Maoist Arrest: జమ్మికుంట లో అదృశ్యం... రామకృష్ణాపూర్‌లో అరెస్టు, కోల్‌బెల్ట్ ఏరియాలో సికాస పునర్నిర్మాణ యత్నాలు..
Maoist Arrest: కోల్ బెల్ట్ ఏరియాలో సింగరేణి కార్మిక సంఘం పునర్నిర్మాణం చేసేందుకు యత్నించిన మహ్మద్ హుస్సేన్ @ సుధాకర్ @ రమాకాంత్‌ను రామకృష్ణాపూర్‌లో పోలీసులు అరెస్ట్ చేశారు.
Maoist Arrest: కరీంనగర్ జిల్లా జమ్మికుంట లో సోమవారం తెల్లవారుజామున అదృశ్యం అయిన మావోయిస్టు నేత మహ్మద్ హుస్సేన్ అలియాస్ సుధాకర్ అలియాస్ రమాకాంత్ రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో అరెస్టు అయ్యారు.
సికాస పునర్నిర్మాణం చేసేందుకు యత్నించి అనూహ్యంగా పోలీసులకు చిక్కాడు. మావోయిస్టు అరెస్టు పై జరిగిన పరిణామాలు... పోలీసుల ప్రకటన పొంతన లేకుండా ఉండడంతో అసలేం జరిగిందనే విషయంపై రకరకాల చర్చ సాగుతోంది.
జమ్మికుంట కు చెందిన మహ్మద్ హుస్సేన్ @ సుధాకర్ @ రమాకాంత్ 1978 నుండి 1981 వరకు KK-2 మైన్ జనరల్ మాజ్దూర్ గా పనిచేశాడు. మావోయిస్టు భావజాలాలకి ఆకర్షితుడై సింగరేణి ఉద్యోగానికి రాజీనామా చేసి మావోయిస్టు పార్టీలో చేరి వివిధ హోదాలలో పనిచేస్తూ ఉత్తర తెలంగాణ కమిటీ సభ్యుడిగా ఎదిగాడు. అతను సికాస వ్యవస్థాపక సభ్యుడిగా సింగరేణి కార్మిక సంఘం సిఓ గా పనిచేశాడు.
ఆ కాలంలో అతనిపై వివిధ పోలీస్ స్టేషన్ లలో 28 క్రిమినల్ కేసులు నమోదు అయ్యాయి. గతంలో పలుమార్లు జైలుకు వెళ్లి వచ్చిన రమాకాంత్ చివరిసారిగా 2009లో ఝార్ఖండ్ రాష్ట్రంలో బొకారో జిల్లాలో అరెస్టై 2013 వరకు జైలు జీవితం గడిపి బయటకు వచ్చాడు. అతనికి మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ మెంబర్ చంద్రన్న, బండి ప్రకాష్ @ ప్రబాత్ లు డబ్బులు పంపించి కోల్ బెల్ట్ ఏరియాలో సికాస పునర్నిర్మాణానికి కృషి చేయవలసిందిగా ఆదేశించినట్లు ప్రచారం జరుగుతోంది.
అందులో భాగంగా 2020 సంవత్సరం నవంబర్ లో క్యాతనపల్లి గ్రామానికి చెందిన గురజాల రవీందర్ ఇంటిలో సిసి మెంబర్స్ వారణాసి సుబ్రహ్మణ్యం, వారణాసి విజయలక్ష్మి మరికొంత మంది తో సమావేశమై ,అట్టి సమావేశంలోని తీర్మణాలకు అనుగుణంగా మహ్మద్ హుస్సేన్ అలియాస్ సుధాకర్ అలియాస్ రమాకాంత్ కోల్ బెల్ట్ ఏరియాలో సి కా స పునర్నిర్మాణానికి ప్రయత్నం చేస్తున్నాడు.
అనూహ్యంగా అరెస్టు…
జమ్మికుంట ఇంట్లో ఉన్న మహ్మద్ హుస్సేన్ అలియాస్ సుధాకర్ అలియాస్ రమాకాంత్ ను సోమవారం తెల్లవారుజామున పోలీసులు అదుపులో తీసుకున్నారు. కుటుంబ సభ్యులు అడిగినా సమాధానం చెప్పకుండా మెడమీద చేతులేసి నెట్టుకెళ్ళాని కుటుంబ సభ్యులు ఆవేదనతో ఆందోళన వ్యక్తం చేస్తు తెలిపారు. తీసుకెళ్ళింది పోలీసులని తెలియక కుటుంబ సభ్యులు అతని ఆరోగ్యం బాగులేదని, కంటి ఆపరేషన్ ఉందని క్షేమంగా వదిలి పెట్టాలని కోరారు.
