Khammam District : ఇంట్లోనే గంజాయి సాగు..! తండ్రి కొడుకు అరెస్ట్
Khammam District Crime News: ఖమ్మం జిల్లాలో ఇంట్లోనే గంజాయి సాగు చేస్తున్న వ్యవహారం బయటపడింది. ఈ కేసులో తండ్రి, కొడుకు అరెస్ట్ కాగా… రిమాండ్ కు తరలించారు.
ఖమ్మం జిల్లాలో ఇంట్లోనే గంజాయి సాగు చేస్తున్న వైనం కలకలం రేపింది. గంజాయి, హెరాయిన్, కొకేయిన్ వంటి మాధక ద్రవ్యాలకు చరమగీతం పాడడానికి ప్రభుత్వం కంకణం కట్టుకున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో విచ్చలవిడిగా సరఫరా అవుతున్న మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపేందుకు పోలీస్ యంత్రాంగాన్ని సర్కారు ఓవైపు రంగంలోకి దించగా మరోవైపు అనేక రూపాల్లో మాదక ద్రవ్యాలు యువతకు సరఫరా అవుతూనే ఉన్నాయి.
తాజాగా ఏకంగా ఇంటి పెరటిలోనే గంజాయిని పెంచుతున్న చోద్యం వెలుగు చూసింది. ఖమ్మం జిల్లా చింతకాని మండలంలో ఓ తండ్రి కొడుకులు ఏకంగా ఇంటి పెరట్లోనే గంజాయి సాగు చేస్తున్న నిర్వాకం బట్టబయలైంది. గడిచిన 15 సంవత్సరాలుగా ఇంట్లోనే మొక్కల మధ్య గంజాయిని సాగు చేస్తున్న తీరు ఎట్టకేలకు రట్టయింది.
చింతకాని మండలం నాగులవంచ గ్రామానికి చెందిన కందిమల్ల వెంకటేశ్వర్లు, అతని కొడుకు శ్రీహరిలు గడిచిన కొన్నేళ్ళుగా ఇంట్లోనే పూల మొక్కల నడుమ గంజాయి మొక్కలను యదేచ్చగా సాగు చేస్తున్నారు. అంతటితో ఆగకుండా ఆ గంజాయిని నేరుగానే స్థానికులకు విక్రయిస్తున్నారు. కిరాణా దుకాణంలో కిరాణా సరుకులు అమ్మిన చందంగా స్థానికంగా ఉండే యువకులకు గంజాయిని ఎంచక్కా సరఫరా చేస్తున్నారు. కొన్నేళ్లుగా ఈ వ్యవహారం సాగిపోతున్నప్పటికీ ఎవరికీ అనుమానం రాలేదు. కాగా ఈ సమాచారం పోలీసుల చెవిన పడడంతో తొలుత వారు ఒకింత విస్తుపోయారు. అసలు విషయం తెలుసుకునే క్రమంలో అటు వంక ఓ కన్నేశారు.
ఆకస్మికంగా ఆ ఇంట్లో తనిఖీ నిర్వహించి చూడగా నిజంగానే ఇంట్లో గంజాయి సాగవుతున్నట్లు స్పష్టమయింది. దీంతో తొలుత పోలీసులే నిర్ఘాంతపోయారు. ఏకంగా తండ్రీ కొడుకులే గంజాయిని ఇంట్లో పెంచి విక్రయిస్తున్నట్లు నిగ్గు తేల్చారు. వెంటనే ఆ గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు తండ్రి, కొడుకులపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు.
ఇంటి పెరట్లోనే చెట్ల మధ్యలో గంజాయిని పెంచుతున్న వైనం జిల్లా వ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. ఓవైపు ప్రభుత్వం మాదకద్రవ్యాలపై కఠిన చర్యలకు ఉపక్రమిస్తుండగా మరోవైపు చడిచప్పుడు కాకుండా ఇంట్లోనే గంజాయిని పెంచుతున్న తీరు నిర్ఘాంతపరిచింది.