Sania Mirza in tears: కంటతడి పెట్టిన సానియా.. చివరి మ్యాచ్ తర్వాత ఎమోషనల్ అయిన స్టార్ ప్లేయర్-sania mirza in tears after playing her final grand slam match in melbourne ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Sania Mirza In Tears: కంటతడి పెట్టిన సానియా.. చివరి మ్యాచ్ తర్వాత ఎమోషనల్ అయిన స్టార్ ప్లేయర్

Sania Mirza in tears: కంటతడి పెట్టిన సానియా.. చివరి మ్యాచ్ తర్వాత ఎమోషనల్ అయిన స్టార్ ప్లేయర్

Hari Prasad S HT Telugu
Jan 27, 2023 10:45 AM IST

Sania Mirza in tears: కంటతడి పెట్టింది సానియా మీర్జా. తన కెరీర్ లో చివరి మ్యాచ్ ఆడిన తర్వాత ఆమె ఎమోషనల్ అయింది. మిక్స్‌డ్ డబుల్స్ ఫైనల్లో బోపన్నతో కలిసి బరిలోకి దిగిన సానియా ఓడిపోయిన విషయం తెలిసిందే.

కెరీర్ లో చివరి గ్రాండ్ స్లామ్ మ్యాచ్ ఆడిన తర్వాత సానియా మీర్జా భావోద్వేగం
కెరీర్ లో చివరి గ్రాండ్ స్లామ్ మ్యాచ్ ఆడిన తర్వాత సానియా మీర్జా భావోద్వేగం (AFP)

Sania Mirza in tears: సుమారు రెండు దశాబ్దాల పాటు ఇండియన్ టెన్నిస్ అభిమానులను ఉర్రూతలూగించింది హైదరాబాదీ స్టార్ సానియా మీర్జా. అసలు టెన్నిస్ పెద్దగా పరిచయం లేని వారికి ఈ ఆటను దగ్గర చేసింది. మత కట్టుబాట్లను ఎదురిస్తూ కెరీర్ కొనసాగించింది. డబుల్స్ లో ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ నూ అందుకుంది. కెరీర్ పీక్ లో ఉన్న సమయంలో పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ ను పెళ్లి చేసుకొని విమర్శల పాలైంది.

ఇప్పుడు ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ తో కెరీర్ కు ఇక ముగింపు పలికింది. మిక్స్‌డ్ డబుల్స్ ఫైనల్ చేరి మరో గ్రాండ్ స్లామ్ టైటిల్ తో కెరీర్ కు ఘనంగా ముగింపు పలుకుదామనుకున్న ఆమె ఆశ నెరవేరలేదు. ఫైనల్లో సానియా, బోపన్న జోడీ 6-7, 2-6 తేడాతో ఓడిపోయింది. ఓటమితో కెరీర్ కు ముగింపు పలికిన తర్వాత సానియా ఎమోషనల్ అయింది.

ఈ మ్యాచ్ తర్వాత సానియా కన్నీళ్లు ఆపుకోలేకపోయింది. తన ఫేర్ వెల్ స్పీచ్ ఇస్తూ ఏడ్చేసింది. "నేను ఇంకా రెండు టోర్నీలు ఆడబోతున్నాను. కానీ నా ప్రొఫెషనల్ కెరీర్ మెల్‌బోర్న్ లోనే మొదలైంది. 18 ఏళ్ల వయసులో 2005లో ఇదే మెల్‌బోర్న్ లో సెరెనా విలియమ్స్ తో తలపడ్డాను. నా గ్రాండ్ స్లామ్ కెరీర్ ముగించడానికి ఇంత కన్నా పెద్ద వేదిక మరొకటి ఉండదు" అంటూ సానియా కంటతడి పెట్టుకుంది.

"ఇక్కడికి చాలాసార్లు వచ్చాను. కొన్ని టోర్నమెంట్లు గెలిచాను. కొన్నిగొప్ప ఫైనల్స్ ఆడాను. ఈ రాడ్ లేవర్ అరెనా నా జీవితంలో ప్రత్యేకమైనది. ఓ గ్రాండ్ స్లామ్ కెరీర్ ను ముగించడానికి ఇంతకంటే పెద్ద వేదిక ఉండదు. నా సొంతింట్లో ఉన్న భావన కలిగించిన మీ అందరికీ థ్యాంక్యూ" అని సానియా చెప్పింది.

సానిమా మీర్జా తన కెరీర్ లో మొత్తం ఆరు గ్రాండ్ స్లామ్ డబుల్స్ ఛాంపియన్ షిప్స్, మూడు మిక్స్‌డ్ డబుల్స్ ఛాంపియన్షిప్స్ గెలిచింది. వీటిలో ఒకటి ఆస్ట్రేలియన్ ఓపెన్ కూడా ఉంది. 2009లో సానియా ఆస్ట్రేలియన్ ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్ టైటిల్ సొంతం చేసుకుంది. ఈసారి కూడా దగ్గరగా వచ్చినా ఫైనల్లో ఓటమితో ఆమె తన గ్రాండ్ స్లామ్ కెరీర్ ముగించింది.

Whats_app_banner