Cricket Bowling | క్రికెట్‌లో ఎన్ని బౌలింగ్‌ రకాలు ఉంటాయి? వాటి పేర్లేంటి?-these are the different types of bowling in cricket ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Cricket Bowling | క్రికెట్‌లో ఎన్ని బౌలింగ్‌ రకాలు ఉంటాయి? వాటి పేర్లేంటి?

Cricket Bowling | క్రికెట్‌లో ఎన్ని బౌలింగ్‌ రకాలు ఉంటాయి? వాటి పేర్లేంటి?

Hari Prasad S HT Telugu
Jan 24, 2022 09:32 PM IST

ఒక్కో బౌలర్‌ దగ్గర ఒక్కో ప్రత్యేక అస్త్రం ఉంటుంది. క్రీజులో నిలదొక్కుకుపోయిన బ్యాట్స్‌మెన్‌ను ఔట్‌ చేయడానికి వీళ్లు ఆ అస్త్రాలను బయటకు తీస్తుంటారు. బంతిని ఎదుర్కోవడానికి ఇబ్బంది పడే బ్యాట్స్‌మెన్‌ తమ వికెట్లు సమర్పించుకుంటారు. ఇక పిచ్‌లను బట్టి టీమ్స్‌ పేస్‌, స్పిన్‌ బౌలింగ్‌కు ప్రాధాన్యమిస్తాయి.

<p>క్యారమ్ బాల్ స్పెషలిస్ట్ రవిచంద్రన్ అశ్విన్</p>
క్యారమ్ బాల్ స్పెషలిస్ట్ రవిచంద్రన్ అశ్విన్ (PTI)

Cricket Bowling.. క్రికెట్‌ చూస్తున్న వారికి ప్రధానంగా పేస్‌ బౌలింగ్, స్పిన్‌ బౌలింగ్‌ కనిపిస్తుంటాయి. పేస్‌ బౌలర్లు స్పీడునే నమ్ముకుంటే, స్పిన్నర్లు బంతిని గింగిరాలు తిప్పుతూ బ్యాట్స్‌మెన్‌ను బోల్తా కొట్టించడానికి ప్రయత్నిస్తుంటారు. పేస్‌ బౌలింగ్‌లోనూ ఫాస్ట్‌, మీడియం పేస్‌ బౌలర్లు ఉంటే.. స్పిన్‌లో ఆఫ్‌ స్పిన్‌, లెగ్‌ స్పిన్‌ బౌలర్లు ఉంటారు. అయితే ఈ రెండు బౌలింగ్‌లలోనూ ఎన్నో వేరియేషన్లు ఉంటాయి. ఒక్కో బౌలర్‌ దగ్గర ఒక్కో ప్రత్యేక అస్త్రం ఉంటుంది. 

క్రీజులో నిలదొక్కుకుపోయిన బ్యాట్స్‌మెన్‌ను ఔట్‌ చేయడానికి వీళ్లు ఆ అస్త్రాలను బయటకు తీస్తుంటారు. ఊహించని రీతిలో వచ్చిన బంతిని ఎదుర్కోవడానికి ఇబ్బంది పడే బ్యాట్స్‌మెన్‌ తమ వికెట్లు సమర్పించుకుంటారు. ఇక పిచ్‌లను బట్టి ఆయా టీమ్స్‌ పేస్‌, స్పిన్‌ బౌలింగ్‌కు ప్రాధాన్యమిస్తాయి. మరి ఈ రెండు రకాల బౌలర్ల దగ్గర ఉండే వివిధ బౌలింగ్‌ వేరియేషన్లు ఏవో ఈ ఆర్టికల్‌లో సమగ్రంగా చూద్దాం.

ఆఫ్‌స్పిన్నర్ల అస్త్రాలు

స్పిన్‌ బౌలింగ్‌లోనూ రెండు రకాలు ఉంటాయని చెప్పుకున్నాం కదా. ఇందులో ఆఫ్‌ స్పిన్నర్ల దగ్గర ఉన్న అస్త్రాలేంటో చూద్దాం. ఈ ఆఫ్‌ స్పిన్నర్లనే ఫింగర్‌ స్పిన్నర్లు అని కూడా అంటారు. వీళ్ల దగ్గర చాలా వేరియేషన్లు ఉంటాయి.

