Steve Smith surpasses Bradman: బ్రాడ్‌మన్‌నే మించిపోయిన స్టీవ్ స్మిత్.. సౌతాఫ్రికాపై సెంచరీ
Steve Smith surpasses Bradman: బ్రాడ్‌మన్‌నే మించిపోయాడే ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్. సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్ట్‌లో సెంచరీ ద్వారా స్మిత్ మరో ఘనత సాధించాడు.
Steve Smith surpasses Bradman: క్రికెట్‌లో ఆల్‌టైమ్ గ్రేటెస్ట్ బ్యాట్స్‌మన్‌గా డాన్ బ్రాడ్‌మన్‌కు పేరుంది. టెస్ట్ క్రికెట్‌లో ఏకంగా 99.94 సగటుతో ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు. కేవలం 52 టెస్టుల్లోనే 29 సెంచరీలు, 12 డబుల్ సెంచరీలు చేసిన ఘనత బ్రాడ్‌మన్‌ది. అలాంటి బ్రాడ్‌మన్ రికార్డును ఇప్పుడు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ బ్రేక్ చేశాడు.
సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేయడం ద్వారా బ్రాడ్‌మన్‌ను వెనక్కి నెట్టాడు. టెస్టుల్లో స్మిత్‌కు ఇది 30వ సెంచరీ కావడం విశేషం. దీంతో బ్రాడ్‌మన్ 29 సెంచరీల రికార్డును స్మిత్ అధిగమించాడు. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో జరుగుతున్న మూడో టెస్ట్ రెండో రోజు తొలి ఇన్నింగ్స్‌లో 190 బాల్స్‌లో స్మిత్ ఈ సెంచరీ చేశాడు.
ఆ వెంటనే 104 రన్స్ దగ్గర కేశవ్ మహరాజ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఈ సెంచరీతో ఆస్ట్రేలియా మాజీ బ్యాటర్లు మాథ్యూ హేడెన్, మైకేల్ క్లార్క్‌లను కూడా స్టీవ్ స్మిత్ అధిగమించాడు. ఇప్పుడు ఆస్ట్రేలియా తరఫున టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన వారి లిస్ట్‌లో నాలుగో స్థానానికి చేరాడు. ఈ లిస్ట్‌లో రికీ పాంటింగ్ 13,378 రన్స్‌తో టాప్‌లో కొనసాగుతున్నాడు.
రెండో స్థానంలో అలన్ బోర్డర్ (11,174), మూడో స్థానంలో స్టీవ్ వా (10,927) ఉన్నారు. ప్రస్తుతం స్మిత్ 92 టెస్టుల్లో 8,647 రన్స్ చేశాడు. అతని సగటు 60.89గా ఉంది. అత్యధిక రన్స్ చేసిన ఆస్ట్రేలియా బ్యాటర్లలో అత్యుత్తమ సగటు స్మిత్‌దే కావడం విశేషం. ప్రస్తుతం ఆస్ట్రేలియా తరఫున క్రికెట్ ఆడుతున్న వాళ్లలో డేవిడ్ వార్నర్ ఒక్కడే 8132 రన్స్‌తో స్మిత్‌కు దగ్గరగా ఉన్నాడు.
ఇక టెస్టుల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆస్ట్రేలియా బ్యాటర్ల లిస్ట్‌లోనూ స్మిత్ నాలుగో స్థానంలో ఉన్నాడు. అత్యధికంగా పాంటింగ్ 41 సెంచరీలు చేయగా.. ఆ తర్వాత స్టీవ్ వా 32, మాథ్యూ హేడెన్ 30 సెంచరీలు చేశారు.