India vs Afghanistan Asia cup 2022: ఎన్నాళ్లకెన్నాళ్లకు.. సెంచరీతో కదం తొక్కిన కోహ్లీ.. ఆఫ్గాన్ ముందు భారీ లక్ష్యం-virat kohli amazing century to help india get huge score against afghanistan in asia cup ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  India Vs Afghanistan Asia Cup 2022: ఎన్నాళ్లకెన్నాళ్లకు.. సెంచరీతో కదం తొక్కిన కోహ్లీ.. ఆఫ్గాన్ ముందు భారీ లక్ష్యం

India vs Afghanistan Asia cup 2022: ఎన్నాళ్లకెన్నాళ్లకు.. సెంచరీతో కదం తొక్కిన కోహ్లీ.. ఆఫ్గాన్ ముందు భారీ లక్ష్యం

Maragani Govardhan HT Telugu
Sep 08, 2022 09:11 PM IST

India vs Afghanistan: దుబాయ్ వేదికగా ఆఫ్గానిస్థాన్‌తో జరుగుతున్న ఆసియా కప్ మ్యాచ్‌లో భారత్ 2 వికెట్ల నష్టపోయి 212 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో కోహ్లీ శతకంతో కదం తొక్కాడు.

విరాట్ కోహ్లీ
విరాట్ కోహ్లీ (AP)

Virat Kohli Century in India vs Afghanistan: ఆఫ్గానిస్థాన్‌తో జరుగుతున్న ఆసియా కప్ సూపర్ 4 మ్యాచ్‌లో భారత్ భారీ స్కోరు చేసింది. దుబాయ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ(122*) శతకంతో ఓ రేంజ్‌లో విజృంభించగా.. కేఎల్ రాహుల్(62) అర్ధశతకంతో రాణించాడు. ఓపెనర్లుగా దిగిన వీరిద్దరూ ఆఫ్గాన్ బౌలర్లను ఓ రేంజ్‌ల ఆడుకున్నారు. ఫలితంగా భారీ స్కోరు సాధించింది భారత్. ఆఫ్గాన్ బౌలర్లలో ఫరీద్ అహ్మద్ మాలిక్ 2 వికెట్లు తీశాడు.

టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌ చేసిన భారత్‌కు అదిరిపోయే ఆరంభం లభించింది. కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ ఓపెనర్లుగా దిగి ఓ రేంజ్‌లో ఆడారు. నిదానంగా ఇన్నింగ్స్ మొదలు పెట్టినప్పటికీ.. తర్వాత ఇద్దరూ బ్యాట్ ఝళిపించారు. వీరిద్దరూ మొదటి వికెట్‌కు 119 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. కేఎల్ రాహుల్ ముందుగా అర్ధ శతకం చేయగా.. అనంతరం విరాట్ కోహ్లీ కూడా అదిరిపోయే ప్రదర్శన చేశారు. అయితే జోరుమీదున్న కేఎల్ రాహుల్‌ను ఫరీద్ అహ్మద్ ఔట్ చేశాడు. అదే ఓవర్లో సూర్యకుమార్ యాదవ్(6) కూడా పెవిలియన్ చేర్చాడు. దీంతో 125 పరుగులకు రెండు వికెట్లు కోల్పోయింది టీమిండియా.

1000 రోజుల తర్వాత కోహ్లీ సెంచరీ..

కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్ ఔటైనప్పటికీ విరాట్ కోహ్లీ తన విధ్వంసాన్ని తగ్గించలేదు. పాత కోహ్లీని గుర్తు చేస్తూ.. అదిరిపోయే ఇన్నింగ్స్ ఆడాడు. ఎడాపెడా బౌండరీలు, సిక్సర్లు బాదుతూ.. ఆఫ్గాన్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. 53 బంతుల్లో సెంచరీ పూర్తి చేసిన విరాట్ కోహ్లీ అదరగొట్టాడు. వెయ్యి(1020) రోజుల తర్వాత అంతర్జాతీయ సెంచరీ నమోదు చేశాడు. విరాట్ సెంచరీ చేయడంతో అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. టీ20ల్లో విరాట్‌కు ఇది తొలి శతకం కావడం గమనార్హం.

మరోపక్క పంత్(20) నిలకడగా విరాట్‌కు చక్కగా సహకరించాడు. శతకం చేసిన తర్వాత కోహ్లీ ఎప్పటిలానే ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఫరీద్ అహ్మ్దద్ వేసిన 19వ రెండు ఫోర్లు, ఓ సిక్సర్ సహా 19 పరుగులు పిండుకున్న కోహ్లీ.. ఫజల్ హక్ వేసిన చివరి ఓవర్లో మరింత రెచ్చిపోయాడు. రెండు సిక్సర్లు ఓ ఫోర్ సహా 18 పరుగులు పిండుకున్నాడు. ఫలితంగా టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. విరాట్ 61 బంతుల్లో 122 పరుగులు, పంత్ 16 బంతుల్లో 20 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు.

WhatsApp channel

సంబంధిత కథనం