Ranji Trophy: మధ్యప్రదేశ్‌ టీమ్‌కు భోపాల్‌లో ఘన స్వాగతం పలుకుతాం: సీఎం శివరాజ్‌సింగ్‌-ranji trophy champions madhya pradesh team to receive grand welcom says cm shivraj singh chouhan ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Ranji Trophy: మధ్యప్రదేశ్‌ టీమ్‌కు భోపాల్‌లో ఘన స్వాగతం పలుకుతాం: సీఎం శివరాజ్‌సింగ్‌

Ranji Trophy: మధ్యప్రదేశ్‌ టీమ్‌కు భోపాల్‌లో ఘన స్వాగతం పలుకుతాం: సీఎం శివరాజ్‌సింగ్‌

Hari Prasad S HT Telugu
Jun 26, 2022 06:51 PM IST

తొలిసారి రంజీట్రోఫీ గెలిచి చరిత్ర సృష్టించిన మధ్యప్రదేశ్‌ టీమ్‌కు ఘన స్వాగతం పలకడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ విషయాన్ని స్వయంగా ఆ రాష్ట్ర సీఎం శివరాజ్‌ సింగ్ చౌహానే చెప్పడం విశేషం.

<p>రంజీట్రోఫీతో మధ్యప్రదేశ్ టీమ్ సంబరాలు</p>
రంజీట్రోఫీతో మధ్యప్రదేశ్ టీమ్ సంబరాలు (PTI)

భోపాల్‌: రంజీట్రోఫీ.. ఇండియాలోని దేశవాళీ క్రికెట్‌లో అత్యుత్తమ టోర్నీ. ఈ ట్రోఫీని ఒక్కసారైనా గెలవాలని ప్రతి క్రికెటర్‌ కలలు కంటాడు. తాజాగా మధ్యప్రదేశ్‌ టీమ్‌ తన కలను సాకారం చేసుకుంది. తొలిసారి ఈ ప్రతిష్టాత్మక ట్రోఫీ గెలిచిందా టీమ్‌. ఫైనల్లో 41 సార్లు ఛాంపియన్‌ అయిన ముంబైని 6 వికెట్లతో చిత్తు చేసి సగర్వంగా రంజీ ట్రోఫీని ముద్దాడింది.

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఫైనల్లో చివరి రోజు డ్రా అవుతుందనుకున్న మ్యాచ్‌లో మధ్యప్రదేశ్‌ గెలిచి మరీ ట్రోఫీని సొంతం చేసుకుంది. 108 పరుగుల లక్ష్యాన్ని 29.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి చేజ్‌ చేసింది. 23 ఏళ్ల కిందట కెప్టెన్‌గా తన కలను సాకారం చేసుకోలేకపోయిన ఆ టీమ్‌ ప్రస్తుత కోచ్‌ చంద్రకాంత్‌ పండిట్‌.. ఇప్పుడు ట్రోఫీని గెలిచి భావోద్వేగానికి గురయ్యాడు.

ఈ విజయంపై అటు మధ్యప్రదేశ్‌ సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ కూడా తెగ ఆనందపడిపోతున్నారు. తన ట్విటర్‌లో పోస్ట్‌ చేసిన వీడియోల్లో ఆయన ముఖం వెలిగిపోతోంది. తొలిసారి రంజీట్రోఫీ గెలిచిన తమ టీమ్‌కు భోపాల్‌లో ఘనంగా స్వాగతం పలుకుతామని కూడా ఈ సందర్భంగా శివరాజ్ చెప్పారు. టీమ్‌ కోచ్‌, కెప్టెన్‌, సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలిపారు.

"ఇవాళ మొత్తం మధ్యప్రదేశ్‌ చాలా సంతోషంగా ఉంది. మా టీమ్ చరిత్ర సృష్టించింది. 41 సార్లు చాంపియన్‌ అయిన ముంబైని ఓడించి ఎంపీ రంజీ ట్రోఫీని గెలిచింది. టీమ్‌కు శుభాకాంక్షలు. కేవలం అభినందనలే కాదు.. మొత్తం టీమ్‌కు భోపాల్‌లో ఘనంగా స్వాగతం పలుకుతాం" అని శివరాజ్‌ సింగ్‌ చెప్పారు. ఫైనల్లో మధ్యప్రదేశ్‌ విన్నింగ్ మూమెంట్‌ను కూడా ఆయన తన ట్విటర్‌లో షేర్‌ చేశారు.

Whats_app_banner

సంబంధిత కథనం

టాపిక్