ఆఫ్‌బ్రేక్‌ : ఇది ఆఫ్‌ స్పిన్నర్ల స్టాక్‌ బాల్‌. ఇక్కడ స్టాక్‌ బాల్‌ అంటే ఓ బౌలర్‌ రెగ్యులర్‌గా వేసే బాల్‌. ఈ ఆఫ్‌బ్రేక్‌లో బంతి రైట్‌ హ్యాండ్‌ బ్యాట్స్‌మెన్‌కు అయితే ఆఫ్‌ సైడ్‌ నుంచి లెగ్‌సైడ్‌కు స్పిన్‌ అవుతుంది. అదే లెఫ్టాండ్‌ బ్యాట్స్‌మెన్‌కు అయితే లెగ్‌ నుంచి ఆఫ్‌కు టర్న్‌ అవుతుంది.

దూస్రా : బ్యాట్స్‌మెన్‌ను బోల్తా కొట్టించడానికి అప్పుడప్పుడూ ఆఫ్‌స్పిన్నర్లు ఈ దూస్రా అస్త్రాన్ని ప్రయోగిస్తారు. దూస్రా అంటే ఆఫ్‌స్పిన్నర్‌ ప్రధానంగా చేసే ఆఫ్‌ బ్రేక్‌కు పూర్తి విరుద్ధమైన బాల్‌. ఇది రైట్‌ హ్యాండ్‌ బ్యాట్స్‌మెన్‌కు లెగ్‌ నుంచి ఆఫ్‌సైడ్‌కు టర్న్‌ అవుతుంది. ఈ బాల్‌ను వేయడానికి ఆఫ్‌స్పిన్నర్‌ బాల్‌ను తన చూపుడు, మధ్య వేలితో పట్టుకుంటారు.

టాప్‌ స్పిన్నర్‌: సరిగ్గా బాల్‌ను వేసే ముందు ఆఫ్‌స్పిన్నర్లు తమ వేళ్లను మారుస్తారు. ఇలాంటి బాల్స్‌ విషయంలో బ్యాట్స్‌మెన్‌ బంతి స్పిన్‌ అవుతుందని భావించినా.. అది కాస్తా నేరుగా వెళ్లే అవకాశం ఉంటుంది.

క్యారమ్‌బాల్‌: క్యారమ్‌ ఆడేటప్పుడు స్ట్రైకర్‌ను కొట్టడానికి మనం ఎలా అయితే మన బొటనవేలు, మధ్య వేలును వాడతామో.. అలాగే ఆఫ్‌స్పిన్నర్లు ఈ రెండు వేళ్లతో బంతిని పట్టుకొని స్పిన్‌ చేస్తారు. నిజానికి ఇలా బంతిపై గ్రిప్‌ దొరకడం కష్టమే అయినా.. ఒకసారి దీనిపై పట్టుసాధిస్తే బ్యాట్స్‌మెన్‌ను బోల్తా కొట్టించడం సులువవుతుంది. ఈ క్యారమ్‌ బాల్‌ అనూహ్యంగా వ్యవహరిస్తుంది. ఇది ఆఫ్‌ నుంచి లెగ్‌ లేదా లెగ్‌ నుంచి ఆఫ్‌ లేదా నేరుగా వెళ్లే అవకాశాలు కూడా ఉంటాయి.

ఆర్మ్‌ బాల్‌: ఆఫ్‌స్పిన్నర్ల మరో అస్త్రం ఈ ఆర్మ్‌ బాల్‌. స్పిన్నర్లు సాధారణంగా బాల్‌ను స్పిన్‌ చేస్తారు. కానీ ఈ ఆర్మ్‌ బాల్‌ విషయంలో బాల్‌ అసలు స్పిన్‌ అవదు. చేతి నుంచి బాల్‌ ఎలా రిలీజ్‌ అవుతుందో అది అలా నేరుగా బ్యాట్స్‌మెన్‌ దగ్గరికి వెళ్తుంది.

