CM Revanth Reddy : తొలిసారి రామయ్య సన్నిధికి సీఎం రేవంత్ రెడ్డి, భద్రాద్రి అభివృద్ధిపై దృష్టి సారిస్తారా?
CM Revanth Reddy Bhadrachalam Visit: ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి తొలిసారి భద్రాచలం సీతారాముల సన్నిధికి వస్తున్నారు. సోమవారం భద్రాచలం వస్తున్న సీఎం రేవంత్ రెడ్డి...ఆలయ అభివృద్ధికి వరాలు కురిపిస్తారని భక్తులు ఎదురుచూస్తున్నారు.
CM Revanth Reddy Bhadrachalam Visit: తెలంగాణ ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) భద్రాద్రి రామయ్య సన్నిధిలో అడుగు పెట్టబోతున్నారు. భద్రాచల క్షేత్రానికి(Bhadrachalam) సీఎం హోదాలో రేవంత్ రెడ్డి రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రతిఏటా శ్రీరామనవమి వేడుకకు లాంచనప్రాయంగా సమర్పించాల్సిన పట్టు వస్త్రాలను గత కొన్నేళ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వం(BRS Govt) విస్మరించిన విషయం తెలిసిందే. తానీషా మంత్రివర్గంలో పని చేసిన భక్త రామదాసు అధికారిక హోదాలో శ్రీరామ నవమికి పట్టు వస్త్రాలను సమర్పించిన నాటి నుంచి ఈ సంప్రదాయం ఆనవాయితీగా కొనసాగుతోంది. కాగా దశాబ్దాల ఈ ఆనవాయితీకి, సంప్రదాయానికి గత ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళం పాడారు. కాగా శ్రీరామనవమి సమీపిస్తున్న నేపథ్యంలో భద్రాచలంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన విశేషంగా చెప్పుకోవచ్చు. అయితే అనాదిగా ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా ఎన్నో సమస్యలతో కున్నారిల్లుతున్న భద్రాచల క్షేత్ర అభివృద్ధిపై సీఎం దృష్టి సారిస్తారా? అన్నదే వేచి చూడాల్సి ఉంది. సోమవారం భద్రాచలానికి వస్తున్న ముఖ్యమంత్రి తొలుత శ్రీరాముని దర్శనాన్ని పూర్తి చేసుకుని అనంతరం ఆరు గ్యారంటీల్లో ఒకటైన ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఆ తర్వాత సాయంత్రం మణుగూరులో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు.
దక్షిణ అయోధ్యపై వరాల జల్లు కురిసేనా?
భక్తులు దక్షిణ అయోధ్యగా(Southern Ayodhya) పిలుచుకునే భద్రాచలం సీతా రామచంద్ర స్వామి దేవస్థానం అనాదిగా నిర్లక్ష్యానికి గురవుతోంది. అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు మొన్నటి వరకున్న బీఆర్ఎస్ ప్రభుత్వం రామయ్య గుడి అభివృద్ధి గురించి అస్సలు పట్టించుకోలేదు. ఫలితంగా నాడు రామదాసు నిర్మించిన ఆలయం నేటికీ ఎలాంటి ఉన్నతికి నోచుకోకుండా అలాగే ఉంది. బీఆర్ఎస్ (BRS)హయాంలో ఆలయ అభివృద్ధి కోసం మాస్టర్ ప్లాన్ రూపొందించి అమలుకు ఫండ్స్ ఇస్తామని ప్రకటించారే తప్ప పైసా రిలీజ్ చేయలేదు. కేంద్ర ప్రభుత్వం ఆలయాన్ని ప్రసాద్(Prasad) (పిలిగ్రిమేజ్ రెజువెనేషన్ అండ్ స్పిర్చువల్ అగ్మెంటేషన్ డ్రైవ్) పథకం కింద చేర్చింది. ఈ స్కీమ్ కింద చేపట్టిన పనులు నత్తనడకన సాగుతున్నాయి. అయోధ్యలో బాల రాముని ప్రతిష్ట పూర్తి చేయడంలో చిత్తశుద్ధి చూపిన కేంద్ర ప్రభుత్వం భద్రాచలంలోని సీతారామ చంద్రస్వామి దేవాలయాన్ని మాత్రం విస్మరించింది.
