EV Charging Stations : హైదరాబాద్ విమానాశ్రయం.. ఈవీ ఛార్జింగ్, బయో-డీజిల్ ఫిల్లింగ్ స్టేషన్లు ప్రారంభం
హైదరాబాద్ విమానాశ్రయం ఈవీ ఛార్జింగ్, బయో-డీజిల్ ఫిల్లింగ్ స్టేషన్లను ప్రారంభించింది. ఈ మేరకు వినియోగదారులకు సర్వీస్ అందుబాటులోకి వచ్చింది.
రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్వహిస్తున్న GMR హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ (GHIAL) ప్రధాన కార్ పార్కింగ్ వద్ద EV (ఎలక్ట్రిక్ వెహికల్) ఛార్జింగ్ స్టేషన్‌ను ప్రారంభించింది. అంతేకాదు.. పబ్లిక్ ట్రాన్స్‌పోర్టేషన్ సెంటర్‌లో బయో-డీజిల్ ఫిల్లింగ్ స్టేషన్‌ను ప్రారంభమైంది.
ఈ సేవను పొందాలనుకునే EV వినియోగదారులకు ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్ అందుబాటులో ఉంటుంది. 30 KWతో ఒక గంటలో వాహనాన్ని జీరో నుంచి ఫుల్ ఛార్జ్ చేయగలదు. ఛార్జింగ్ స్టేషన్ యాప్ ఆధారితమైనది. Android, IOS యాప్ మొబైల్ పరికరాల ద్వారా ఉపయోగించొచ్చు. మొట్టమొదటిసారిగా GHIAL విమానాశ్రయంలో బయో-డీజిల్ ఫిల్లింగ్ స్టేషన్‌ను ప్రవేశపెట్టింది.
ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించేలా ప్రజలను ప్రోత్సహించే లక్ష్యంతో నగరంలో ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని గతంలో ప్రతిపాదన వచ్చిన విషయం తెలిసిందే. భాగ్యనగరంలో 300 పబ్లిక్ ఎలక్ట్రిక్ వెహికల్ (ఈవీ) ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC), హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ పరిధిలో నిర్వహిస్తారు. ఛార్జింగ్ ఖర్చు.. ₹18 kilowatt per hour (kWh) గా నిర్ణయించారు. అయితే అవసరాన్ని బట్టి.. ధరలు సవరిస్తారని.. తెలంగాణ స్టేట్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్(TSREDCO) అధికారి గతంలోనే చెప్పారు.
ఇందిరా పార్క్, KBR పార్క్ గేట్ 1, సంతోష్ నగర్ (ఒవైసీ హాస్పిటల్ సమీపంలో), ఉప్పల్ మెట్రో స్టేషన్ పార్కింగ్ ప్రాంతం వంటి అనేక ప్రదేశాలలో ఈ EV ఛార్జింగ్ స్టేషన్లు అందుబాటులోకి రానున్నాయి. ప్రతి మూడు కిలోమీటర్లకు ఒక ఛార్జింగ్ స్టేషన్‌ను ఏర్పాటు చేయాలని ప్రణాళిక చేస్తున్నారు. అవసరం అయితే.. మళ్లీ సంఖ్యను పెంచుతారు. GHMC, TSREDCO పరస్పరం అంగీకరంతో ఆదాయాన్ని పంచుకుంటాయి.
ప్రస్తుతం, నగరంలో దాదాపు 150 EV ఛార్జింగ్ స్టేషన్లు ఉన్నాయి. వీటిని హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు, పెట్రోల్ బంక్‌లు మొదలైన వాటికి సమీపంలో ఏర్పాటు చేశారు. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించడంలో రాష్ట్ర ప్రభుత్వం ముందు ఉంది. ఎలక్ట్రిక్ మొబిలిటీ అవేర్‌నెస్ వెబ్ పోర్టల్ ను కూడా ప్రారంభించింది.
ఇందిరా పార్క్, KBR పార్క్ గేట్-1, గేట్-3, గేట్-6, ట్యాంక్ బండ్ రోడ్, మున్సిపల్ పార్కింగ్ కాంప్లెక్స్, అబిడ్స్, నానక్ రామ్ గూడ, మహావీర్ హరినా వనస్థలి నేషనల్ పార్క్, వనస్థలిపురం, ఉప్పల్ మెట్రో స్టేషన్ పార్కింగ్ ప్రాంతం, సంతోష్ నగర్ (ఒవైసీ హాస్పిటల్దగ్గర), తాజ్ త్రిస్టార్ హోటల్ దగ్గర, SD రోడ్ (సికింద్రాబాద్)లాంటి ప్రాంతాల్లో ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసే అవకాశం ఉంది.