WFI suspended: ఇండియా జెండా లేకుండానే తలపడనున్న రెజ్లర్లు.. రెజ్లింగ్ ఫెడరేషన్‌పై సస్పెన్షన్
WFI suspended: ఇండియా జెండా లేకుండానే తలపడనున్నారు మన రెజ్లర్లు. ఎన్నికల నిర్వహించడంలో విఫలమైన భారత రెజ్లింగ్ ఫెడరేషన్‌పై యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ వేటు వేసింది.
WFI suspended: నిర్ణీత సమయంలో ఎన్నికలు నిర్వహించడంలో విఫలమైన రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ)పై వేటు పడింది. ప్రపంచవ్యాప్తంగా రెజ్లింగ్ వ్యవహారాలు చూసుకునే యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ (యూడబ్ల్యూడబ్ల్యూ) ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. దీంతో రెజ్లింగ్ లో ఇండియాకు పెద్ద షాక్ తగినట్లయింది.
ఈ నిర్ణయం కారణంగా రానున్న వరల్డ్ ఛాంపియన్‌షిప్స్ లో మన రెజ్లర్లు భారత జెండాపై కాకుండా ఓ తటస్థ జెండాతో తలపడాల్సి వస్తుంది. సెప్టెంబర్ 16 నుంచి ఈ ఈవెంట్ జరగనుంది. ఒలింపిక్స్ కు అర్హత సాధించేందుకు రెజ్లర్లకు ఉపయోగపడే ఈవెంట్ ఇది. అలాంటి దాంట్లో దేశ పతాకం లేకుండా బరిలోకి దిగాల్సి రానుండటం మింగుడుపడనిదే.
గత కొన్ని నెలలుగా భారత రెజ్లింగ్ సమాఖ్య తీవ్ర వివాదాల్లో చిక్కుకున్న విషయం తెలిసిందే. ఫెడరేషన్ మాజీ చీప్ బ్రిజ్ భూషన్ శరణ్ సింగ్ పై మహిళా రెజ్లర్లు లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. దీంతో దేశంలోని రెజ్లర్లంతా బ్రిజ్ భూషణ్ పై చర్యలు తీసుకోవాల్సిందిగా నిరసనలు చేపట్టారు. బ్రిజ్ భూషణ్ తన పదవి నుంచి తప్పుకున్నాడు.
గత ఏప్రిల్లో ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (ఐఓఏ) ఓ తాత్కాలిక కమిటీని నియమించి.. రెజ్లింగ్ ఫెడరేషన్ బాధ్యతలు అప్పగించింది. 45 రోజుల్లోగా ఎన్నికలు నిర్వహించాలని కూడా అప్పుడే ఆదేశించింది. కానీ ఎన్నికలు మాత్రం ఇప్పటికీ జరగలేదు. మే నెలలోనే గడువులోపు ఎన్నికలు నిర్వహించలేకపోతే సస్పెండ్ చేస్తామని యూడబ్ల్యూడబ్ల్యూ హెచ్చరించింది.
అయినా ఎన్నికల నిర్వహించకపోవడంతో గురువారం (ఆగస్ట్ 24) ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. దీంతో త్రివర్ణ పతాకం లేకుండా భారత రెజ్లర్లు వరల్డ్ ఛాంపియన్‌షిప్స్ లో తలపడాల్సి రానుంది.