Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్ - తెలంగాణ అథ్లెట్లకు సీఏం రేవంత్ రెడ్డి ఫోన్
Paris Olympics 2024: ఒలింపిక్స్‌లో అద్భుత విజయాలతో దూసుకుపోతున్న తెలంగాణ అథ్లెట్లు నిఖత్ జరీన్, శ్రీజ ఆకుల పాటు పీవీ సింధులకు తెలంగాణ సీఏం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు అందజేశారు. అథ్లెట్లతో ప్రత్యేకంగా ఫోన్ ద్వారా ముచ్చటించిన సీఏం దేశానికి పతకాలు తెచ్చిపెట్టాలని ఆకాంక్షించారు.
Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్ లో ఇండియా నుంచి మొత్తం 16 ఈవెంట్స్‌లో 117 మంది అథ్లెట్లు పోటీలో నిలిచారు. పతకం సాధించడమే లక్ష్యంగా బరిలో దిగిన భారత అథ్లెట్లు అద్భుత ప్రదర్శనతో అదరగొడుతోన్నారు. షూటింగ్‌లో మను భాకర్ ఇండియాకు తొలి పతకం అందించింది. పది మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో కాంస్య పతకం గెలిచింది. షూటింగ్‌తో పాటు ఆర్చరీ, బ్యాడ్మింటన్‌లో ఇండియన్ అథ్లెట్లు అసమాన విజయాలతో పతకాలపై ఆశలను రేపుతోన్నారు.
తొలి రౌండ్‌లో విజయం…
తెలంగాణ రాష్ట్రం నుంచి పలువురు అథ్లెట్లు పారిస్ ఒలింపిక్స్‌కు క్వాలిఫై అయ్యారు. బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధుతో పాటు బాక్సింగ్‌లో నిఖత్ జరీన్, టేబుల్ టెన్నిస్‌లో శ్రీజ ఆకుల ఒలింపిక్స్ బరిలో నిలిచారు. వీరిలో పీవీ సింధు, నిఖత్ జరీన్‌పై భారీగా అంచనాలు నెలకొన్నాయి. తప్పకుండా వీరిద్దరు పతకాలు గెలుస్తారని అభిమానులు భావిస్తోన్నారు. ఆ అంచనాలకు తగ్గట్లుగానే ఒలింపిక్స్ లో పీవీ సింధు, నిఖత్ జరీన్ తమ ఈవెంట్స్ తొలి రౌండ్స్‌లో ప్రత్యర్థులను చిత్తు చేసి పతకం దిశగా ముందడుగు వేశారు.
ప్రీ క్వార్టర్స్‌లో నిఖత్...
ఒలింపిక్స్ యాభై కేజీల విభాగంలో బరిలో దిగిన నిఖత్ జరీన్ క్వాలిఫయర్ పోటీల్లో జర్మనీ బాక్సర్ క్లొయెట్జర్‌ను 5-0 తేడాతో చిత్తు చేసింది. ప్రీక్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించింది. టేబుల్ టెన్నిస్ సింగిల్స్ తొలి రౌండ్‌లో శ్రీజ ఆకుల స్వీడన్ ప్లేయర్‌ను చిత్తు చిత్తుగా ఓడించింది. ఒలింపిక్ డబుల్ విన్నర్ అయిన పీవీ సింధు తొలి రౌండ్‌లో మాల్దీవులుకు చెందిన ఫాతిమా అబ్దుల్ రజాక్‌పై గెలిచింది.
రేవంత్ రెడ్డి అభినందనలు...
ఆయా ఈవెంట్స్ తొలి రౌండ్స్ లో విజయాన్ని సాధించిన తెలంగాణ అథ్లెట్స్ నిఖత్ జరీన్(బాక్సింగ్), శ్రీజ ఆకుల (టేబుల్ టెన్నిస్), పీవీ సింధు (బ్యాడ్మింటన్) లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోన్ ద్వారా అభినందనలు తెలిపారు. వారితో ముచ్చటించారు. మరో తెలంగాణ అథ్లెట్ ఇషా సింగ్ (షూటింగ్)కు కూడా సీఎం బెస్ట్ విషెస్ చెప్పారు. తర్వాతి రౌండ్స్‌లోనూ వారు విజయాల్ని సాధించి దేశానికి మెడల్స్ తీసుకురావాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.