Lakshya Sen | మోదీ నన్ను ఆ స్వీట్లు తీసుకురమ్మన్నారు: లక్ష్యసేన్
ఈ మధ్యే బ్యాడ్మింటన్‌లో తొలిసారి థామస్ కప్ గెలిచి చరిత్ర సృష్టించిన టీమ్‌లో కీలకమైన ప్లేయర్ లక్ష్యసేన్. ఫైనల్లో అతని విజయంతోనే ఇండియా గోల్డ్ వేట మొదలుపెట్టింది.
న్యూఢిల్లీ: ఇండియన్ బ్యాడ్మింటన్ హిస్టరీలో ఎప్పటికీ నిలిచిపోయే విజయం థామస్ కప్‌లో గోల్డ్ మెడల్ రావడం. 73 ఏళ్ల టోర్నీ చరిత్రలో ఇండియాకు ఎప్పుడూ మెడల్ రాలేదు. కానీ ఈసారి ఆ చరిత్రను తిరగరాసింది మన ఇండియన్ టీమ్. గత వారం జరిగిన ఫైనల్లో 14సార్లు ఛాంపియన్ ఇండోనేషియాపై 3-0తో గెలిచిన విషయం తెలిసిందే.
ఈ చారిత్రక విజయం సాధించిన టీమ్‌తో ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం మాట్లాడారు. థామస్ కప్ గెలిచిన టీమ్‌తోపాటు ఉబెర్‌కప్‌లో ఆడిన మహిళల టీమ్ కూడా ప్రధానిని కలిసింది. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. ఎస్, మేం సాధిస్తాం అనే వైఖరి దేశానికి కొత్త శక్తిలా మారిందని అన్నారు. ప్రభుత్వం తరఫున ప్లేయర్స్‌కు అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని కూడా మోదీ హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా ప్రధానిని కలిసి టీమ్‌లో ప్లేయర్ అయిన లక్ష్యసేన్ మాట్లాడాడు. మోదీ తనను అల్మోరాలో ఫేమస్ స్వీట్ అయిన బాల్ మిఠాయీ తీసుకురావాలని అడిగినట్లు చెప్పాడు. "ఆయన చిన్న చిన్న అంశాలపై కూడా నిశితంగా దృష్టి సారిస్తారు. అల్మోరా బాల్ మిఠాయీ ఫేమస్ అని ఆయనకు తెలుసు. తనకోసం తీసుకురావాలని ఆయన చెప్పారు. అందుకే నేను ఆయనకు స్వీట్లు తీసుకొచ్చాను. మా తాత, తండ్రి కూడా ఆడేవారని కూడా మోదీకి తెలుసు. ఈ చిన్న విషయాలు చాలా ముఖ్యం. అంత పెద్ద వ్యక్తి మీతో ఇలాంటి విషయాలు చెబుతుంటే ఆయనతో మాట్లాడటం చాలా బాగా అనిపిస్తుంది" అని లక్ష్యసేన్ అన్నాడు.
థామస్ కప్ ఫైనల్లో ఇండియా సాధించిన మూడు విజయాల్లో మొదటిది లక్ష్యసేన్‌దే. తొలి సింగిల్స్ మ్యాచ్‌లో అతడు ఒలింపిక్స్ బ్రాంజ్ మెడలిస్ట్ ఆంటోనీ గిన్‌టింగ్‌ను ఓడించాడు. ఈ మ్యాచ్‌లో తొలి గేమ్ ఓడినా.. తర్వాత పుంజుకొని తర్వాతి రెండు గేమ్స్‌లో విజయం సాధించాడు.
టాపిక్