లెగ్‌ స్పిన్నర్ల అస్త్రాలు

స్నిన్‌ బౌలింగ్‌లో మరో కేటగిరీ ఈ లెగ్‌ స్పిన్నర్లు. ఆఫ్‌ స్పిన్‌తో పోలిస్తే ఇది కాస్త కష్టమైన బౌలింగ్‌. అందుకేనేమో క్రికెట్‌లో ఆఫ్‌ స్పిన్నర్లతో పోలిస్తే లెగ్‌ స్పిన్నర్ల సంఖ్య తక్కువగా ఉంటుంది. బంతిపైన సీమ్‌ను చూపుడు, మధ్య వేళ్లతో పట్టుకుంటూ, కింద బొటన వేలు, ఉంగరం వేలితో పూర్తి పట్టు సాధించాలి. బాల్‌ను వేసే క్రమంలో బౌలర్‌ తన మణికట్టును తిప్పుతారు. ఇక ఉంగరం వేలు బంతిని వ్యతిరేక దిశలో తిప్పుతుంది. ఈ బౌలింగ్‌లో మణికట్టు పాత్ర ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీళ్లను రిస్ట్‌ స్పిన్నర్స్‌ అంటారు. ఇక వీళ్ల అమ్ములపొదిలో ఉన్న అస్త్రాలేంటో ఇప్పుడు చూద్దాం.

లెగ్‌ బ్రేక్‌: ఇది ఓ లెగ్‌ స్పిన్నర్‌ స్టాక్‌ బాల్‌. తమ మణికట్టు, ఉంగరం వేలితో బంతిని రైట్‌హ్యాండ్‌ బ్యాట్స్‌మెన్‌కు అయితే లెగ్‌ నుంచి ఆఫ్‌సైడ్‌ వైపు తిప్పుతారు.

గూగ్లీ: ఇది లెగ్‌ స్పిన్నర్‌ స్టాక్‌ బాల్‌ అయిన లెగ్‌ బ్రేక్‌కు పూర్తి విరుద్ధమైన డెలివరీ. రైట్‌ హ్యాండ్‌ బ్యాట్స్‌మెన్‌కు బంతి ఆఫ్‌ నుంచి లెగ్‌సైడ్‌కు వెళ్లి వాళ్లను ఆశ్చర్యపరుస్తుంది. చూడటానికి సాధారణ లెగ్‌ బ్రేక్‌ వేసినట్లే కనిపించినా.. చివరి నిమిషంలో లెగ్‌ స్పిన్నర్‌ తమ మణికట్టును కాస్త ఎక్కువ తిప్పడం లేదంటే వేళ్లన విదిలించడం ద్వారా ఈ రివర్స్‌ స్పిన్‌ను సాధిస్తారు.

ఫ్లికర్‌ బాల్‌: ఆఫ్‌ స్పిన్నర్‌కు క్యారమ్‌ బాల్‌ ఎలాగో.. లెగ్‌ స్పిన్నర్‌కు ఈ ఫ్లికర్‌ అలా. ఇది ఏ వైపు అయినా స్పిన్‌ అవ్వచ్చు లేదంటే నేరుగా వెళ్లవచ్చు.

స్లైడర్‌: ఇది లెగ్‌ స్పిన్నర్‌ వేసే టాప్‌ స్పిన్నర్‌. ఈ బాల్‌ వేయడానికి బౌలర్‌ అదే గ్రిప్‌ వాడినా.. బాల్‌ను రిలీజ్‌ చేసే సమయంలో వేళ్లను తిప్పుతారు. ఇది పిచ్‌పై బౌన్స్‌ అయిన తర్వాత చాలా వేగంగా, నేరుగా బ్యాట్స్‌మెన్‌ వైపు దూసుకెళ్తుంది.

ఫ్లిప్పర్‌: ఇది కేవలం లెగ్‌స్పిన్నర్లు మాత్రమే వేయగలిగే బాల్‌. ఈ వేరియేషన్‌ కోసం లెగ్‌ స్పిన్నర్లు బాల్‌ను తమ బొటన వేలితోపాటు తమ మొదటి రెండు వేళ్లతో పట్టుకుంటారు. బాల్‌ను రిలీజ్‌ చేసే సమయంలో దానిని కాస్త గట్టిగా పట్టుకొని విసురుతారు. ఫలితంగా బంతి బ్యాక్‌స్పిన్‌ అయి చాలా తక్కువ బౌన్స్‌తో నేరుగా బ్యాట్స్‌మెన్‌ దగ్గరికి వెళ్తుంది. దీనిని ఆడటం చాలా కష్టం.

