Beer | సూరీడి మీద కోపంతో తెలంగాణలో ఇన్ని వేల కోట్ల బీర్లు తాగేశారా?
ఎండాకాలం వచ్చిందంటే.. చాలు మద్యం ప్రియులు.. లిక్కర్ నుంచి బీర్లకు షిఫ్ట్ అయిపోతారు. పైనుంచి ఎండ గట్టిగా కొడుతుంటే.. గొంతులోకి చల్లని బీరు పోస్తారు. అలా ఈసారి ఎన్ని కోట్ల రూపాయలు బీర్లు తాగేశారో తెలుసా?
ఎండలు మండిపోతున్నాయి. మద్యం ప్రియులకు వేడి గట్టిగా తగులుతోంది. దీంతో.. లిక్కర్ నుంచి బీర్ల వైపు మనసు మళ్లింది. దీంతో తెలంగాణలో బీర్ల అమ్మకాలు.. జోరుగా సాగుతున్నాయి. ఎంతలా అంటే.. ఒక్కోసారి.. బీర్ కూల్ అవ్వకముందే.. ఫ్రిడ్జిలో నుంచి తీసి ఇవ్వండి అనేంతలా. మందుబాబులకు బీర్ అయితే చాలు. అది కూల్ ఉందా లేదా అనేది తర్వాత ముచ్చట. ఈ కారణంగా లిక్కర్ కంటే.. బీర్లకే ఎక్కువగా డిమాండ్ పెరిగింది. ఆ లెక్కలు చూస్తే కచ్చితంగా మీరు షాక్ అవుతారు.
మార్చి నుంచి మే 14 వరకు అంటే 75 రోజుల్లో రూ.6,702 కోట్ల విలువైన బీర్లు తాగారు. అంటే.. 10.64 కోట్ల లీటర్ల బీర్లు అన్నమాట. 6.44 కోట్ల లీటర్ల లిక్కర్‌ను మద్యం ప్రియులు లాగించేశారు. ఈ రెండింటినీ పోల్చుకుంటే.. సుమారు 4 కోట్ల లీటర్ల బీరు ఎక్కువగా కుమ్మేశారు.
ఈ ధరలను చూసుకుంటే.. గతేడాది, అంతకుముందు ఏడాది కంటే అధికం. విపరీతంగా బీర్ల అమ్మకాలు పెరిగాయి. 75 రోజుల్లో రూ.6,702 కోట్ల బీర్లు తాగేశారంటే ఒక్కసారి ఆలోచించండి. మందు బాబులు చల్లని బీరు గొంతులో ఎలా పోస్తున్నారో తెలుస్తుంది.
గతంలో చల్లటివి తాగితే.. కరోనా వస్తుందనే భయంతో చాలామంది బీర్లకు దూరంగా ఉన్నారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. దీంతో ఎగబడి మారి.. బీర్లు తాగుతున్నారు. పెళ్లిల్లు, పార్టీలు ఇలా అంతటా చల్లని బీర్లే గొంతులో పోస్తున్నారు. తాగేవాళ్లు ఏ ఇద్దరూ కలిసినా.. నాలుగు బీర్లు తెచ్చుకుని.. చెరో రెండు లాగించేస్తున్నారు.
వేసవి మెుదలైనప్పటి నుంచి రంగారెడ్డి జిల్లాలో అధికంగా 2.38 కోట్ల లీటర్ల బీర్లు తాగారు. తర్వాతి స్థానంలో వరంగల్ జిల్లా ఉంది. ఇక్కడ కోటి 15 లక్షల బీర్లు తాగారు. ఖమ్మం జిల్లాలో మాత్రం లిక్కర్ అమ్మకాలే ఎక్కువగా ఉన్నాయి. నల్గొండ జిల్లాలో కోటి 7 లక్షలు లీటర్లు, కరీంనగర్ జిల్లాలో కోటి 6 లక్షలు లీటర్లు, మెదక్ జిల్లాలో 92.44 లక్షలు బీర్లు తాగేశారు. హైదరాబాద్ జిల్లాలో 87.49 లక్షల లీటర్లు, మహబూబ్ నగర్ జిల్లాలో 81.22 లక్షల లీటర్లు, ఖమ్మం కేవలం 40.53 లక్షలు లీటర్ల బీర్ల అమ్మకాలు జరిగాయి. ఇదన్న మాట.. తెలంగాణలో మందు బాబులు తాగిన పద్దుల చిట్టా.