Bharath Gaurav: పుణ్యక్షేత్రాలు చూడాలి అనుకుంటున్నారా.. ఈ రైలు మీ కోసమే..
Bharath Gaurav Express: దక్షిణ మధ్య రైల్వే పరిధిలో తొలి భారత్ గౌరవ్ రైలు మార్చి 18న ప్రారంభం కానుంది. దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను సందర్శించేందుకు వీలుగా తెలుగు రాష్ట్రాల్లోని పలు నగరాలు మీదుగా పయనించే ఈ రైలు దేశంలోని ముఖ్యమైన చారిత్రక, సాంస్కృతిక ప్రదేశాలను సందర్శించేందుకు వీలు కల్పిస్తుంది.
Bharath Gaurav Express: దక్షిణ మధ్య రైల్వే పరిధిలో మొట్టమొదటి భారత్ గౌరవ్ ఎక్స్‌ప్రెస్ మార్చి 18న ప్రారంభం కానుంది. దేశంలోని ముఖ్యమైన చారిత్రక, సాంస్కృతిక ప్రదేశాలను మరియు పుణ్యక్షేత్రాలను కలుపుతూ దేశంలో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేలా భారత్ గౌరవ్ రైళ్లను ప్రారంభించారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో మొదటి రైలు ఎల్లుండి మొదలవుతుంది.
ఐఆర్‌సిటిసి ద్వారా నిర్వహిస్తున్న భారత్ గౌరవ్ ఎక్స్‌ప్రెస్, రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రయాణికులు పలు నగరాల నుంచి తమ ప్రయాణాలను ప్రారంభించేందుకు వీలుగా నడుపుతున్నారు.
దేశంలోని విశిష్టమైన ప్రదేశాలను సందర్శించడంతో పాటు భారతదేశ గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని చాటిచెప్పే లక్ష్యంతో రైలు ప్రయాణం ద్వారా అనుసంధానించడానికి ‘భారత్ గౌరవ్’ పేరుతో ఈ రైలును ప్రవేశపెట్టారు. దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో ఇండియన్ రైల్వేస్ క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ మొదటి సర్వీస్ ప్రొవైడర్‌గా నమోదు చేసుకుంది.
ఐఆర్‌సిటిసి ఆధ్వర్యంలో మొదటి భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్ సర్వీస్ సికింద్రాబాద్ నుంచి మొదలవుతుంది. ‘పుణ్యక్షేత్ర యాత్ర పేరుతో నడిచే ప్రత్యేక రైలు పూరీ - కాశీ - అయోధ్య యాత్రగా సాగుతుంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి మొదలై రెండు తెలుగు రాష్ట్రాల లోని పలు స్టేషన్ లలో ప్రయాణికులు రాకపోకలు సాగించేందుకు వీలు కల్పిస్తుంది.
భారత్ గౌరవ్ ఎక్స్‌ప్రెస్‌లో అనేక చారిత్రక మరియు పుణ్యక్షేత్రాలను ఒకేసారి సందర్శించాలనుకునే వారికిఅనువుగా ఉంటుందని రైల్వే జిఎం తెలిపారు. యాత్ర మార్చి 18 నుంచి 26 మార్చి 2023 వరకు 8 రాత్రులు మరియు 9 పగల్ళు సాగనుంది. యాత్రలో భాగంగా పూరీ , కోణార్క్, గయా, వారణాసి, అయోధ్య, ప్రయాగ్‌రాజ్ వంటి ముఖ్యమైన ఆధ్యాత్మిక ప్రదేశాలను కవర్ చేస్తుంది, ఈ పర్యటన ప్రయాణికులకు వైవిధ్యమైన, సౌకర్యవంతమైన పర్యాటక అనుభూతిని అందిస్తుందని తెలిపారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఎంపిక చేయబడిన స్టేషన్ల నుండి ఇందులో ప్రయాణించవచ్చు. సికింద్రాబాద్, కాజీపేట, ఖమ్మం, విజయవాడ, రాజమండ్రి, విశాఖపట్నం మరియు విజయనగరం స్టేషన్ లలో ప్రయాణికులు ఎక్కవచ్చు / దిగవచ్చు. దూర ప్రాంత ప్రయాణాలకు వెళ్లే సమయంలో ప్రయాణికులకు ఎదురయ్యే ఇబ్బందుల్ని ఈ రైలు ద్వారా నిరోధించవచ్చని రైల్వే వర్గాలు చెబుతున్నాయి.
రైలు ప్రయాణంలో కనెక్టివిటీ, వసతి, ఆహారం మొదలైన ప్రయాణ సంబంధిత అన్ని రకాల ఇబ్బందులను భారత్ గౌరవ్ రైలు నివారిస్తుందని జిఎం తెలిపారు. రైలులో అన్నీ రకాల వసతులతో కలిసిన ప్యాకేజీతో సేవలను అందిస్తారని, ప్రయాణీకులు ఏర్పాట్ల గురించి ఏ మాత్రం ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. పర్యాటక రంగంలో విశేష అనుభవం ఉన్న ఐ ఆర్ సి టి సి అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత పర్యటన కార్యక్రమాలను రూపొందించిందని వివరించారు. భారత్ గౌరవ్ ఎక్స్‌ప్రెస్ సౌకర్యవంతమైన, సురక్షితమైన మరియు సురక్షితమైన ప్రయాణాన్ని అందిస్తుందని తెలిపారు.
పర్యటించే ప్రదేశాలివే….
భారత్ గౌరవ్ ఎక్స్‌ప్రెస్‌లో పుణ్యక్షేత్ర యాత్ర పూరి-కాశీ - అయోధ్య.. 8 రాత్రులు/9 పగళ్లు సాగుతుంది. సికింద్రాబాద్ నుంచి యాత్ర ప్రారంభమై - పూరి - కోణార్క్ - గయ - వారణాసి - అయోధ్య - ప్రయాగ్‌రాజ్ వరకు సాగుతుంది. తిరిగి సికింద్రాబాద్ చేరుకుంటుంది. ప్రయాణికులు సికింద్రాబాద్, కాజీపేట, ఖమ్మం, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, విశాఖపట్నం & విజయనగరం స్టేషన్ల నుంచి తమ ప్రయాణాన్ని ఎంపిక చేసుకోవచ్చు.
పుణ్యక్షేత్ర రైలులో 700సీట్లు అందుబాటులో ఉంటాయి. ఇందులో 460 స్లీపస్ సీట్లు, థర్డ్ ఏసీ 192 బెర్తులు, సెకండ్ ఏసీ బెర్తులు48 అందుబాటులో ఉంటాయి.
యాత్రలో భాగంగా పూరి జగన్నాథ దేవాలయం సందర్శన, కోణార్క్ సూర్యనారాయణ దేవాలయం, బీచ్ సందర్శన, గయలో విష్ణు పాద ఆలయం సందర్శన, వారణాసిలో కాశీ విశ్వనాథ ఆలయం మరియు కారిడార్ సందర్శన, కాశీ విశాలాక్షి మరియు అన్నపూర్ణా దేవి ఆలయ సందర్శన. సాయంత్రం గంగా హారతి వీక్షణ, అయోధ్యలో సరయు నది వద్ద రామజన్మ భూమి, హనుమాన్‌గర్హి మరియు హారతి కార్యక్రమాల వీక్షణ, ప్రయాగ్ రాజ్‌లో త్రివేణి సంగమం, హనుమాన్ మందిర్ మరియు శంకర్ విమాన మండపాలను సందర్శించవచ్చని తెలిపారు.
టాపిక్