Siddipet District : ప్రేమించిన యువకుడు పెళ్లికి నిరాకరణ... యువతి ఆత్మహత్య
Siddipet district Crime News:ప్రేమించిన యువకుడు పెళ్ళికి నిరాకరించడంతో ఉరి వేసుకొని యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన సిద్ధిపేట జిల్లాలో జరిగింది.
Young Woman Committed Suicide: ప్రేమించిన యువకుడిని పెళ్లి చేసుకోమని కోరగా అతడు నిరాకరించడంతో మనస్థాపానికి గురైన ఓ యువతి (21) ఇంట్లో ఫ్యాన్ కు ఉరి వేసుకొని ఆత్మహత్య(Suicide)కు పాల్పడింది. ఈ విషాదకర సంఘటన సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం తునికిఖల్సా గ్రామంలో చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… తునికిఖల్సా గ్రామానికి చెందిన యువతి తుర్కపల్లిలోని ఒక పరిశ్రమలో రెండు సంవత్సరాల నుండి ఉద్యోగం చేస్తుంది. ములుగు మండలం క్షిరసాగర్ కు చెందిన అభిషేక్ అనే యువకుడు గత రెండు సంవత్సరాల నుండి ప్రేమిస్తున్నానని చెబుతూ ఆమె వెంట తిరిగాడు. ఇప్పుడు పెళ్లి చేసుకోమని యువతి కోరడంతో తన ఇంట్లో ఒప్పుకోరని చెప్పి అభిషేక్ తప్పించుకొని తిరుగుతున్నాడు. దీంతో నెల రోజుల క్రితం యువతి ఈ విషయం ఇంట్లో కుటుంబసభ్యులకు చెప్పి బాధపడింది. అప్పటినుండి ఆమె ఒంటరిగా ఉంటుంది. ఈ క్రమంలో ఆమె బాధపడడం చూడలేక యువతి కుటుంబసభ్యులు, యువకుడి ఇంటికి వెళ్లి కుటుంబసభ్యులను పెళ్లి విషయం అడగగా వారు దుర్భాషలాడారు. దీంతో మనస్థాపం చెందిన యువతి బుధవారం రాత్రి ఇంట్లో ఎవరు లేని సమయంలో ఫ్యాన్ కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబసభ్యుల పిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్య .....
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ కి చెందిన శ్రీజ (22) హైదరాబాద్ తార్నాకలోని ఓ ఫార్మసీ కళాశాలలో ఫామ్ -డీ ఫైనల్ ఇయర్ చదువుతుంది. కాగా నాలుగు రోజుల క్రితం శ్రీజ హైదరాబాద్ నుండి ఇంటికి వచ్చింది. అనారోగ్య సమస్యలు అధికమవడంతో బుధవారం ఉదయం ఇంటిపైన శ్రీజ ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంది. కాలిన గాయాలతో ఉన్న ఆమెను గమనించిన స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందింది. శ్రీజ హుస్నాబాద్ కాంగ్రెస్ నాయకుడు వడ్డేపల్లి వెంకటరమణ కుమార్తె. కాగా అనారోగ్య సమస్యల కారణంగానే ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని కుటుంబసభ్యులు తెలిపారు. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. తన అనుచరుడు వెంకటరమణ కుమార్తె శ్రీజ ఆత్మహత్య విషయం తెలియడంతో స్థానికంగా సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి పొన్నం ప్రభాకర్ వెంటనే స్పీచ్ ఆపివేసి హూటహూటిన ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి శ్రీజ మృతికి ద్రిగ్భ్రాంతి వ్యక్తం చేసారు. ఇంటికి వెళ్లి వెంకటరమణని ఓదార్చారు. అనంతరం అంతిమ యాత్రలో పాల్గొని ఆమె పాడె మోశారు.