Wimbledon 2022: సెరెనాకు షాక్.. తొలిరౌండులోనే ఇంటిముఖం-serena williams lost first round in wimbledon 2022 against harmony tan ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Wimbledon 2022: సెరెనాకు షాక్.. తొలిరౌండులోనే ఇంటిముఖం

Wimbledon 2022: సెరెనాకు షాక్.. తొలిరౌండులోనే ఇంటిముఖం

Maragani Govardhan HT Telugu
Jun 29, 2022 07:41 AM IST

టెన్నీస్ స్టార్ సెరెనా విలియమ్స్ ఈ ఏడాది కూడా వింబుల్డన్ తొలి రౌండులోనే నిష్క్రమించింది. ఫ్రాన్స్‌కు చెందిన హార్మనీ ట్యాన్ చేతిలో పరాజయం పాలైంది. మూడు గంటల 10 నిమిషాల పాటు సాగిన ఈ పోరులో విజయం ప్రత్యర్థినే వరించింది.

<p>సెరెనా విలియమ్స్</p>
సెరెనా విలియమ్స్ (REUTERS)

టెన్నీస్ దిగ్గజం సెరెనా విలియమ్స్‌కు గత రెండు, మూడేళ్లుగా ఏమాత్రం కలిసి రావడం లేదు. ఫామ్ లేమితో వరుస పరాజయాలను చవిచూస్తున్న ఈ అమెరికా క్రీడాకారిణి తన ఫేవరెట్ వింబుల్డన్‌లోనూ పరాజయం పాలైంది. ఈ ఏడాది తొలి రౌండులోనే ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది. 23 సార్లు గ్రాండ్‌స్లామ్ విజేతగా నిలిచిన స్టార్.. వరల్డ్ నెంబర్ 115 క్రీడాకారణి హార్మనీ ట్యాన్(ఫ్రాన్స్) చేతిలో ఓడింది. అయితే పరాభవంతో నిష్క్రమించినప్పటికీ చిరునవ్వులు చిందిస్తూ గ్రాస్ కోర్టును వీడింది.

మూడు గంటల 10 నిమిషాల పాటు సాగిన ఈ పోరులో ఫ్రాన్స్ స్టార్.. సెరెనాను దీటుగా ఎదుర్కొంది. 5-7. 6-1, 6-7(7) తేడాతో ఓటమి పాలైనప్పటికీ లక్షలాది అభిమానులకు నిరాశ కలిగించకుండా నవ్వులు చిందిస్తూ కోర్టును విడిచింది.

నిదానంగా గేమ్‌ను ఆరంభించిన సెరెనా.. చివరి వరకు పోరాడినప్పటికీ విజయం ప్రత్యర్థినే వరించింది. ఓపెనింగ్ సెట్‌ను కోల్పోయినప్పటికీ.. తిరిగి పుంజుకున్న ఈ 40 ఏళ్ల టెన్నీస్ స్టార్.. తనదైన శైలిలో రెండో సెట్‌ను కైవసం చేసుకుంది. డిసైడర్‌లో మ్యాచ్ పాయింట్‌ను కాపాడుకున్న టై బ్రేకర్‌కు అవకాశమిచ్చింది. టైబ్రేకర్‌లో 4-0తో ఆరంభంలో ఆధిక్యంలో ఉన్నప్పటికీ హార్మనీ బలంగా ప్రతిఘటించడంతో చివరకు మ్యాచ్‌ను చేజార్చుకుంది సెరెనా.

<p>సెరెనాపై విజయం అనంతరం హార్మనీ ట్యాన్</p>
సెరెనాపై విజయం అనంతరం హార్మనీ ట్యాన్ (REUTERS)

ఈ మ్యాచ్‌తోనే వింబుల్డన్ అరంగేట్రం చేస్తున్న హార్మనీ ట్యాన్‌కు ఇది అత్యుత్తమ విజయం. తన 21వ వింబుల్డన్‌లో పాల్గొన్న సెరెనాను అద్భుతంగా ప్రతిఘటించి ఘనంగా టోర్నీని ఆరంభించింది. హార్మనీకి ఇది నాలుగో గ్రాస్ కోర్టు టోర్నమెంట్ కావడం గమనార్హం. "డ్రా అయిన తర్వాత నాకు చాలా భయమేసింది. నేను సెరెనాతో ఒకటి లేదా రెండు గేమ్స్ మాత్రమే గెలుస్తాననుకున్నా. కానీ మ్యాచ్ గెలవడం ఎంతో ఆనందంగా ఉంది" అని హార్మని స్పష్టం చేసింది.

గతేడాది కూడా గాయం కారణంగా తొలిరౌండులోనే నిష్క్రమించి అభిమానులకు నిరాశకు గురిచేసిన సెరెనా.. మరోసారి పరాజయాన్ని చవిచూసింది. ప్రస్తుతం 23 గ్రాండ్‌స్లామ్ టైటిళ్లతో రెండో స్థానంలో ఉన్న ఈ స్టార్.. మార్గరెట్ కోర్టు 24 గ్రాండ్ స్లామ్ల రికార్డును సమం చేయాలని చాలా కాలం నుంచి ఎదురుచూస్తోంది.

Whats_app_banner

సంబంధిత కథనం

టాపిక్