయాలు- ఇంజినీరింగ్ విద్యార్థి అరెస్ట్

Hyderabad Crime : హాస్టళ్లలో ల్యాప్ టాప్ లు చోరీ, యాప్ లో విక్రయాలు- ఇంజినీరింగ్ విద్యార్థి అరెస్ట్

HT Telugu Desk HT Telugu
Jan 24, 2024 05:47 PM IST

Hyderabad Crime : హైదరాబాద్ లోని పలు హాస్టల్స్ లో ల్యాప్ టాప్ల చోరీలకు పాల్పడుతున్న ఓ ఇంజినీరింగ్ విద్యార్థి, మరో నిందితుడ్ని దుండిగల్ పోలీసులు అరెస్టు చేశారు.

ల్యాప్ టాప్ దొంగలు అరెస్టు
ల్యాప్ టాప్ దొంగలు అరెస్టు

Hyderabad Crime : హైదరాబాద్ లో నగరంలోని పలు హాస్టల్స్ లో ల్యాప్ టాప్ల చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను దుండిగల్ పోలీసులు అరెస్ట్ చేశారు. జల్సాలకు అలవాటు పడిన ఓ ఇంజినీరింగ్ విద్యార్థితో పాటు మరో నిందితున్ని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. వారి నుంచి రూ.10 లక్షలు విలువ చేసే 20 ల్యాప్ టాప్లను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.

ఐడీ కార్డు, బ్యాగ్ తో వచ్చి హాస్టల్లో చోరీ

గాజులరామారంలోని భవాని నగర్ కు చెందిన ఆపాల బాలాజీ (20) నగరంలోని ఓ కళాశాలలో ఇంజినీరింగ్ చదువుతున్నాడు. జల్సాలకు అలవాటు పడిన బాలాజీ సులభంగా డబ్బు సంపాదించేందుకు దొంగతనాలు చేసేందుకు నిర్ణయించుకున్నాడు. అందుకోసం ప్రైవేట్ హాస్టల్లో సెక్యూరిటీ తక్కువ ఉంటుందని గుర్తించి, మెడలో కళాశాల ఐడీ కార్డు, బ్యాగుతో హాస్టల్లో తన స్నేహితుడు ఉన్నాడని చెప్పి లోపలికి వెళ్లేవాడు. తాళాలు పగలుగొట్టి గదుల్లో ల్యాప్ టాప్ లు చోరీ చేసేవాడు. ఇదిలా ఉంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజ్ కుమార్ (20) అనే యువకుడు నగరానికి వలస వచ్చి హిమాయత్ నగర్ అడ్వకేట్స్ కాలనీలో నివాసం ఉంటున్నాడు. అదే రాష్ట్రానికి చెందిన పర్వీజ్ కుమార్ అనే వ్యక్తి సలహాతో క్యాష్పై యాప్ లో పికప్ ఏజెంట్ గా చేరాడు. ఇక అదే యాప్ లో పర్వేజ్ కుమార్ డీలర్ గా పని చేస్తున్నాడు. ఈ క్యాష్పై యాప్ లో బిల్లులు లేకుండానే ల్యాప్ టాప్ లు, మొబైల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను విక్రయించవచ్చు.

హాస్టళ్లలో చోరీలు, యాప్ లో విక్రయాలు

అయితే బాలాజీ మొదటిసారి ల్యాప్ టాప్ ను ఆ యాప్ లో విక్రయించగా.....అప్పటినుంచి డీలర్ రాజ్ కుమార్ తో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలోనే గండి మైసమ్మ చౌరస్తా పరిసర ప్రాంతాల్లో హాస్టల్లో బాలాజీ ల్యాప్ టాప్ లు చోరీలు చేస్తూ రాజకుమార్ కు విక్రయించేవాడు. దుండిగల్ పోలీసులకు ల్యాప్ టాప్ చోరీలు ఫిర్యాదులు ఎక్కువగా రావడంతో నేరస్థుల కదలికలపై దృష్టి సారించారు. విశ్వసనీయ సమాచారం మేరకు బాలాజీ మంగళవారం గండిమైసమ్మ చౌరస్తాలో అనుమానాస్పదంగా తిరుగుతూ ఉండడం గుర్తించిన బాలనగర్ ఎస్ఓటీ, దుండిగల్ పోలీసులు బాలాజీని పట్టుకున్నారు. అతడు ఇచ్చిన సమాచారం మేరకు హిమాయత్ నగర్ చెందిన రాజ్ కుమార్ ను కూడా అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారి నుంచి రూ.10 లక్షల విలువ చేసి 20 ల్యాప్ టాప్ లు, రెండు సెల్ ఫోన్లు, హోండా యాక్టివా వాహనాన్ని స్వాధీనం తీసుకొని రిమాండ్ కు తరలించారు. ఈ చోరీల్లో హస్తం ఉన్న మరో నిందితుడు పర్వేజ్ కుమార్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

రిపోర్టింగ్ : కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్ జిల్లా

Whats_app_banner