World Cup Qualifiers: వరల్డ్ కప్ క్వాలిఫయర్స్.. రజా ఫాస్టెస్ట్ సెంచరీతో జింబాబ్వే గెలుపు
World Cup Qualifiers: వరల్డ్ కప్ క్వాలిఫయర్స్ లో నెదర్లాండ్స్‌పై జింబాబ్వే, యూఎస్ఏపై నేపాల్ గెలిచాయి. మంగళవారం (జూన్ 20) ఈ రెండు మ్యాచ్ లు జరిగాయి.
World Cup Qualifiers: వన్డే వరల్డ్ కప్ క్వాలిఫయర్స్ లో మంగళవారం (జూన్ 20) మరో రెండు మ్యాచ్ లు జరిగాయి. ఇందులో తొలి మ్యాచ్ లో నెదర్లాండ్స్ ను జింబాబ్వే ఓడించగా.. యూఎస్ఏపై నేపాల్ విజయం సాధించింది. నెదర్లాండ్స్ పై జింబాబ్వే బ్యాటర్లు చెలరేగిపోయారు. 316 పరుగుల లక్ష్యాన్ని కేవలం 40.5 ఓవర్లలోనే ఛేదించడం విశేషం.
జింబాబ్వే విజయంలో కెప్టెన్ క్రెయిగ్ ఇర్విన్, సీన్ విలియమ్స్, సికిందర్ రజా రాణించారు. క్వాలిఫయర్స్ లో జింబాబ్వేకు ఇది వరుసగా రెండో విజయం. దీంతో సూపర్ 6లో చోటు సంపాదించే అవకాశాలను మెరుగుపరచుకుంది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్.. 50 ఓవర్లలో 315 పరుగులు చేసింది. ఎడ్వర్డ్స్ 83, విక్రమ్‌జీత్ 88 పరుగులు చేశారు. రజా నాలుగు వికెట్లు తీశాడు.
భారీ టార్గెట్ అయినా కూడా జింబాబ్వే తడబడలేదు. కెప్టెన్ క్రెయిగ్ ఇర్విన్ 50 పరుగులు చేసి చేజింగ్ లో మంచి స్టార్ట్ ఇచ్చాడు. ఇక ఆ తర్వాత బౌలింగ్ లో నాలుగు వికెట్లతో రాణించిన సికిందర్ రజా బ్యాటింగ్ లోనూ చెలరేగాడు. కేవలం 54 బంతుల్లోనే సెంచరీ చేశాడు. జింబాబ్వే తరఫున అత్యంత వేగంగా సెంచరీ చేసిన బ్యాటర్ గా రజా నిలిచాడు. దీంతో వన్డేల్లో జింబాబ్వే తమ మూడో అత్యధిక స్కోరును చేజ్ చేసింది.
యూఎస్ఏపై నేపాల్ విజయం
మరో మ్యాచ్ లో యూఎస్ఏపై నేపాల్ ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన యూఎస్ఏ 207 రన్స్ చేసింది. జహంగీర్ సెంచరీ చేశాడు. అయితే ఈ టార్గెట్ ను నేపాల్ సులువుగా చేజ్ చేసింది. 43 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయి టార్గెట్ ఛేదించడం విశేషం. భీమ్ షర్కి 77, కుశల్, దీపేంద్ర సింగ్ చెరో 39 పరుగులు చేశారు.
సంబంధిత కథనం