తెలుగు న్యూస్ / ఫోటో /
KTR : ప్రేమోన్మాది దాడిలో గాయపడిన కుటుంబానికి కేటీఆర్ రూ. 5 లక్షల సాయం
- KTR : వరంగల్ జిల్లా 16 చింతల్ తండాలో ఈ నెల 11న నాగరాజు అనే ఓ ప్రేమోన్మాది దాడిలో దీపిక అనే యువతి తల్లిదండ్రులు మరణించారు. ఈ ఘటనలో యువతి దీపిక, ఆమె తమ్ముడు మదన్ లాల్ తీవ్రంగా గాయపడ్డారు. ఆ ఇద్దరికి బీఆర్ఎస్ పార్టీ తరఫున కేటీఆర్ రూ.5 లక్షలు సాయం అందించారు. వారిద్దరి చదువు బాధ్యత తనదేనని హామీ ఇచ్చారు.
- KTR : వరంగల్ జిల్లా 16 చింతల్ తండాలో ఈ నెల 11న నాగరాజు అనే ఓ ప్రేమోన్మాది దాడిలో దీపిక అనే యువతి తల్లిదండ్రులు మరణించారు. ఈ ఘటనలో యువతి దీపిక, ఆమె తమ్ముడు మదన్ లాల్ తీవ్రంగా గాయపడ్డారు. ఆ ఇద్దరికి బీఆర్ఎస్ పార్టీ తరఫున కేటీఆర్ రూ.5 లక్షలు సాయం అందించారు. వారిద్దరి చదువు బాధ్యత తనదేనని హామీ ఇచ్చారు.
(1 / 6)
వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం 16 చింతల్ తండాలో ఈ నెల 11న నాగరాజు అనే ఓ ప్రేమోన్మాది వేట కత్తితో దాడి చేసిన ఘటనలో దీపిక అనే యువతి తల్లిదండ్రులు మరణించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో యువతి దీపిక, ఆమె తమ్ముడు మదన్ లాల్ తీవ్రంగా గాయపడి , ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, తల్లిదండ్రులు హత్యకు గురై రోడ్డున పడిన ఆ ఇద్దరు పిల్లలను ఆదుకునేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ముందుకు వచ్చారు. ఆ ఇద్దరిని ఆదుకునేందుకు బీఆర్ఎస్ పార్టీ తరఫున రూ.5 లక్షలు చెల్లించడంతో పాటు వారిద్దరి చదువు బాధ్యత తనదేనని హామీ ఇచ్చారు.
(2 / 6)
నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మంగళవారం తాత ఫ్యామిలీతో ఉంటున్న దీపిక, మదన్ లాల్ ను కేటీఆర్ వద్దకు తీసుకెళ్లారు. దీంతో వారిద్దరిని చూసిన కేటీఆర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. వారి ఆరోగ్యం గురించి వాకబు చేసి ధైర్యంగా ఉండాలని సూచించారు. ఎల్లవేళలా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. దీపికా, మదన్ ల చదువు బాధ్యత తానే స్వయంగా తీసుకుంటానని కేటీఆర్ హామీ ఇచ్చారు. హత్యకు గురైన పిల్లల తల్లి సుగుణ బీఆర్ఎస్ క్రియాశీల కార్యకర్త అని, గ్రామ పంచాయతీలో వార్డు మెంబర్ కూడా అని గుర్తు చేశారు. ఈ మేరకు పార్టీ తరఫున కుటుంబాన్ని ఆదుకునేందుకు రూ. 5 లక్షలు ఆర్థిక సహాయాన్ని అందించనున్నట్లు కేటీఆర్ తెలిపారు.
(3 / 6)
కేటీఆర్ మాట్లాడుతూ ప్రేమోన్మాది దాడిలో శ్రీనివాస్, సుగుణ దంపతులు చనిపోవడం చాలా బాధాకరమన్నారు. ఈ దాడిలో గాయపడిన పిల్లలు దీర్ఝకాలం చికిత్స తీసుకోవాల్సిన అవసరం ఉందని, ఈ నేపథ్యంలో కుటుంబానికి భరోసా ఇచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం రూ. 50 లక్షలు ఆర్థిక సాయం కింద అందించాలని డిమాండ్ చేశారు. దంపతులను హతమార్చి, దీపిక, మదన్ లాల్ పై హత్యాయత్నం చేసిన నిందితుడు నాగరాజుకు కఠిన శిక్ష పడేలా తగిన చర్యలు తీసుకునేలా డీజీపీకి ఆదేశాలు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు.
(4 / 6)
వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం 16 చింతల్ తండాలో మహబూబాబాద్ జిల్లా గుండెంగ గ్రామానికి చెందిన మేకల నాగరాజు అనే ఆటో డ్రైవర్ దీపిక అనే యువతి కుటుంబంపై దాడి చేశాడు. గతంలో నాగరాజు, దీపిక ఇద్దరూ ప్రేమించుకుని వివాహం చేసుకోగా, ఆ తరువాత కొంతకాలానికి ఇద్దరూ విడిపోయారు. దీంతో దీపిక 16 చింతల్ తండాలోని తన తల్లిదండ్రులతో కలిసి ఉంటుండగా, గత ఏడాది డిసెంబర్ నుంచి ఇద్దరూ వేర్వేరుగా ఉంటున్నారు. కాగా దీపికను ఆమె కుటుంబ సభ్యులే తనకు దూరం చేశారన్న కోపంతో నాగరాజు వారిపై కక్ష పెంచుకున్నాడు. ఈ క్రమంలో వారిని హత మార్చేందుకు ప్లాన్ వేశాడు.
(5 / 6)
పథకంలో భాగంగానే నెల రోజుల కిందట ఒక వేట కత్తిని కొనుగోలు చేశాడు. అనంతరం ఈ నెల 11న అర్ధరాత్రి 2 గంటల సమయంలో 16 చింతల్ తండాకు వచ్చాడు. నేరుగా దీపిక ఇంటికి వెళ్లి అక్కడ ఆరు బయట నిద్రిస్తున్న దీపిక తల్లిదండ్రులైన బానోత్ సుగుణ, శ్రీనులపై కత్తితో దాడి చేసి హత్య చేశాడు. అనంతరం దీపికను హత మార్చేందుకు ప్రయత్నం చేయగా, అంతలోనే ఇంట్లో నిద్రిస్తున్న ఆమె తమ్ముడు మదన్ లాల్ బయటకు వచ్చి ఆపే ప్రయత్నం చేశాడు. దీంతో నాగరాజు అతడిపై దాడి చేయగా, మదన్ లాల్ దవడ భాగంలో తీవ్ర గాయమై ఆసుపత్రి పాలయ్యాడు.
(6 / 6)
ఈ ఘటనతో కుటుంబం మొత్తం ఛిన్నాభిన్నమవగా, ఇది జరిగిన రెండు రోజులకు వరంగల్ పోలీసులు నిందితుడు నాగరాజును అరెస్ట్ చేశారు. కాగా బాధిత కుటుంబానికి మొదటి నుంచి నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అండగా ఉంటూ వచ్చారు. ఈ క్రమంలో మంగళవారం కేటీఆర్ వద్దకు తీసుకెళ్లగా, వారి చదువు బాధ్యతను తానే తీసుకుంటున్నట్లు కేటీఆర్ ప్రకటించారు. (రిపోర్టింగ్: హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ ప్రతినిధి)
ఇతర గ్యాలరీలు