Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్‌కు ఇండియన్ హాకీ టీమ్ ఇదే.. ఐదుగురు కొత్త వాళ్లతో..
Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్ కోసం ఇండియన్ హాకీ టీమ్ ను ఎంపిక చేశారు. ఈ జట్టులో ఏకంగా ఐదుగురు కొత్త వాళ్లు ఉండటం గమనార్హం. గత ఒలింపిక్స్ లో మెన్స్ టీమ్ బ్రాంజ్ మెడల్ గెలిచిన విషయం తెలిసిందే.
Paris Olympics 2024: ఒలింపిక్స్ లో నాలుగు దశాబ్దాల తర్వాత 2021లో జరిగిన టోక్యో ఒలింపిక్స్ లో మెడల్ గెలిచిన ఇండియన్ హాకీ టీమ్.. ఇప్పుడు పారిస్ ఒలింపిక్స్ కోసం సిద్ధమవుతుంది. పారిస్ వెళ్లే జట్టును బుధవారం (జూన్ 26) ఎంపిక చేశారు. ఇందులో ఏకంగా ఐదుగురు కొత్త వాళ్లకు చోటు దక్కింది. డిఫెండింగ్ ఛాంపియన్స్ బెల్జియంతో కలిసి పూల్ బిలో ఉన్న ఇండియా ఈసారి ఏం చేస్తుందో అన్న ఆసక్తి నెలకొంది.
పారిస్ వెళ్లే హాకీ టీమ్
పారిస్ ఒలింపిక్స్ కోసం వెళ్లే ఇండియన్ హాకీ జట్టుకు హర్మన్‌ప్రీత్ సింగ్ కెప్టెన్ కాగా.. హార్దిక్ సింగ్ వైస్ కెప్టెన్ గా ఉన్నాడు. ఇక జర్మన్‌ప్రీత్ సింగ్, సంజయ్, రాజ్ కుమార్ పాల్, అభిషేక్, సుఖ్‌జీత్ సింగ్ రూపంలో ఐదుగురు కొత్త వాళ్లు తొలిసారి చోటు దక్కించుకున్నారు. ఇక ఈ జట్టులో మాజీ కెప్టెన్ మన్‌ప్రీత్ సింగ్ తోపాటు సీనియర్ గోల్ కీపర్ పీఆర్ శ్రీజేష్ కూడా ఉన్నారు.
జట్టు ఎంపికపై కోచ్ క్రెయిగ్ ఫుల్టన్ స్పందించాడు. ఎంపిక ప్రక్రియ చాలా బాగా జరిగిందని, జట్టు ఎంపికపై తాను సంతోషంగా ఉన్నట్లు చెప్పాడు. జట్టు యువ, సీనియర్ ఆటగాళ్లతో చాలా పటిష్టంగా ఉందని అభిప్రాయపడ్డాడు. ఈసారి కూడా మెడల్ తీసుకొస్తామన్న ఆత్మవిశ్వాసాన్ని అతడు వ్యక్తం చేశాడు. ప్రపంచంలోని అత్యుత్తమ జట్లతో ఆడబోతున్నామని, పూర్తి అంకితభావంతో ఆడతామని స్పష్టం చేశాడు.
పారిస్ ఒలింపిక్స్ జులై 26 నుంచి ఆగస్ట్ 11 వరకు జరగనున్నాయి. ఈసారి ఇండియన్ హాక్ టీమ్ పూల్ బిలో ఉంది. ఈ పూల్ లో ఇండియాతోపాటు బెల్జియం, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఐర్లాండ్ ఉన్నాయి. క్వార్టర్ ఫైనల్ చేరాలంటే కచ్చితంగా టాప్ 4లో చోటు దక్కించుకోవాలి. అయితే పూల్లోని అన్ని టీమ్స్ స్ట్రాంగా ఉండటంతో ఇండియన్ టీమ్ కు అది అంత సులువు కాకపోవచ్చు.
ఇండియా హాకీ టీమ్ ఇదే
గోల్ కీపర్లు: శ్రీజేష్, పరట్టు రవీంద్రన్
డిఫెండర్లు: జర్మన్‌ప్రీత్ సింగ్, అమిత్ రోహిదాస్, హర్మన్‌ప్రీత్ సింగ్, సుమిత్, సంజయ్
మిడ్‌ఫీల్డర్లు: రాజ్‌కుమార్ పాల్, షంషేర్ సింగ్, మన్‌ప్రీత్ సింగ్, హార్దిక్ సింగ్, వివేక్ సాగర్ ప్రసాద్
ఫార్వర్డ్స్: అభిషేక్, సుఖ్‌జీత్ సింగ్, లలిత్ కుమార్ ఉపాధ్యాయ్, మణ్‌దీప్ సింగ్, గుర్జాంత్ సింగ్