Ronaldo predicts FIFA World Cup Winner: ఫిఫా వరల్డ్‌కప్ 2022 ఎవరు గెలుస్తారో చెప్పిన రొనాల్డో
Ronaldo predicts FIFA World Cup Winner: ఫిఫా వరల్డ్‌కప్ 2022 ఎవరు గెలుస్తారో చెప్పాడు బ్రెజిల్ మాజీ ప్లేయర్ రొనాల్డో. ఈ మెగా టోర్నీలో ప్రస్తుతం అర్జెంటీనా, క్రొయేషియా, ఫ్రాన్స్, మొరాకో మిగిలిన విషయం తెలిసిందే.
Ronaldo predicts FIFA World Cup Winner: ఫిఫా వరల్డ్‌కప్ 2022 తుది అంకానికి చేరుకుంది. మంగళ, బుధవారాల్లో రెండు సెమీఫైనల్స్ జరగనున్నాయి. తొలి సెమీఫైనల్లో అర్జెంటీనా, క్రొయేషియా తలపడుతుండగా.. రెండో సెమీఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ ఫ్రాన్స్, ఆఫ్రికన్ సెన్సేషన్ మొరాకో ఆడనున్నాయి. శనివారం (డిసెంబర్ 17) మూడోస్థానం కోసం మ్యాచ్ జరగనుంది.
మెస్సీ ఈసారైనా తన వరల్డ్‌కప్ కల నెరవేర్చుకోవాలని ఆశతో ఉన్నాడు. కానీ రొనాల్డో మాత్రం అర్జెంటీనాకు ఛాన్స్ లేదని అంటున్నాడు. అసలు సెమీఫైనల్లోనే క్రొయేషియా చేతుల్లో అర్జెంటీనా ఓడిపోవచ్చనీ అన్నాడు. "నేనో కపట వ్యక్తిలాగా ఉంటూ అర్జెంటీనా గెలిస్తే సంతోషిస్తాను అని చెప్పను. ఫుట్‌బాల్‌ను రొమాంటిక్ చూస్తాను. ఎవరు ఛాంపియన్ అయినా అభినందిస్తాను" అని రొనాల్డో చెప్పాడు.
అయితే మొదటి నుంచీ తన ఫేవరెట్స్ లిస్ట్‌లో బ్రెజిల్, ఫ్రాన్సే ఉన్నాయని అతనన్నాడు. "మొదటి నుంచీ నా అంచనాల్లో బ్రెజిల్, ఫ్రాన్స్ ఫైనల్ ఆడతాయనే చెబుతున్నాను. ఇప్పుడు బ్రెజిల్ లేదు. కానీ ఫ్రాన్స్ మాత్రం ప్రతి మ్యాచ్‌కు తన ఫేవరెట్స్ ట్యాగ్‌ను మెరుగుపరచుకుంటూ వస్తోంది. ఇప్పటికీ ఆ టీమ్‌నే నేను ఫేవరెట్స్‌గా చెబుతాను" అని మీడియాతో మాట్లాడుతూ రొనాల్డో చెప్పాడు.
బ్రెజిల్ మొత్తం ఐదుసార్లు ఛాంపియన్ కాగా.. అందులో రెండుసార్లు టీమ్‌లో సభ్యుడిగా ఉన్నాడు రొనాల్డో. 2002లో చివరిసారి ఆ టీమ్ విజేతగా నిలిచినప్పుడు ఫైనల్లో జర్మనీపై రొనాల్డోనే రెండు గోల్స్ చేశాడు. ఇప్పుడు రెండో సెమీఫైనల్లో తాను ఫ్రాన్స్‌పై మొరాకో గెలవాలని ఆశిస్తున్నానని, అయితే అది సాధ్యం కాదని రొనాల్డో చెప్పాడు.
"నేను మొరాకోనే గెలవాలని అనుకుంటున్నాను కానీ అది జరుగుతుందని అనుకోవడం లేదు. ఫ్రాన్స్ టీమ్ చాలా బలంగా ఉంది. డిఫెన్స్ అయినా, అటాక్ అయినా, మిడ్‌ఫీల్డ్ అయినా ఫ్రాన్స్ బలంగా కనిపిస్తోంది" అని రొనాల్డో చెప్పాడు.