HT This Day: హైదరాబాద్ రాష్ట్రంలో నాడు ఏం జరిగింది?
HT This Day: హైదరాబాద్ రాష్ట్రం మిలటరీ పాలనలోకి వెళ్లింది. భారతీయ సైన్యానికి చెందిన ఫస్ట్ ఆర్మర్డ్ డివిజన్ కమాండర్ మేజర్ జనరల్ జేఎన్ చౌధరీ పరిపాలన బాధ్యతలు చేపట్టారు. ఆయనను భారత ప్రభుత్వం హైదరాబాద్ రాష్ట్ర మిలటరీ గవర్నర్ గా నియమించింది.
HT This Day: 1948 సెప్టెంబర్ 17 న హైదరాబాద్ రాష్ట్రంలో నిజాం రాజు పాలన ముగిసింది. నిజాం రాజు భారత ప్రభుత్వానికి లొంగిపోయారు. భారత ప్రభుత్వం తరఫున మిలటరీ గవర్నర్ గా మేజర్ జనరల్ జేఎన్ చౌధరి పాలన బాధ్యతలు చేపట్టారు. ఈ వివరాలను `హిందుస్తాన్ టైమ్స్ వీక్లీ` ప్రచురించింది.
HT This Day: ఐదో నెంబర్ మైలు రాయి
సికింద్రాబాద్ శివార్లలో ఐదో నెంబర్ మైలు రాయి వద్ద సెప్టెంబర్ 17 సాయంత్రం 4.30 గంటల సమయంలో హైదరాబాద్ ఆర్మీ చీఫ్ మేజర్ జనరల్ ఎల్ ఎడ్రూస్ ఏజెంట్ జనరల్ కేఎం మున్షీ సమక్షంలో భారతీయ సైన్యాధికారి మేజర్ జనరల్ జేఎన్ చౌదరి ముందు లొంగిపోయారు. నిజానికి ఈ కార్యక్రమం మధ్యాహ్నం 12 గంటలకే జరగాల్సి ఉండగా, హైదరాబాద్ షోలాపూర్ మార్గాన్ని నిజాం సైన్యాలు పూర్తిగా ధ్వంసం చేయడంతో, భారతీయ సైన్యం హైదరాబాద్ చేరుకోవడం ఆలస్యమైంది.
HT This Day: లేక్ వ్యూ గెస్ట్ హౌజ్
అనంతరం మేజర్ జనరల్ ఎల్ ఎడ్రూస్, మేజర్ జనరల్ జేఎన్ చౌదరి కలిసి లేక్ వ్యూ గెస్ట్ హౌజ్ కు వెళ్లారు. అనంతరం, లేక్ వ్యూ గెస్ట్ హౌజ్ ను గవర్నర్ తన అధికారిక నివాసం, హెడ్ క్వార్టర్ గా మార్చుకున్నారు. యుద్ధ ట్యాంకులతో పాటు నగరంలోకి అడుగుపెట్టిన భారతీయ సైన్యానికి నగర పౌరులు రోడ్డుకు ఇరువైపుల నిల్చుని జైహింద్ నినాదాలతో ఘన స్వాగతం పలికారు.
HT This Day: లాయక్ అలీ కేబినెట్
నిజాం రాజు భారత ప్రభుత్వానికి లొంగిపోయిన అనంతరం, లాయక్ అలీ మంత్రివర్గంలోని మంత్రులందరినీ హౌజ్ అరెస్ట్ చేశారు. రజాకార్ల నాయకుడు కాశి రజ్వీని అరెస్ట్ చేయడానికి ఆదేశాలు జారీ అయ్యాయి. హైదరాబాద్ ఆర్మీకి చెందిన ఆయుధాలన్నీ గోల్కోండ కోటలో ఉంటాయి. వాటిని భారతీయ సైన్యానికి స్వాధీనం చేశారు. హైదరాబాద్ ఆర్మీ బాధ్యతలను ఇండియన్ ఆర్మీ చేపట్టింది. సెప్టెంబర్ 17 నుంచి కొన్ని రోజుల పాటు సాయంత్రం 7 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ విధించారు. ప్రైవేటు వ్యక్తుల వద్ద ఉన్న ఆయుధానలను స్వాధీనం చేసుకున్నారు.
HT This Day: రేడియో ప్రసంగం
హైదరాబాద్ రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిణామాలు, వాటికి కారణాలు, పర్యవసానాలు, భవిష్యత్ కార్యాచరణను మేజర్ జనరల్ జేఎన్ చౌదరి హైదరాబాద్ రేడియో ద్వారా రాష్ట్ర ప్రజలకు వివరించారు.
HT This Day: లా అండ్ ఆర్డర్
శాంతి భద్రతల పరిస్థితి అదుపులోకి తీసుకురావడం కోసం యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకున్నారు మేజర్ జనరల్ చౌదరి. హైదరాబాద్, సికింద్రాబాద్ లా అండ్ ఆర్డర్ బాధ్యతలను కొన్నాళ్ల పాటు మేజర్ జనరల్ ఎల్ ఎడ్రూస్ కు అప్పగించారు. నిజాం రాజు నిషేధించిన స్టేట్ కాంగ్రెస్ యాక్షన్ కమిటీ సభ్యులు, ఆ నిషేధాన్ని ఎత్తివేసిన అనంతరం క్రమంగా హైదరాబాద్ చేరుకున్నారు.