Pakistan vs England: ఆడిన తొలి టెస్ట్‌లోనే ఏడు వికెట్లు తీసిన పాకిస్థాన్ మిస్టరీ స్పిన్నర్
Pakistan vs England: ఆడిన తొలి టెస్ట్‌లోనే ఏడు వికెట్లు తీసి అదరగొట్టాడు పాకిస్థాన్ మిస్టరీ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్. అతని ధాటికి రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 281 రన్స్‌కే కుప్పకూలింది.
Pakistan vs England: పాకిస్థాన్‌కు ఓ మిస్టరీ స్పిన్నర్ దొరికాడు. 24 ఏళ్ల అతని పేరు అబ్రార్ అహ్మద్. ఈ మిస్టరీ బౌలర్ ఆడిన తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లోనే 7 వికెట్లు పడగొట్టాడు. ముల్తాన్‌లో శుక్రవారం (డిసెంబర్ 9) ప్రారంభమైన ఇంగ్లండ్, పాకిస్థాన్ రెండో టెస్ట్ తొలి రోజు అబ్రార్ చెలరేగిపోయాడు. అతడు 114 రన్స్ ఇచ్చి 7 వికెట్లు తీయడం విశేషం.
దీంతో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 281 రన్స్‌కే ఆలౌటైంది. ఓపెనర్ బెన్ డకెట్(63), ఓలీ పోప్(60) హాఫ్ సెంచరీలు చేశారు. టెస్ట్ మ్యాచ్‌లో తాను వేసిన తొలి ఓవర్లోనే అబ్రార్ వికెట్ తీశాడు. ఐదో బంతికి ఇంగ్లండ్ ఓపెనర్ జాక్ క్రాలీని క్లీన్ బౌల్డ్ చేశాడు. ఇక అక్కడి నుంచి చెలరేగిపోయిన అబ్రార్.. మరో ఆరు వికెట్లు పడగొట్టాడు.
ఎన్నో వేరియేషన్స్‌తో అబ్రార్.. ఇంగ్లండ్ బ్యాటర్ల దూకుడును అడ్డుకున్నాడు. బ్యాటింగ్‌కు అనుకూలించే రావల్పిండి టెస్ట్‌లో భారీ స్కోరు చేసిన ఇంగ్లండ్.. ముల్తాన్‌లో మాత్రం అబ్రార్ స్పిన్ మాయకు తలవంచింది. తొలి ఏడు వికెట్లు మొత్తం అబ్రార్ ఖాతాలోనే చేరాయంటే అతడు ఏ రేంజ్‌లో చెలరేగాడో అర్థం చేసుకోవచ్చు.
అతని దూకుడు చూస్తే మొత్తం పది వికెట్లు తీసేలా కనిపించాడు. అయితే మరో బౌలర్ జాహిద్ మహ్మూద్ మిగిలిన మూడు వికెట్లు తీసుకున్నాడు. లంచ్ బ్రేక్ సమయానికి అబ్రార్ ఖాతాలో ఐదు వికెట్లు చేరాయి. గాయాల కారణంగా ప్రధాన బౌలర్లందరినీ కోల్పోయిన పాకిస్థాన్‌కు అబ్రార్ రూపంలో ఓ మిస్టరీ స్పిన్నర్ ఆపద్భాందవుడిలా వచ్చాడు.
లంచ్‌కు ముందే అబ్రార్ తన బౌలింగ్‌లో జాక్ క్రాలీ, బెన్ డకెట్, జో రూట్, ఓలీ పోప్, హ్యారీ బ్రూక్‌లను ఔట్ చేశాడు. ఆడిన తొలి టెస్ట్ తొలి సెషన్‌లోనే ఐదు వికెట్లు తీసిన తొలి పాకిస్థాన్ బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు. మూడు టెస్ట్‌ల సిరీస్‌లో ప్రస్తుతం ఇంగ్లండ్ 1-0 లీడ్‌లో ఉన్న విషయం తెలిసిందే. తొలి టెస్ట్‌లో 74 రన్స్ తేడాతో పాక్‌ను ఇంగ్లండ్ చిత్తు చేసింది.