బీఆర్ఎస్ సర్కార్ నిర్లక్ష్యం
తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్(KCR) ప్రభుత్వం భద్రాచలం దేవస్థానాన్ని యాదాద్రి తరహాలో డెవలప్ చేస్తామని ప్రకటించింది. 2016లో ఆలయ అభివృద్ధికి రూ.100 కోట్లు ప్రకటించి, బడ్జెట్లో రూ. 50 కోట్లు కేటాయించింది. ఏటా బడ్జెట్ లో నిధులు ఇస్తామని మాటిచ్చింది. ఆలయ అభివృద్ధి, వసతుల కల్పన కోసం ప్రముఖ ఆర్కిటెక్ట్ ఆనందసాయి ఆధ్వర్యంలో మాస్టర్ ప్లాన్ తయారు చేయించింది. ఆలయం చుట్టూ రెండు ప్రాకారాలు, వేయికాళ్ల మండపం, గోదావరి పుష్కరిణి, 105 అడుగుల రామస్తూపం తదితర నిర్మాణాలకు 65 ఎకరాలు అవసరమని అంచనా వేశారు. రూ.400 కోట్లు ఖర్చయినా భద్రాచలం దేవస్థానాన్ని అభివృద్ధి చేస్తామని ప్రకటించిన అప్పటి సీఎం కేసీఆర్ సీతారాముల కల్యాణానికి ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలు తీసుకొచ్చే సంప్రదాయాన్ని కూడా నీరుగార్చారు. బీఆర్ఎస్ హయాంలో ఆలయ ట్రస్ట్ బోర్డ్ ను ఏర్పాటు చేయలేదు. ప్రకటనలు తప్ప ఫండ్స్ ఇవ్వకపోవడంతో మాస్టర్ ప్లాన్ మూలన పడింది.
"ప్రసాద్" పనులు నత్తనడకన..
నిత్యం రామజపం చేసే కేంద్ర సర్కారు కూడా భద్రాచలం డెవలప్మెంట్ పై నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోంది. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన "ప్రసాద్" పనులకు 2022 డిసెంబరులో రాష్ట్రపతి ద్రౌపదిముర్ము శంకుస్థాపన చేశారు. తొలిదశలో రూ.41.38 కోట్లు మంజూరు చేయగా.. భద్రాచలంలోని మిథిలా స్టేడియం పక్కన భవన నిర్మాణాలు చేపట్టారు. టెండర్లు పూర్తి చేసి కాంట్రాక్టర్ కు అప్పగించిన పనులు నత్త నడకన సాగుతున్నాయి. పర్ణశాల, ఇతర చోట్ల పనులు ఇంకా ప్రారంభం కాలేదు. రామాలయంలో, స్టేడియంలో రూఫ్ వర్క్స్ కూడా మొదలు పెట్టలేదు. టెండర్లో పేర్కొన్న మేరకు పనులు 2024 మే నాటికి పూర్తికావాలి. కానీ పనులు జరుగుతున్న తీరు చూస్తే ఇప్పట్లో పూర్తయ్యేలా కనిపించడంలేదు. ఇలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ భద్రాద్రి రామాలయం అభివృద్ధిపై అనాదిగా చిన్న చూపే చూస్తున్నాయి. కాగా రాష్ట్రంలో ఇటీవలే అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం భద్రాచల ఆలయం అభివృద్ధి విషయంలో దృష్టి సారిస్తుందన్న అంచనాలు అందరిలోనూ నెలకొన్నాయి. శ్రీరామ నవమికి ముందే ముఖ్యమంత్రి రేవంత్ భద్రాచలంలో పర్యటించడం వెనుక అభివృద్ధి కోణం దాగి ఉందన్న చర్చ జరుగుతోంది. నిలిచిపోయిన అభివృద్ధిలో వేగం పెంచడంతోపాటు కొత్తగా మరిన్ని నిధులను మంజూరు చేసి భద్రాచల పుణ్య క్షేత్రాన్ని తెలంగాణకే తల మానికంగా రూపుదిద్దాల్సిన ఆవశ్యకత ఉంది. తాజాగా సీఎం భద్రాద్రిపై వరాల జల్లు కురిపిస్తే నిజంగా దక్షిణ అయోధ్యగా చెప్పుకునే భద్రాద్రి రామయ్య సన్నిధి ఆ పేరును సార్ధకం చేసుకుంటుంది.
రిపోర్టింగ్ - కాపర్తి నరేంద్ర, ఖమ్మం
సంబంధిత కథనం