పేస్‌బౌలర్‌ అస్త్రాలు

ఫాస్ట్‌ బౌలింగ్‌లో మూడు రకాల బౌలింగ్‌ ఉంటుంది. అవి పేస్‌, సీమ్‌, స్వింగ్‌. ఈ మూడు రకాల బౌలర్ల దగ్గర కూడా వేర్వేరు వేరియేషన్లు ఉంటాయి. ముందు పేస్‌ బౌలర్ల విషయానికి వస్తే వీళ్లు ప్రధానంగా స్పీడునే నమ్ముకుంటారు. ఆ స్పీడుతోనే వికెట్లు తీస్తారు. క్రికెట్‌లో గంటకు 150 కిలోమీటర్లకుపైగా వేగంతో బౌలింగ్‌ చేసే వాళ్లు.. ఆ స్పీడుతోనే బ్యాట్స్‌మెన్‌ను భయపెట్టి వికెట్లు తీయడం మనం చూస్తూనే ఉంటాం. అయితే స్పీడునే నమ్ముకునే ఈ బౌలర్లకు గాల్లో బంతి మూవ్‌ కావడం కానీ, పిచ్‌ నుంచి గానీ ఎలాంటి సహకారం ఉండదు. దీంతో ఈ పేసర్లు అదనంగా సీమ్‌ లేదా స్వింగ్ బౌలింగ్‌ వైపు చూస్తుంటారు. వీళ్ల ప్రధాన అస్త్రాలేంటో ఒకసారి చూద్దాం.

బౌన్సర్‌: బ్యాట్స్‌మెన్‌ను బౌన్సర్లతో బెంబేలెత్తించడం ఈ పేస్‌ బౌలర్ల ప్రధాన అస్త్రం. ముఖ్యంగా ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాలాంటి దేశాల్లో పిచ్‌లు గట్టిగా ఉంటూ పేసర్లు మంచి బౌన్స్‌ రాబట్టడానికి ఉపయోగపడతాయి. ఈ షార్ట్‌ పిచ్‌ బాల్స్‌ బ్యాట్స్‌మెన్‌ ఛాతీ నుంచి తల వరకూ బౌన్స్ అవుతుంటాయి. ఈ బాల్స్‌ను ఆడటానికి ప్రయత్నించి చాలాసార్లు బ్యాట్స్‌మెన్‌ ఔటవుతుంటారు.

స్లో బాల్: ఈ మధ్య కాలంలో టీ20, వన్డేల్లాంటి పరిమిత ఓవర్ల క్రికెట్‌లో స్లాగ్‌ ఓవర్లలో పేస్‌ బౌలర్లు ఈ స్లో బాల్‌ను వేస్తూ బ్యాట్స్‌మెన్‌ను బోల్తా కొట్టిస్తున్నారు. వాళ్లు వేసే సాధారణ స్పీడ్ కంటే తక్కువ వేగంతో ఈ బాల్‌ వస్తుంది. చివరి ఓవర్లలో పరుగులు తీయడానికి ఆతృతగా ఉండే బ్యాట్స్‌మెన్‌ వీటిని సరిగా అంచనా వేయలేకపోతున్నారు.

లెగ్‌ కటర్‌: లెగ్‌ స్పిన్నర్‌ గ్రిప్‌ ఎలా ఉంటుందో బంతిని అలా పట్టుకొని ఈ లెగ్‌ కట్టర్లు వేస్తారు పేస్‌బౌలర్లు. రైట్‌హ్యాండర్లకు లెగ్‌ నుంచి ఆఫ్‌కు బంతి స్పిన్‌ అయ్యేలా వేస్తారు. దీనికి కాస్త అదనపు పేస్‌ జోడిస్తే బ్యాట్స్‌మెన్‌ ఇబ్బంది పడతారు.

ఆఫ్‌కటర్‌: ఆఫ్‌ స్పిన్నర్‌ స్టాక్‌ డెలివరీయే పేస్‌ బౌలర్లకు ఓ ప్రత్యేక అస్త్రం. బంతిని ఆఫ్‌ స్పిన్నర్‌ పట్టుకున్నట్లే పట్టుకొని పేస్‌తోనే బంతిని ఆఫ్‌ నుంచి లెగ్‌సైడ్‌కు టర్న్‌ చేస్తారు.

