Us open winner 2022: యూఎస్ ఓపెన్ విన్నర్ గా అల్కరాజ్ - అతి పిన్న వయస్కుడిగా రికార్డ్
Us open final 2022: యూఎస్ ఓపెన్ కొత్త విజేతగా స్పెయిన్ టెన్నిస్ యువ సంచలనం అల్కరాజ్ నిలిచాడు. సోమవారం జరిగిన ఫైనల్ లో నార్వే ప్లేయర్ రూడ్ పై అల్కరాజ్ విజయాన్ని సాధించాడు.
Us open final 2022: యూఎస్ ఓపెన్ టైటిల్ ను స్పెయిన్ యువ సంచలనం అల్కరాజ్(Carlos alcaraz) సొంతం చేసుకున్నాడు. సోమవారం జరిగిన ఫైనల్ మ్యాచ్ లో నార్వే ప్లేయర్ కాస్పర్ రూడ్(casper ruud) పై 6-4 2-6 7-6 6- 3 తేడాతో అల్కరాజ్ విజయాన్ని సాధించాడు. దాదాపు మూడున్నర గంటల పాటు సాగించిన ఈ మ్యాచ్ లో అల్కరాజ్ కు రూడ్ గట్టిపోటీ ఇచ్చాడు.
తొలి సెట్ ను 6-4 తో సునాయాసంగా గెలుచుకున్నాడు అల్కరాజ్. రెండో సెట్ లో ఊహించని విధంగా రూడ్ నుంచి అతడికి ప్రతిఘటన ఎదురైంది. వరుస పాయింట్లతో దూసుకుపోయిన రూడ్ ఈ సెట్ ను 6- 2 తేడాతో గెలుచుకోవడంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది.
మూడో సెట్ ఇద్దరు హోరాహోరీగా తలపడటంతో టై బ్రేక్ కు దారితీసింది. చివరికి ఈ సెట్ ను 7 - 6 తో అల్కరాజ్ కైవసం చేసుకున్నాడు. చివరి సెట్ లో విజృంభించి 6 - 3 తో గెలుచుకున్నాడు. ఈ మ్యాచ్ లో అల్కరాజ్ పధ్నాలుగు ఏస్ లు సాధించగా రూడ్ కేవలం నాలుగు మాత్రమే సాధించాడు. ఈ మ్యాచ్ ద్వారా 19 ఏళ్ల వయసులోనే యూఎస్ ఓపెన్ టైటిల్ సాధించిన పిన్న వయస్కుడిగా రఫేల్ నాదల్ రికార్డును అల్కరాజ్ సమం చేశాడు.
అంతేకాకుండా వరల్డ్ నంబర్ వన్ ర్యాంకు సొంతం చేసుకున్న అతి పిన్న వయస్కుడైన టెన్నిస్ ప్లేయర్ గా నిలిచాడు. విజేతగా నిలిచిన అల్కరాజ్ 5.62 కోట్ల ప్రైజ్ మనీ దక్కించుకున్నాడు. కాగా అల్కరాజ్, రూడ్ లకు ఇదే తొలి గ్రాండ్ స్లామ్ ఫైనల్ కావడం గమనార్హం.