Avani Lekhara: షూటర్‌ అవని వరల్డ్‌ రికార్డ్‌.. పారా వరల్డ్‌కప్‌లో గోల్డ్‌ మెడల్-shooter avani lekhara creates world record in para world cup shooting ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Avani Lekhara: షూటర్‌ అవని వరల్డ్‌ రికార్డ్‌.. పారా వరల్డ్‌కప్‌లో గోల్డ్‌ మెడల్

Avani Lekhara: షూటర్‌ అవని వరల్డ్‌ రికార్డ్‌.. పారా వరల్డ్‌కప్‌లో గోల్డ్‌ మెడల్

Hari Prasad S HT Telugu
Jun 07, 2022 09:57 PM IST

టోక్యో పారాలింపిక్స్‌ ఛాంపియన్‌ అవని లెఖారా వరల్డ్‌ రికార్డ్‌ క్రియేట్‌ చేసింది. పారా షూటింగ్‌ వరల్డ్‌కప్‌లో గోల్డ్‌ మెడల్‌ సాధించింది.

<p>వరల్డ్ రికార్డుతో గోల్డ్ మెడల్ సాధించిన అవని లెఖారా</p>
వరల్డ్ రికార్డుతో గోల్డ్ మెడల్ సాధించిన అవని లెఖారా (Twitter)

పారిస్‌: జపాన్‌ రాజధాని టోక్యోలో గతేడాది జరిగిన పారాలింపిక్స్‌లో షూటర్‌ అవని లెఖారా గోల్డ్ మెడల్‌ గెలిచిన విషయం తెలిసిందే. ఆమె తాజాగా ఫ్రాన్స్‌లో జరుగుతున్న పారా వరల్డ్‌కప్‌లో వరల్డ్‌ రికార్డ్‌ క్రియేట్‌ చేసింది. 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ స్టాండింగ్‌ ఎస్‌హెచ్‌1 ఈవెంట్‌లో 250.6 స్కోరు సాధించడం విశేషం. 20 ఏళ్ల అవని.. గతంలో తాను నెలకొల్పిన 249.6 రికార్డును తానే బ్రేక్‌ చేసింది.

ఈ వరల్డ్‌ రికార్డ్‌, గోల్డ్‌ మెడల్‌తో ఆమె 2024 పారిస్‌ పారాలింపిక్స్‌కు అర్హత సాధించింది. ఈ ఈవెంట్‌లో పోలాండ్‌కు చెందిన ఎమిలియా బాబ్‌స్కా 247.6 స్కోరుతో సిల్వర్‌ మెడల్‌ గెలుచుకుంది. నిజానికి అవని అసలు ఈ కాంపిటిషన్‌లో పాల్గొంటుందో లేదో అన్న సందేహం మూడు రోజుల ముందు కలిగింది. ఎందుకంటే అవని కోచ్‌తోపాటు ఆమె ఎస్కార్ట్‌కు వీసాలు ఇవ్వడానికి నిరాకరించారు. అయితే కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ, స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా జోక్యంతో వాళ్లకు వీసాలు జారీ అయ్యాయి.

ఇలాంటి పరిస్థితుల్లో ఆమె 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ ఈవెంట్‌లో పాల్గొనడం, ఏకంగా వరల్డ్‌ రికార్డుతో గోల్డ్ మెడల్ సాధించడం విశేషం. ఇండియాకు గోల్డ్ మెడల్‌ తీసుకురావడం, 2024 పారిస్‌ పారాలింపిక్స్‌కు క్వాలిఫై అయిన తొలి ఇండియన్‌ అథ్లెట్‌గా నిలవడం గర్వంగా ఉందని విజయం తర్వాత అవని ట్వీట్‌ చేసింది. పారాలింపిక్స్‌ తర్వాత తాను పార్టిసిపేట్‌ చేసిన తొలి ఇంటర్నేషనల్‌ ఈవెంట్‌ ఇదేనని, తనకు సపోర్ట్‌ అందరికీ కృతజ్ఞతలు అని చెప్పింది.

గతేడాది ఆగస్ట్‌లో అవని లెఖారా టోక్యో పారాలింపిక్స్‌ ఎస్‌హెచ్‌ 1 కేటగిరీ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్‌ స్టాండింగ్‌ ఈవెంట్‌లోనూ గోల్డ్‌ మెడల్ గెలుచుకుంది. అదే పారాలింపిక్స్‌లో 50 మీటర్ల రైఫిల్‌ 3 పొజిషన్స్‌ ఎస్‌హెచ్‌ 1 ఈవెంట్‌లో బ్రాంజ్‌ సాధించింది. ఇలా పారాలింపిక్స్‌లో ఒకటి కంటే ఎక్కువ మెడల్స్‌ గెలుచుకున్న తొలి ఇండియన్‌గానూ రికార్డు సృష్టించింది.

Whats_app_banner

టాపిక్