Ruturaj Gaikwad: గ్రౌండ్ సిబ్బందితో రుతురాజ్ దురుసు ప్రవర్తన...నెటిజన్లు ఫైర్
ఆదివారం ఇండియా, సౌతాఫ్రికా మధ్య జరగాల్సిన ఐదో టీ20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. ఐదు మ్యాచ్ ల ఈ సిరీస్ 22 తో సమమైంది. అయితే ఈ మ్యాచ్ లో స్టేడియం సిబ్బందితో టీమ్ ఇండియా ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (ruturaj gaikwad) దురుసుగా ప్రవర్తించాడు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
టీమ్ ఇండియా, సౌతాఫ్రికా మధ్య జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ 2 2 తో సమమైంది. ఆదివారం జరగాల్సిన ఐదో టీ20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయ్యింది. మ్యాచ్ ఆరంభంలోనే వర్షం పడటంతో 19 ఓవర్లకు కుదించారు. ఆ తర్వాత మూడు ఓవర్లు ఇండియా బ్యాటింగ్ సాగగానే మరోసారి భారీగా వర్షం మొదలవ్వడంతో మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మ్యాచ్ లో గ్రౌండ్ సిబ్బంది పట్ల టీమ్ ఇండియా ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ ప్రవర్తించిన తీరు విమర్శలకు దారితీసింది. వర్షం పడి మ్యాచ్ నిలిచిపోవడంతో క్రికెటర్లు అందరూ డగౌట్ కు చేరుకున్నారు. తిరిగి మ్యాచ్ ను మొదలుపెట్టేందుకు గ్రౌండ్ సిబ్బంది ప్రయత్నించారు.
ఒకవేళ మ్యాచ్ మొదలైతే బ్యాటింగ్ దిగడం కోసం రుతురాజ్, ఇషాన్ గ్లోవ్స్, హెల్మెట్ ధరించి డగౌట్ లో కూర్చొని కనిపించారు. ఆ సమయంలో గ్రౌండ్ సిబ్బంది ఒకరు రుతురాజ్ తో సెల్ఫీ దిగడానికి ప్రయత్నించాడు. అతడి పక్కనే కూర్చొని ఫోన్ లో ఫొటో తీసుకుంటున్న తరుణంలో రుతురాజ్ అతడిని వారించాడు. అక్కడి నుండి వెళ్లిపొమ్మన్నట్లుగా చేతిలో సైగలు చేశాడు. గ్రౌండ్ స్టాఫ్ సెల్ఫీ అడుగుతున్నా పట్టించుకోకుండా పక్కనున్న వారితో మాట్లాడుతూ రుతురాజ్ కనిపించాడు.
ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. స్టేడియం సిబ్బందితో అతడి ప్రవర్తన పై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఎదుటివారిని గౌరవించడం నేర్చుకోవాలని రుతురాజ్ ను మందలిస్తున్నారు. అతడి ఆటిట్యూడ్ సరిగా లేదంటూ ఏకి పారేస్తున్నారు. గ్రౌండ్ సిబ్బందితో ధోనీ, రోహిత్ శర్మ గతంలో దిగిన ఫొటోలను షేర్ చేస్తున్నారు. వారి నుండి రుతురాజ్ చాలా నేర్చుకోవాలని చెబుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. .
మరికొందరు మాత్రం కొవిడ్ ప్రొటోకాల్ వల్లే రుతురాజ్ స్టేడియం సిబ్బందిని వారించాడని అంటున్నారు. అలా ప్రవర్తించడం వెనుకు దురుద్దేశమేమి లేదని చెబుతున్నారు. అతడి తప్పేం లేదని, సున్నితంగానే అతడు వారించినట్లు పేర్కొంటున్నారు.
.
సంబంధిత కథనం