యార్కర్‌: పేస్‌ బౌలర్ల ప్రధాన అస్త్రం ఈ యార్కర్‌. ఇది వేయడం అంత సులువు కాదు. సరిగ్గా బ్యాట్స్‌మెన్‌ బ్యాట్‌ కింద లేదంటే కాళ్లను లక్ష్యంగా చేసుకొని వేయాలి. ఈ యార్కర్‌ కాస్త అటూ ఇటూ అయినా అది కాస్తా ఫుల్‌టాస్‌గా మారి బ్యాట్స్‌మెన్‌కు సులువు అవుతుంది. అదే పర్ఫెక్ట్‌ యార్కర్‌ వేస్తే మాత్రం బ్యాట్స్‌మెన్‌ తమ వికెట్‌ సమర్పించుకోవాల్సిందే.

నకుల్‌ బాల్‌: ఇది కూడా ఒక రకమైన స్లో బాల్‌. సాధారణంగా పేస్‌ బౌలర్‌ బంతిని తమ వేళ్లతో పూర్తిగా పట్టుకుంటారు. కానీ నకుల్‌ బాల్‌ విషయంలో బంతిని ముని వేళ్లతో పట్టుకుంటారు. దీని కారణంగా బంతి వేగం తగ్గి.. బ్యాట్స్‌మెన్‌ అయోమయానికి గురయ్యే అవకాశం ఉంటుంది.

సీమ్‌ బౌలింగ్‌

క్రికెట్‌ బంతి రెండు భాగాలను కలిపి ఉంచేదే సీమ్‌. అయితే ఈ సీమ్‌నే ఉపయోగించి కొందరు ఫాస్ట్ బౌలర్లు బ్యాట్స్‌మెన్‌పై పైచేయి సాధిస్తారు. వీళ్లు బంతిపై ఉన్న సీమ్‌ పిచ్‌పై ల్యాండయ్యేలా విసురుతారు. ఆ సీమ్‌ పిచ్‌పై పడగానే బాల్‌ అనూహ్య దిశలో దూసుకెళ్తుంది. దీంతో ఇలాంటి బాల్స్‌కు రియాక్టయ్యేంత టైమ్‌ బ్యాట్స్‌మెన్‌కు ఉండదు. అందుకే సీమ్‌ బాల్‌ను సరిగ్గా వాడితే.. ఫాస్ట్ బౌలర్ల ప్రధాన ఆయుధం అవుతుంది.

స్వింగ్‌ బౌలింగ్‌

ఫాస్ట్‌ బౌలర్లలో స్వింగ్‌ కూడా ఒక టెక్నిక్‌. ఈ స్వింగ్‌ బౌలర్లు బంతిని గాల్లోనే దిశ మార్చుకునేలాగా విసురుతారు. ఈ స్వింగ్‌లోనూ ఇన్‌స్వింగ్‌, ఔట్‌స్వింగ్‌ అనే రెండు వేరియేషన్లు ఉంటాయి. ఇన్‌స్వింగ్‌ బ్యాట్స్‌మెన్‌ లోపలికి దూసుకొస్తుంది. ఔట్‌స్వింగ్ బ్యాట్స్‌మెన్‌కు దూరంగా వెళ్తుంది. న్యూజిలాండ్‌, ఇంగ్లండ్‌ వంటి దేశాల్లో వాతావరణ పరిస్థితులు ఈ స్వింగ్‌ బౌలర్లకు బాగా అనుకూలిస్తాయి. 

ఇక ఇందులోనూ కొందరు రివర్స్‌ స్వింగ్‌ చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. సాధారణంగా బంతి కొత్తగా ఉన్నప్పుడు ఎక్కువ స్వింగ్‌ అవుతుంది. అయితే ఈ రివర్స్‌ స్వింగ్‌ మాత్రం పాత బంతితో సాధ్యమవుతుంది. బంతి ఒకవైపు పూర్తిగా దెబ్బతిన్న సమయాల్లో కొందరు ఫాస్ట్‌ బౌలర్లు ఈ రివర్స్‌ స్వింగ్‌ను రాబడతారు. పాకిస్థాన్‌ బౌలర్లు ఈ రివర్స్‌ స్వింగ్‌ చేయడంలో పట్టు సాధించారు. పేరులో ఉన్నట్లే సాధారణ స్వింగ్‌కు పూర్తి భిన్నమైన దిశలో ఈ రివర్స్‌ స్వింగ్‌ ఉంటుంది.

Whats_app_banner

సంబంధిత కథనం