Ind vs SA: వరుసగా నాలుగోసారీ టాస్‌ ఓడిన రిషబ్‌ పంత్‌.. టీమిండియా బ్యాటింగ్‌-rishabh pant loses the toss again and india batting first against south africa ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Ind Vs Sa: వరుసగా నాలుగోసారీ టాస్‌ ఓడిన రిషబ్‌ పంత్‌.. టీమిండియా బ్యాటింగ్‌

Ind vs SA: వరుసగా నాలుగోసారీ టాస్‌ ఓడిన రిషబ్‌ పంత్‌.. టీమిండియా బ్యాటింగ్‌

Hari Prasad S HT Telugu
Jun 17, 2022 06:34 PM IST

మరో డూ ఆర్‌ డై మ్యాచ్‌కు సిద్ధమైంది టీమిండియా. విశాఖపట్నంలో జరిగిన మూడో టీ20లో గెలిచి సిరీస్‌ను సజీవంగా ఉంచిన పంత్‌ సేన.. ఇక ఇప్పుడు రాజ్‌కోట్‌లో జరగబోయే ఈ మ్యాచ్‌లోనూ గెలిస్తే సిరీస్‌ను సమం చేయగలుగుతుంది.

<p>సౌతాఫ్రికా, ఇండియా కెప్టెన్లు బవుమా, రిషబ్ పంత్</p>
సౌతాఫ్రికా, ఇండియా కెప్టెన్లు బవుమా, రిషబ్ పంత్ (AP)

రాజ్‌కోట్‌: వరుసగా నాలుగో మ్యాచ్‌లోనూ టీమిండియా కెప్టెన్‌ రిషబ్‌ పంత్‌ టాస్‌ ఓడిపోయాడు. దీంతో ఈ మ్యాచ్‌లోనూ మొదట బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. ఈ మ్యాచ్‌కు సౌతాఫ్రికా మూడు మార్పులతో బరిలోకి దిగుతోంది. రబాడా, పార్నెల్‌ గాయాలతో దూరమయ్యారు. క్వింటన్‌ డికాక్‌ గాయం నుంచి కోలుకొని మళ్లీ టీమ్‌లోకి వచ్చాడు. అటు టాస్‌ గెలిస్తే తాము కూడా బౌలింగ్‌ ఎంచుకునే వాళ్లమని చెప్పిన పంత్‌.. తొలి మూడు టీ20లు ఆడిన టీమ్‌తోనే బరిలోకి దిగుతున్నట్లు చెప్పాడు.

రాజ్‌కోట్‌ పిచ్‌ బౌలర్లకు అనుకూలించనుందని పిచ్‌ రిపోర్ట్‌ సందర్భంగా దీప్‌దాస్‌ గుప్తా చెప్పాడు. పిచ్‌పై ఉన్న పచ్చిక వల్ల బౌలర్లకు మంచి సహకారం లభించనుందని అతను తెలిపాడు. ఈ గ్రౌండ్‌లో చేజింగ్ టీమ్స్‌ రాణించాయని, మంచు ప్రభావం అంతగా ఉండదని కూడా చెప్పాడు.

తొలి రెండు మ్యాచ్‌లలో ఓడి తీవ్ర ఒత్తిడిలో వైజాగ్‌ టీ20 బరిలోకి దిగిన టీమిండియా.. ఆ మ్యాచ్‌లో ఆల్‌రౌండ్‌ పర్ఫార్మెన్స్‌తో అదరగొట్టింది. తొలిసారి ఓపెనర్లు ఇద్దరూ అంచనాలకు తగినట్లు ఆడటం, ఇటు స్పిన్నర్‌ చహల్‌, పేసర్‌ హర్షల్‌ పటేల్‌ల అద్భుతమైన బౌలింగ్‌తో ఆ మ్యాచ్‌ గెలిచి సిరీస్‌ ఆశలను సజీవంగా ఉంచింది. అయితే ఇప్పుడు రాజ్‌కోట్‌ టీ20 కూడా డూ ఆర్‌ డై మ్యాచే. సిరీస్‌పై ఆశలు ఉండాలంటే ఇందులోనూ కచ్చితంగా గెలవాల్సిందే.

ఇలాంటి పరిస్థితుల్లో మూడో టీ20 గెలిచిన ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతున్నా.. కెప్టెన్‌ రిషబ్‌ పంత్‌ ఫామే ఆందోళన కలిగిస్తోంది. అతడు తొలి మూడు మ్యాచ్‌లలో కేవలం 40 రన్స్‌ మాత్రమే చేయగలిగాడు.

Whats_app_banner