Paris Olympics Gold Medal: పారిస్ ఒలింపిక్స్ తొలి మెడల్, గోల్డ్ మెడల్ గెలిచిన దేశాలు ఇవే.. వేట మొదలైంది-olympics gold medal china wins first gold medal in paris olympics 2024 kazakhstan wins first medal ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Paris Olympics Gold Medal: పారిస్ ఒలింపిక్స్ తొలి మెడల్, గోల్డ్ మెడల్ గెలిచిన దేశాలు ఇవే.. వేట మొదలైంది

Paris Olympics Gold Medal: పారిస్ ఒలింపిక్స్ తొలి మెడల్, గోల్డ్ మెడల్ గెలిచిన దేశాలు ఇవే.. వేట మొదలైంది

Hari Prasad S HT Telugu
Jul 27, 2024 04:29 PM IST

Olympics Gold Medal: పారిస్ ఒలింపిక్స్ 2024లో తొలి మెడల్, తొలి గోల్డ్ మెడల్ విజేతలు తేలిపోయారు. ఊహించినట్లే చైనా తొలి గోల్డ్ మెడల్ గెలవగా.. కజకిస్థాన్ తొలి మెడల్ గెలిచింది.

పారిస్ ఒలింపిక్స్ తొలి మెడల్, గోల్డ్ మెడల్ గెలిచిన దేశాలు ఇవే.. వేట మొదలైంది
పారిస్ ఒలింపిక్స్ తొలి మెడల్, గోల్డ్ మెడల్ గెలిచిన దేశాలు ఇవే.. వేట మొదలైంది (REUTERS)

Olympics Gold Medal: పారిస్ ఒలింపిక్స్ 2024 తొలి రోజే మెడల్స్ ఖాతా తెరిచింది చైనా. అది కూడా గోల్డ్ మెడల్ కావడం విశేషం. అటు మరో ఆసియా దేశం కజకిస్థాన్ ఈసారి ఒలింపిక్స్ లో తొలి మెడల్ గెలిచిన దేశంగా నిలిచింది. అలా తొలి రోజు కజకిస్థాన్, చైనా దేశాలు తొలి మెడల్, తొలి గోల్డ్ మెడల్ గెలిచిన దేశాలుగా నిలవడం విశేషం.

చైనాకు గోల్డ్ మెడల్

పారిస్ ఒలింపిక్స్ 2024లో తొలి మెడల్ ఈవెంట్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్లో జరిగింది. ఇందులో చైనాకు చెందిన హువాంగ్ యూటింగ్, షెంగ్ లిహావో గోల్డ్ మెడల్ గెలవడం విశేషం. ఈ మెడల్ తో చైనా తొలి స్థానానికి దూసుకెళ్లింది. ప్రతి ఒలింపిక్స్ లోనూ టాప్ ప్లేస్ కోసం చైనా, యూఎస్ఏ మధ్య గట్టి పోటీ ఉంటుంది. ఈసారి చైనా గోల్డ్ మెడల్ తో తొలి అడుగు వేసింది.

చైనా టీమ్ ప్రత్యర్థి కొరియాపై 16-12 తేడాతో విజయం సాధించింది. కొరియాకు చెందిన కియుమ్ జిహ్యోన్, పార్క్ జహున్ సిల్వర్ మెడల్ దక్కించుకున్నారు. అయితే ఈ సారి తొలి మెడల్ గెలిచిన ఘనత మాత్రం కజకిస్థాన్ కు దక్కుతుంది. ఆ టీమ్ ఇదే ఈవెంట్లో మొదట జరిగిన బ్రాంజ్ మెడల్ పోటీలో జర్మనీని వెనక్కి నెట్టి మెడల్ సొంతం చేసుకుంది. 1996 తర్వాత షూటింగ్ ఈవెంట్లో కజకిస్థాన్ తొలిసారి ఇప్పుడే మళ్లీ మెడల్ గెలిచింది.

ఇండియాకు నిరాశే

ఒలింపిక్స్ 2024 తొలి రోజు ఇండియా పాల్గొన్న ఏకైక మెడల్ ఈవెంట్ ఈ పది మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్‌డ్ టీమే. అయితే ఇందులో మన దేశానికి చెందిన రెండు టీమ్స్ క్వాలిఫయింగ్ రౌండ్లో పోటీ పడినా.. ఫైనల్ కు మాత్రం చేరలేకపోయారు. టాప్ 4 టీమ్స్ మాత్రమే ఫైనల్ చేరే అవకాశం ఉండగా.. ఇండియాకు చెందిన రమితా జిందల్, అర్జున్ బబుతా జోడీ 6వ స్థానంలో నిలిచింది. మరో జోడీ సందీప్ సింగ్, ఎలవెనిల్ వలరివన్ 12వ స్థానంతో సరిపెట్టుకుంది.

రమితా జిందల్, అర్జున్ బబుతా అర్హత సాధించడానికి దగ్గరగా వచ్చినా.. 628.7 పాయింట్లతో ఆరో స్థానంలో నిలిచింది. కేవలం ఒకే ఒక్క పాయింట్ తో నార్వే, జర్మనీ జట్ల కంటే వెనుకబడింది. ఈ రెండు టీమ్స్ బ్రాంజ్ మెడల్ కోసం పోటీ పడనున్నాయి. ఇక మరో ఇండియా జోడీ సందీప్ సింగ్, ఎలవెనిల్ వలరివన్ 12వ స్థానంతో సరిపెట్టుకుంది. ఆ టీమ్ కేవలం 626.3 పాయింట్లు మాత్రమే సాధించింది.

ఈ ఈవెంట్లో భాగంగా ఒక్క షూటర్ 30 సార్లు షూట్ చేశారు. ఒక్కో టీమ్ లోని ఇద్దరు షూటర్లు సాధించిన మొత్తం పాయింట్ల ఆధారంగా మెడల్ ఈవెంట్స్ కు టీమ్స్ అర్హత సాధించాయి. టాప్ 2 టీమ్స్ గోల్డ్ మెడల్ కోసం, మూడు, నాలుగు స్థానాల్లోని టీమ్స్ బ్రాంజ్ మెడల్ కోసం పోటీ పడతాయి. చైనా 632.2 పాయింట్లతో టాప్ లో ఉండగా.. కజకిస్తాన్ 630.8 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. జర్మనీ 629.7 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది.

Whats_app_banner