TS Graduate MLC Election 2024 : గులాబీ పార్టీకి సవాల్ గా గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నిక - ఈసారి గెలుపు సాధ్యమేనా..?-graduate mlc by election has become the biggest challenge for brs party ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts Graduate Mlc Election 2024 : గులాబీ పార్టీకి సవాల్ గా గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నిక - ఈసారి గెలుపు సాధ్యమేనా..?

TS Graduate MLC Election 2024 : గులాబీ పార్టీకి సవాల్ గా గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నిక - ఈసారి గెలుపు సాధ్యమేనా..?

HT Telugu Desk HT Telugu
Apr 27, 2024 07:13 AM IST

Telangana Graduate MLC By Election 2024 : ఖమ్మం-వరంగల్-నల్గొండ పట్టభద్రుల ఉపఎన్నికకు షెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసిందే. సిట్టింగ్ స్థానమైన ఇక్కడ మరోసారి గెలవటం బీఆర్ఎస్ పార్టీకి అతిపెద్ద సవాల్ గా మారిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

బీఆర్ఎస్ కు కఠిన పరీక్షగా ..  గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నిక
బీఆర్ఎస్ కు కఠిన పరీక్షగా .. గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నిక

Telangana Graduate MLC By Election 2024 : తెలంగాణ శాసన మండలిలో పట్టభద్రుల నియోజకవర్గానికి ( నల్గొండ - ఖమ్మం - వరంగల్ ) జరగనున్న ఎన్నిక ఈ సారి ప్రధాన ప్రతిపక్షం భారత రాష్ట్ర సమితి (BRS)కి కఠిన పరీక్ష పెట్టనున్నాయి. ఈ నియోజకవర్గం నుంచి వరసగా నాలుగు పర్యాయాలు విజయం సాధించిన ఆ పార్టీకి ఈ సారి ఎన్నిక సవాలు విసురుతోంది. 2021 మార్చిలో జరిగిన ఎన్నికల్లో డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి రెండో పర్యాయం గెలిచారు. కానీ, తెలంగాణ శాసన సభకు 2023 డిసెంబరులో జరిగిన ఎన్నికల్లో ఆయన ఉమ్మడి వరంగల్ జిల్లాలోని జనగామా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి శాసన సభకు ఎన్నిక కావడతో ఆయన తన పదవికి రాజీనామా చేశారు. దీంతో ఏర్పడిన ఈ ఖాళీని భర్తీ చేయడానికి ఎన్నిక అనివార్యమైంది. 2014 ముందు నుంచీ ఈ నియోజకవర్గంలో బీఆర్ఎస్ వరసగా నాలుగు పర్యాయాలుగా గెలుస్తూ వస్తోంది. మొదట కపిలవాయి దిలీప్ కుమార్ రెండు సార్లు, ఆ తర్వాత రెండు సార్లు డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి గెలిచారు.

హోరా హోరీగా సాగిన 2021 ఎన్నిక

నల్గొండ - ఖమ్మం - వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గానికి(Warangal Khammam Nalgonda Graduate MLC Election 2024) 2021 మార్చిలో ఎన్నికలు జరిగాయి. గత ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా తమ లక్ ను పరీక్షించుకునేందుకు ప్రధాన రాజకీయా పార్టీల అభ్యర్థులు సహా మొత్తంగా 76 మంది బరిలో నిలిచారు. హోరా హోరీగా సాగిన ఈ ఎన్నికల్లో ప్రధాన రాజకీయ పార్టీగా ఉండి బీఆర్ఎస్, స్వతంత్ర అభ్యర్థుల మధ్య పోటీ జరగడం విశేషం. ఆ ఎన్నికల్లో ఎమ్మెల్సీగా విజయం సాధించిన పల్లా రాజేశ్వర్ రెడ్డికి 1,11,190 ఓట్లు వచ్చాయి. రెండో స్థానంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో ఉండిన చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న కు 83,629 ఓట్లు పోలయ్యాయి. తెలంగాణ ఉద్యమంలో అన్నీ తానై ముందుండి నడిపి తెలంగాణ జేఏసీకి చైర్మన్ గా వ్యవహరించిన తెలంగాణ జనసమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం మూడో స్థానంలో నిలిచి 70,472 ఓట్లు తెచ్చుకున్నారు. బీజేపీ, కాంగ్రెస్, సీపీఐ లు ఆ తర్వాతి నాలుగ, అయిదు, ఆరో స్థానాలకే పరిమితం కావడం ఆ ఎన్నికల విశేషం. బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డికి 39,268, కాంగ్రెస్ నుంచి రాములు నాయక్ కు 27,713, సీపీఐ నుంచి జయ సారథిరెడ్డి కి 8,732 ఓట్లు వచ్చాయి. తెలంగాణ ఉద్యమ కారుడు డాక్టర్ చెరుకు సుధాకర్ కు 8,732, మాజీ జర్నలిస్ట్ రాణి రుద్రమకు 7,903 ఓట్లు పోలయ్యాయి. ప్రధాన పార్టీలను పక్కకు తోసి రెండో స్థానంలో అత్యధిక ఓట్లు తెచ్చుకున్న చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న ఇపుడు అధికార కాంగ్రెస్ నుంచి అభ్యర్థిగా పోటీకి దిగనుండడం ప్రస్తుతం జరగనున్న ఎన్నికల విశేషం.

బీఆర్ఎస్ కు కఠిన పరీక్ష

మే నెలలో జరగనున్న గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నిక బీఆర్ఎస్ కు సవాలుగా నిలవనుంది. నాలుగు సార్లు గెలుచుకున్న తమ సిట్టింగ్ స్థానాన్ని ఈ సారి నిలబెట్టుకోవడం ఆ పార్టీకి అంత తేలికైన విషయం ఏమీ కాదు. ఈ నియోజకవర్గం ప్రధానంగా విస్తరించి ఉన్న మూడు ఉమ్మడి జిల్లాలో అత్యధికంగా ఎమ్మెల్యేలను కలిగి ఉన్న కాంగ్రెస్ ప్రధాన పోటీదారుగా ఉండడమే కాకుండా, గత ఎన్నికల్లో స్వతంత్రంగానే రెండో స్థానంలో నిలిచిన తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉండడం కలిసి వచ్చే అంశంగా చెబుతున్నారు. వాస్తవానికి బీఆర్ఎస్, బీజేపీ, వామపక్షాలు తమ అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. రాష్ట్రంలో అధికారానిన కోల్పోయిన స్థితిలో లోక్ సభ ఎన్నికలను ఎదుర్కోవడంలోనే ఇబ్బందులు పడుతున్న బీఆర్ఎస్ కు మూడు జిల్లాల్లోని పట్టభద్రుల మనసు చూరగొని గట్టెక్కడం అంత తేలికైన విషయం ఏమీ కాదన్న అభిప్రాయం బలంగానే వ్యక్తం అవుతోంది. కాగా, ఈ నియోజకవర్గ ఎన్నికకు మే 27వ తేదీన ఓటింగ్ జరగనుండగా, జూన్ 5వ తేదీన ఓట్లను లెక్కించి విజేతను తేలుస్తారు.

( రిపోర్టింగ్ : క్రాంతీపద్మ, నల్గొండ,HT Telugu )

 

IPL_Entry_Point

సంబంధిత కథనం