Karimnagar Dasara: వైభవంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు, మహాశక్తి ఆలయానికి పోటెత్తిన భక్తులు
Karimnagar Dasara: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. మహాశక్తి ఆలయానికి భక్తులు పోటెత్తారు. వేలాదిమంది భక్తులు భవాని దీక్షలు తీసుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మునుపెన్నడు లేని విధంగా ఈసారి మహిళా భక్తులు పెద్దసంఖ్యలో భవాని దీక్ష బూనారు.
Karimnagar Dasara: ప్రముఖ పుణ్యక్షేత్రాలు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం, ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంతోపాటు కరీంనగర్ లోని మహాశక్తి అమ్మవారి ఆలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు కన్నుల పండువలా ప్రారంభమయ్యాయి. 9 రోజులపాటు నిర్వహించే వేడుకల్లో భాగంగా పెద్ద సంఖ్యలో భక్తులు భవాని దీక్షలు స్వీకరించారు.
భవానీ మాలాధారులై అమ్మవారి సేవలో పాల్గొన్నారు. ఊహించని రీతిలో మహిళలు, బాలికలు కూడా పెద్ద సంఖ్యలో భవానీ దీక్ష తీసుకోవడం విశేషం. ఖర్చుతో పనిలేకుండా, దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా కరీంనగర్ లోని మహాశక్తి అమ్మవార్ల ఆలయంలోనే భవానీ దీక్ష తీసుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు.
భవానీ దీక్ష చేపట్టే భక్తులందరికీ దేవాలయంలో చేపట్టే అన్ని రకాల పూజలు, సేవలు ఉచితంగా అందుబాటులో ఉంచారు. భగవంతుడికి భక్తులందరూ సమానమేనని చాటి చెప్పేందుకు ఎలాంటి రుసుం లేకుండా, హుండీ లేకుండా ఉచితంగా అమ్మవారిని దర్శించుకునేలా చర్యలు చేపట్టారు. నవరాత్రి ఉత్సవాలు పూర్తయ్యే వరకు భవానీ దీక్ష చేపడుతున్న వేలాది మంది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. దేవాలయ ఆవరణలో నిత్యాన్నదానం నిర్వహిస్తున్నారు.
భవానీ దీక్షపరులతో కిటకిటలాడిన ఆలయం
దేవి శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మహాశక్తి ఆలయం భక్తజన సంద్రంగా మారింది. ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయే వరకు భక్తులు బారులు తీరి అమవారులను దర్శించుకున్నారు. తొలిరోజు బాలాత్రిపుర సుందరి అవతారంలో ముగ్గురు అమ్మవార్లు భక్తులకు దర్శనమిచ్చారు. మహిమాన్వితమైన మహాశక్తి ఆలయాన్ని దర్శించుకుని అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాతోపాటు రాష్ట్రం నలువైపుల నుండి తరలివస్తున్నారు. భక్తులతో మహాశక్తి ఆలయం జన సందోహంగా మారింది.
కేంద్రమంత్రి బండి సంజయ్ ప్రత్యేక పూజలు
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఉదయం నుండి రాత్రి పొద్దుపోయేదాకా అమ్మవారి ఆలయంలోనే ఉండి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేలాదిగా తరలివస్తున్న భక్తులను కలుస్తూ వారి విజ్ఝాపలను స్వీకరించారు. భవానీ భక్తులతో కలిసి బాలా త్రిపుర సుందరి అవతార రూపంలో దర్శనమిస్తున్న అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
శ్రీశ్రీశ్రీ జగద్గురు శంకరాచార్య హంపి విరూపాక్ష విద్యారణ్య పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ విద్యారణ్య భారతీ స్వాముల ఆశీస్సులతో విజయ దశమి వరకు అంగరంగ వైభవంగా కొనసాగనున్నాయి. భక్తులకు కనువిందు చేసేలా దేవాలయ ప్రాంగణాన్ని వివిధ రకాల పూల అలంకరణలతో, విద్యుత్ దీపాలతో ముస్తాబు చేశారు. ఆలయానికి వచ్చే రహదారులను ఆకర్షణీయమైన విద్యుద్దీపాల వెలుగులతో విరజిమ్మేళ శోభాయమానంగా తీర్చిదిద్దారు.
శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అమ్మవార్లను రోజుకో అవతారంలో అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించనున్నారు. తొలిరోజు శ్రీ బాలాత్రిపుర సుందరి దేవి (శైలపుత్రి)గా దర్శనమిచ్చిన అమ్మవార్లు శుక్రవారం శ్రీ గాయత్రీ దేవి (బ్రహ్మచారిని)గా భక్తులకు దర్శనమివ్వనున్నారు. 5న శ్రీ అన్నపూర్ణ (చంద్ర ఘంట) దేవిగా, 6న శ్రీ లలితా దేవి దేవి (కూష్మాండ )గా, 7న మహాచండీ దేవి (స్కంద మాత)గా, 8న శ్రీ మహాలక్ష్మి దేవి (కాత్యాయని)గా, 9న శ్రీ సరస్వతి దేవి (కాళరాత్రి)గా,10న దుర్గాష్టమి శ్రీ దుర్గాదేవి (మహాగౌరీ)గా, 11న శ్రీ మహిషాసురమర్ధిని దేవి (సిద్ధి రాత్రి)గా, విజయ దశమి పర్వదినమైన 12వ తేదీన శ్రీ రాజరాజేశ్వరి దేవి అవతారంలో భక్తులకు దర్శనమిస్తారు.
రాత్రి దాండియా…
మహాశక్తి అమ్మవార్ల ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు ముగిసే వరకు ప్రతిరోజు సాయంత్రం నుండి రాత్రి పొద్దుపోయే వరకు భక్తులకు పలు సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ప్రతిరోజు రాత్రి 9 గం.ల నుండి జరిగే దాండియా కార్యక్రమాలు హైలైట్ గా నిలుస్తున్నాయి. మహిళలు, చిన్నారులు వేల సంఖ్యలో వచ్చి రాత్రిపొద్దుపోయే వరకు దాండియా ఆడుతూ ఆలయానికి వచ్చే భక్తులందరినీ అలరిస్తున్నారు.
(రిపోర్టింగ్ కె వి రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు)