Karimnagar District : ఘోర అగ్నిప్రమాదం - ఏడేళ్ళ బాలుడు సజీవదహనం-a seven year old boy was burnt alive in karimnagar district ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Karimnagar District : ఘోర అగ్నిప్రమాదం - ఏడేళ్ళ బాలుడు సజీవదహనం

Karimnagar District : ఘోర అగ్నిప్రమాదం - ఏడేళ్ళ బాలుడు సజీవదహనం

HT Telugu Desk HT Telugu
Oct 04, 2024 10:43 PM IST

కరీంనగర్ జిల్లాలో ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఏడేళ్ళ బాలుడు సజీవ దహనమయ్యాడు.కరెంట్ షార్ట్ సర్క్యూట్ కావటంతో ఈ ప్రమాదం జరిగింది. కళ్ల ముందే కన్న కొడుకు మంటల్లో కాలిపోవటంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అవుతున్నారు.

కరీంనగర్ జిల్లాలో ఘోర అగ్నిప్రమాదం.
కరీంనగర్ జిల్లాలో ఘోర అగ్నిప్రమాదం.

కరీంనగర్ జిల్లాలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. కరెంట్ షార్ట్ సర్క్యూట్ ఇల్లు దగ్దమయింది.అగ్నిప్రమాదంలో ఏడేళ్ల బాలుడు సాయికుమార్ సజీవ దహనం అయ్యారు.‌ అగ్నిప్రమాదం కన్నవారికి పుత్రశోకం మిగిల్చింది.

మానకొండూరు మండలం ఈదుల్లగట్టేపల్లి గ్రామంలో ఈ దారుణం జరిగింది. అంగిడి అనిత- రాజు దంపతులకు ఇద్దరు సంతానం. ఏడేళ్ళ బాలుడు సాయికుమార్, ఐదేళ్ళ కూతురు రితిక ఉన్నారు. స్కూళ్లకు దసరా సెలవులు రావడంతో పిల్లలు ఇంటి వద్దనే ఉన్నారు. బాబు ఇంట్లో పడుకోగా, తల్లి కూతురు ఇంటి బయట ఉన్నారు. తండ్రీ పనిపై బయటకు వెళ్ళాడు. 

అదే సమయంలో కరెంట్ షార్ట్ సర్క్యూట్ తో ఇంటి వెనుక ఉన్న పూరి గుడిసెలో మంటలు చెలరేగాయి. ఇంట్లో టార్పాలిన్ పరదలకు నిప్పు అంటుకొవడంతో మంటలతో పాటు పొగ ఇల్లంతా అలుముకుంది. అయ్యే అంటు తల్లి బాబును కాపాడేందుకు ఇంట్లో కి పరుగెత్తే ప్రయత్నం చేయగా అప్పటికే మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. బాబు అమ్మా అంటూ అరుస్తు దేవుని రూమ్ లోకి పరుగెత్తాడు. బయటకు వెళ్ళలేని పరిస్థితిలో మంటలు అంటుకుని సజీవ దహనం అయ్యాడు. 

కొడుకును కాపాడేందుకు తల్లి ప్రయత్నించగా స్వల్పంగా గాయపడింది. స్థానికులు వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వగా వారు వచ్చేలోగా జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

కళ్ళెదుటే కన్నకొడుకు సజీవదహనం..!

పండుగ పూట సంతోషంగా ఉన్న ఆ ఇంట్లో అగ్నిప్రమాదం విషాదాన్ని మిగిల్చింది. అప్పటి వరకు అంతా ఆనందంగా ఉన్న ఇంట్లో కరెంట్ షార్ట్ సర్క్యూట్ తో చెలరేగిన మంటలతో సాయికుమార్ సజీవ దహనం అయ్యాడు. కన్నకొడుకు కళ్ళెదుటే అమ్మా అంటు అరుస్తు సజీవదహనం కావడం కన్నతల్లి కన్నీరుమున్నీరుగా విలపించారు. కొడుకును కాపాడేందుకు తల్లి చేసిన ప్రయత్నం విఫలం కావడంతో నిశ్చేష్టురాలై బోరున విలపించారు.

ఏడేళ్ల బాలుడు సజీవదహనానికి కరెంట్ షార్ట్ సర్క్యూట్ ఒక కారణం కాగా, పూరి గుడిసె ఇంట్లో ఉన్న పరదాలు ప్రమాద తీవ్రతను పెంచింది. ఇంటి వెనుకాల పూరి గుడిసె, ఇంట్లో పరదాలు ఎక్కువగా ఉండడంతో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. పూరిగుడిసెతో మంటలు చెలరేగగా పరదాలతో పొగ ఇల్లంతా వ్యాపించి బాలుడు బయటకు వెళ్ళే దారి కనిపించక దేవుని రూమ్ లోకి వెళ్ళి ప్రాణాలు కోల్పోయాడు.

 దేవుడి రూమ్ లోకి వెళ్ళిన కొడుకు శాశ్వతంగా దేవుడి వద్దకే వెళ్ళాడని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. అగ్ని ప్రమాదంతో కన్నకొడుకు సజీవదహనం తోపాటు ఇల్లు పూర్తిగా దగ్దం కావడంతో ఆ కుటుంబం కట్టుబట్టలతో మిగిలారు. జరిగిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

రిపోర్టింగ్ : కె వి రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు.

Whats_app_banner