హుస్సేన్‌ను తీసుకెళ్ళింది పోలీసులా, ఇంకెవరైననా అని ఆందోళనకు గురయ్యారు. పోలీసులు తీసుకెళ్ళితే వేంటనే అతని ఆచూకీ తెలుపాలని కోరారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కుటుంబ సభ్యులు టెన్షన్ పడ్డారు.
రామకృష్ణాపూర్ లో అరెస్టు చూపిన రామగుండం పోలీసులు..
అనూహ్యంగా జమ్మికుంట లో అదృశ్యం అయిన హుస్సేన్ అలియాస్ రమాకాంత్ రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో తేలారు. మావోయిస్టులు నేత కోల్ బెల్ట్ ఏరియాలో సికాస పునర్నిర్మాణం చేసేందుకు యత్నిస్తుండగా అరెస్టు చేసినట్లు రామగుండం కమీషనరేట్ పోలీసులు ప్రకటించారు. రామకృష్ణాపూర్ లో బెల్లంపల్లి ఏసిపి రవికూమార్ సమక్షంలో అరెస్టు అయిన మహ్మద్ హుస్సేన్ అలియాస్ సుధాకర్ అలియాస్ రమాకాంత్ ను చూపించి వివరాలు వెల్లడించారు.
గత రెండు నెలల నుండి మావోయిస్టు భావజాలాన్ని ప్రజలలోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో సికాస పునర్నిర్మాణం కొరకు మావోయిస్టు పార్టీ సానుభూతిపరులు కోల్ బెల్ట్ ఏరియాలో కరపత్రాలు విడుదల చేస్తున్నారని దానిపై రామగుండం సిపి ఎం.శ్రీనివాస్ ఆదేశాల మేరకు మంచిర్యాల డిసిపి ఎగ్గడి బాస్కర్ ఆద్వర్యంలో ప్రత్యేక టీమ్ విచారణ చేపట్టగా మహ్మద్ హుస్సేన్ పట్టుబడ్డారని తెలిపారు.
మందమర్రి, రామకృష్ణాపూర్ ఏరియాలో సికాస పునర్నిర్మాణం కోసం తిరుగుతున్నారన్న సమాచారం మేరకు మందమర్రి రామకృష్ణాపూర్ పోలీసులు నిఘా పెట్టగా R.K -1 మైన్ రోడ్డులో నల్లటి బ్యాగు భుజానికి వేసుకొని కనిపించిన వ్యక్తిని ఆపడానికి ప్రయత్నం చేయగా అతడు అక్కడినుండి పారిపోతుండగా పట్టుకొని బ్యాగ్ చెక్ చేయగా మావోయిస్టు పార్టీ డాక్యుమెంట్స్, వాల్ పోస్టర్స్, కరపత్రాలు దొరికాయని పోలీసులు తెలిపారు.
విప్లవ సాహిత్యాన్ని సెల్ ఫోన్ ను సీజ్ చేసి అతన్ని అరెస్టు చేసినట్లు ప్రకటించారు. అతనిపై Cr No:55 /2021 U/Sec 120.120(b)r/w 34 IPC Sec 10.13.18.18(b ) UAP Act PS రామకృష్ణాపూర్ లో నిందితుడుగా ఉన్నాడని చెప్పారు.
దొరికింది జమ్మికుంట లో... పోలీసులకు చిక్కింది మాత్రం రామకృష్ణాపూర్‌లో
మావోయిస్టు నేత అరెస్టు విషయంలో పోలీసుల సమాచారం పలు ప్రశ్నలను రేకెత్తిస్తున్నాయి. మహ్మద్ హుస్సేన్ ను పోలీసులు జమ్మికుంటలో తన ఇంటినుంచి తీసుకెళ్ళగా పోలీసులు మాత్రం రామకృష్ణాపూర్ లో వాహనాలు తనిఖీ చేస్తుండగా పట్టుబడ్డాడని ప్రకటించారు. అసలు ఏది నిజమే అర్థంకాక అరెస్టు విషయం అయోమయంగా మారింది. పోలీస్ మార్క్ రాజకీయం చూపించారని చర్చించుకుంటున్నారు.
(రిపోర్టింగ్ కె.వి.రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు)