Vontimitta Family Suicide : ముగ్గురి ప్రాణం మూడెకరాల పొలం, రెవెన్యూ రికార్డుల్లో పేరు మార్పుతో బలవన్మరణం!
Vontimitta Family Suicide : వైఎస్ఆర్ జిల్లా ఒంటిమిట్టలో విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. సంఘటనా స్థలిలో దొరికిన సూసైడ్ లేఖ కీలకంగా మారింది.
Vontimitta Family Suicide : వైఎస్ఆర్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్యకు(Vontimitta Family Suicide) పాల్పడ్డారు. వైఎస్‌ఆర్ జిల్లా ఒంటిమిట్ట మండలం కొత్త మాధవరంలో ఈ విషాద ఘటన జరిగింది. కొత్త మాధవరంలో చేనేత కార్మికుడు సుబ్బారావు(47) కుటుంబం నివసిస్తుంది. శనివారం ఉదయం సుబ్బారావు భార్య పద్మావతి(41), కుమార్తె(17) ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నారు. సుబ్బారావు ఒంటిమిట్ట చెరువు గట్టు సమీపంలో రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలిని పరిశీలించారు. పోలీసులకు సూసైడ్ లేఖ దొరికింది. మూడెకరాల పొలం విషయంలో రెవెన్యూ అధికారులు(Revenue Officials Cheating) మోసం చేశారని బాధితుడు ఆరోపించారు.
అసలేం జరిగింది?
కొత్త మాధవరంలో ఉంటున్న పాల సుబ్బారావు (47)కు భార్య పద్మావతి, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అయితే వారి పెద్ద కూతురు హైదరాబాద్ లో చదువుకుంటుంది. సుబ్బారావుకు ఒంటిమిట్ట మండలం కొత్త మాధవరంలో 3.10 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఈ పొలానికి సంబంధించి గతంలో రైతు భరోసా సాయం కూడా సుబ్బారావు పడింది. అయితే సుబ్బారావు భూమిని రెవెన్యూ అధికారులు (Revenue officials)కట్టా శ్రావణి అనే పేరుతో ఆన్ లైన్ లో మార్చారు. తన భూమిని వేరొకరి పేరుపై మార్చారని, తన పేరుతో మార్చుకోవడానికి సుబ్బారావు రెవెన్యూ అధికారులు చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా ప్రయోజనంలేకపోయింది. రెవెన్యూ అధికారులు అడిగిన ముడుపులు ముట్టజెప్పినా... అధికారులు పనిచేయలేదు.
సూసైడ్ లేఖ కీలకం
చివరికి మనస్థాపం చెందిన సుబ్బారావు శనివారం ఉదయం ఒంటిమిట్ట(Vontimitta) చెరువు కట్ట సమీపంలో రైలు కింద పడి బలవన్మరణానికి పాల్పడ్డారు. సుబ్బారావు భార్య పద్మావతి, చిన్న కూతురు ఇంట్లో విగతజీవులుగా పడిఉన్నారు. ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్య(Family Suicide) చేసుకోవడంతో కొత్త మాధవరంలో విషాదం అలముకుంది. పోలీసులకు సంఘటనా స్థలంలో సూసైడ్ లేఖ(Suicide Letter) లభించింది. రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యంతో కుటుంబం బలైపోయిందని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు, బంధువులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై ఒంటిమిట్ట సీఐ పురుషోత్తం రాజు సమాచారం సేకరించి, కేసు నమోదు చేశారు. సూసైడ్ లో ఉన్న విషయాలపై దర్యాప్తు చేస్తామన్నారు. భూమి అసలు ఎవరి పేరుపై ఉందో? దర్యాప్తులో తెలుస్తుందన్నారు.
రెవెన్యూ రికార్డుల్లో పేరు ఎలా మారింది? ఎవరైనా ఉద్దేశపూర్వకంగా మార్చారా? పొరపాటున జరిగిందా? బాధితులు అధికారులను ఆశ్రయిస్తే ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలని బాధితుల బంధువులు డిమాండ్ చేస్తున్నారు.