Janagama District : అధికారుల ధన దాహానికి అన్నదాత బలి..!
Jangaon District News: జనగామ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. లంచం తీసుకున్న కొందరు రెవెన్యూ అధికారులు… భూమి పట్టా చేయకపోవడంతో రైతు ఆత్మహాత్య చేసుకున్నాడు.
Jangaon District News : సాగు చేసుకుంటున్న భూమిని పట్టా చేసేందుకు లంచం తీసుకున్న అధికారులు పట్టించుకోకపోవడం, ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాల్సిందిగా వేడుకుంటే వేధింపులకు గురి చేస్తుండటంతో మానసిక వేదనకు గురైన ఓ అన్నదాత ఆత్మహత్య(Farmer suicide) చేసుకున్నాడు. తాను సాగు చేసే భూమి వద్దే ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఈ హృదయ విదారక ఘటన జనగామ జిల్లా బచ్చన్నపేట మండలంలో శుక్రవారం చోటు చేసుకుంది.
స్థానికులు, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన ప్రకారం పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. బచ్చన్నపేట మండలం పడమటి కేశవాపురం గ్రామానికి చెందిన కొమ్మట రఘుపతి(45) వ్యవసాయం చేసేవాడు. ఆయనకు అదే గ్రామ శివారులోని 75, 76 సర్వే నెంబర్లలో దాదాపు ఎకరంన్నర భూమి ఉండగా.. దానికి పట్టా పాస్ బుక్కులు లేవు. దీంతోనే రఘుపతి పలుమార్లు స్థానిక ఎమ్మార్వోకు వెళ్లి దరఖాస్తు పెట్టుకున్నాడు. అయినా అధికారులు ఎవరూ సరిగా పట్టించుకోలేదు. చివరకు అదే కార్యాలయంలో సర్వేయర్ గా పని చేస్తున్న రవీందర్, సీనియర్ అసిస్టెంట్ సుమన్ ఇద్దరూ కలిసి రఘుపతితో మాట్లాడారు. పట్టా పాస్ బుక్ లు చేసిస్తామని, కానీ అధికారులను చూసుకోవాలంటూ లంచం డిమాండ్ చేశారు. పెద్ద మొత్తంలో లంచం డిమాండ్ చేయగా.. రఘుపతి అంత ఇచ్చుకోలేనని చెప్పాడు. చివరకు ఎకరంన్నర పట్టా చేయడానికి రూ.4.5 లక్షలకు బేరం కుదిరింది.
డబ్బులు తీసుకుని వేధింపులు
భూమిని తన పేరు మీద పట్టా చేయడానికి కొమ్మట రఘుపతి అప్పు చేసి మరీ రూ.4.5 లక్షలను గత ఏడాది ఫిబ్రవరిలో సీనియర్ అసిస్టెంట్ సుమన్ కు అప్పగించాడు. ఆ వెంటనే భూమి పట్టా చేస్తామని చెప్పిన అధికారులు చేతులెత్తేశారు. దీంతో కొన్ని వందల సార్లు రఘుపతి అధికారులకు విజ్ఞప్తి చేస్తూ వచ్చాడు. కానీ ఎన్నిసార్లు తిరిగినా పట్టించుకోకపోగా.. లంచం తీసుకున్న అధికారులు ఇద్దరూ తిరిగి బాధిత రైతుపైనే ఫైర్ అయ్యేవారు. దీంతో తీవ్ర మనో వేదనకు గురైన రఘుపతి అధికారులు గట్టిగానే నిలదీశాడు. దీంతో పట్టా చేయడం కుదరడం లేదని సంబంధిత అధికారులు సమాధానం చెప్పడంతో రఘుపతి తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు.
వ్యవసాయ బావి వద్దే ఆత్మహత్య
ఓ వైపు తెచ్చిన అప్పులకు వడ్డీ పెరిగిపోతుండటం, భూమి సాగు చేసుకుంటున్నా తన పేరుపై పట్టా లేకపోవడంతో రఘుపతి తీవ్ర వేదనకు గురయ్యాడు. ఎన్నిసార్లు తిరిగినా సీనియర్ అసిస్టెంట్ సుమన్, సర్వేయర్ రవీందర్ పట్టించుకోకపోవడం, డబ్బులు తిరిగి ఇవ్వాల్సిందిగా వేడుకున్నా ఫలితం లేకపోవడంతో రఘుపతి ఆత్మహత్య చేసుకునేందుకు నిర్ణయించుకున్నాడు. ఈ మేరకు శుక్రవారం ఉదయమే తన వ్యవసాయ బావి వద్దకు వెళ్లి ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఆ చుట్టుపక్కల ఎవరూ లేకపోవడంతో చెట్టుకు ఉరి వేసుకుని బలవన్మరణం చెందాడు. కాగా మృతుడు రఘుపతికి భార్య, ముగ్గురు కుమార్తెలున్నారు. రఘుపతి ఆత్మహత్యకు పాల్పడటంతో ఆ కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయింది.
మృతదేహంతో ఆందోళన
రెవెన్యూ అధికారుల వేధింపుల కారణంగానే కొమ్మట రఘుపతి ప్రాణాలు తీసుకోవాల్సి వచ్చిందని బాధిత కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. రఘుపతి మృతదేహాన్ని స్థానిక ఎమ్మార్వో ఆఫీస్ వద్దకు తీసుకొచ్చి నిరసన చేపట్టారు. మెయిన్ ఎంట్రన్స్ వద్ద డెడ్ బాడీతో ఆందోళన చేపట్టారు. కలెక్టర్ వచ్చి హామీ ఇచ్చేంత వరకు అక్కడి నుంచి కదిలేది లేదని అక్కడే బైఠాయించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో స్థానిక ఎస్సై సతీశ్, తన సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు. బాధిత కుటుంబ సభ్యులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అంతలోనే తహసీల్దార్ విశాలాక్షి కూడా బాధిత రైతు కుటుంబ సభ్యులతో మాట్లాడారు. దీంతో సంబంధిత రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకునేంత వరకు ఆందోళన విరమించేది లేదని బాధిత కుటుంబ సభ్యులు స్పష్టం చేశారు.అనంతరం ఎమ్మార్వో విశాలక్ష్మి బాధిత కుటుంబానికి తగిన న్యాయం చేస్తామని, పట్టా చేసేందుకు లంచం తీసుకున్న ఇద్దరు అధికారులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.