Tractor Accident: ట్రాక్టర్‌తో బావిలో పడి రైతు మృతి, కరీంనగర్‌లో విషాదం
Tractor Accident: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఆదివారం విషాదకర ఘటనలు చోటుచేసుకున్నాయి. పొలం దున్నతుండగా ట్రాక్టర్ బావిలోకి దూసుకెళ్ళి యువ రైతు ప్రాణాలు కోల్పోగా, మొహరం పండుగ సందర్భంగా పులి వేషాదరణలో ఆడి పాడిన కళాకారుడు గుండెపోటుకు గురై మృతి చెందారు.
Tractor Accident: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఆదివారం విషాదకర ఘటనలు చోటుచేసుకున్నాయి. పొలం దున్నతుండగా ట్రాక్టర్ బావిలోకి దూసుకెళ్ళి యువ రైతు ప్రాణాలు కోల్పోగా, మొహరం పండుగ సందర్భంగా పులి వేషాదరణలో ఆడి పాడిన కళాకారుడు గుండెపోటుకు గురై మృతి చెందారు. మరో మహిళాకొడుకుతో సహా డ్యామ్ లో దూకి ఆత్మహత్యకు యత్నించగా పోలీసులు కాపాడారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం నూకలమర్రిలో ట్రాక్టర్ తో పొలం దున్నతుండగా అదుపుతప్పి ట్రాక్టర్ బావిలోకి దూసుకెళ్ళింది. ట్రాక్టర్ నడిపే యువరైతు కైరా శేఖర్ (28) ట్రాక్టర్ తో సహా బావిలో పడి ప్రాణాలు కోల్పోయాడు. పొలం దున్నుతూ ట్రాక్టర్ ను రివర్స్ తీస్తుండగా బావిలోకి దూసుకెళ్ళిందని స్థానికులు తెలిపారు. ఫైర్ సిబ్బంది రెవెన్యూ అధికారులు భారీ క్రేన్ సహాయంతో మృతదేహాన్ని వెలికితీశారు. మృతుడికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు.
పులి వేషంతో ఎగిరి, గుండెపోటుకు గురై…
జగిత్యాల జిల్లా మల్యాల మండలంలో మొహర్రం వేడుకల్లో అపశృతి చోటుచేసుకుంది. మొహర్రం వేడుకల సందర్భంగా పెద్దపులి వేషం కట్టి ఆడిపాడిన యువకుడు లక్ష్మణ్ గుండెపోటుకు గురై మృతి చెందారు. పులివేషాధారణలో వేడుకలకు హాజరైన వారిని అలరింపజేసిన లక్ష్మణ్ ఇంటికెళ్ళి కుప్పకూలిపోయారు. ఏమైందని ఆసుపత్రికి తరలించే లోపే ప్రాణాలు కోల్పోయారు.
అప్పటి వరకు పులి వేషాదరణలో అందరిని అలరింపజేసిన లక్ష్మణ్ హఠాన్మరణంతో గ్రామంలో విషాదం అలుముకుంది. మృతుడికి భార్య దివ్య, నాలుగేళ్ల కూతురు దివ్య ప్రసన్న ఉన్నారు. టాటా ఏస్ డ్రైవర్ గా పనిచేస్తున్న లక్ష్మణ్ వేడుకల్లో పులి వేషాధరణలో ఆడి పాడి అస్వస్థకు గురై ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
డ్యామ్ లో దూకి కొడుకుతో సహా తల్లి ఆత్మహత్యాయత్నం..
కరీంనగర్ సమీపంలోని లోయర్ మానేర్ డ్యామ్ లో దూకి ఆత్మహత్యకు యత్నించిన ఇద్దరిని లేక్ పోలీసులు కాపాడారు. విద్యానగర్ కు చెందిన తల్లి కుమారుడు చౌడారపు భారతమ్మ (58), చౌడారపు గిరీష్ కుమార్ (34) డ్యామ్ లో దూకేందుకు యత్నించారు.
డ్యామ్ కట్టపై గస్తీలో ఉన్న లేక్ అవుట్ పోస్టు పోలీసులు గమనించి కాపాడారు. కుటుంబ కలహాలతో ఆత్మహత్యకు యత్నించినట్లు బాదితులు చెప్పడంతో వారికి లేక్ ఎస్సై అర్షం సురేష్ కౌన్సిలింగ్ నిర్వహించి మహిళా పోలీస్ స్టేషన్ కు తరలించారు.
(రిపోర్టింగ్: కె.వి.రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు)