Venkatesh Iyer Record Century: సెంచరీతో కదం తొక్కిన వెంకటేష్.. కేకేఆర్ 15 ఏళ్ల కరవును తీర్చిన బ్యాటర్-venkatesh iyer breaks kkr s 15 year century drought after mccullum ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Venkatesh Iyer Record Century: సెంచరీతో కదం తొక్కిన వెంకటేష్.. కేకేఆర్ 15 ఏళ్ల కరవును తీర్చిన బ్యాటర్

Venkatesh Iyer Record Century: సెంచరీతో కదం తొక్కిన వెంకటేష్.. కేకేఆర్ 15 ఏళ్ల కరవును తీర్చిన బ్యాటర్

Maragani Govardhan HT Telugu
Apr 16, 2023 05:47 PM IST

Venkatesh Iyer Record Century: కోల్‌కతా బ్యాటర్ వెంకటేష్ అయ్యర్ సెంచరీ విజృంభించాడు. ముంబయితో జరుగుతున్న మ్యాచ్‌లో 51 బంతుల్లో 104 పరుగులతో ఆకట్టుకున్నాడు. ఫలితంగా కేకేఆర్ తరఫున సెంచరీ చేసిన రెండో బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు.

వెంకటేష్ అయ్యర్
వెంకటేష్ అయ్యర్ (PTI)

Venkatesh Iyer Record Century: ముంబయి ఇండియన్స్‌తో జరుగుతున్న ఐపీఎల్ 21వ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ బ్యాటర్ వెంకటేష్ అయ్యర్ అదరగొట్టాడు. అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ముంబయి బౌలర్లపై ఎదురుదాడిక చేసి అదిరిపోయే రీతిలో సెంచరీ నమోదు చేశాడు. ఉన్నంత సేపు దూకుడుగా ఆడిన వెంకటేష్ తన సెంచరీతో మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. కోల్‌కతా తరఫున సెంచరీ చేసిన రెండో బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు.

ఐపీఎల్ ఆరంభ సీజన్ 2008లో అప్పటి కేకేఆర్ బ్యాటర్ బ్రెండన్ మెక్‌కల్లమ్ (158*) భారీ సెంచరీ సాధించాడు. ఐపీఎల్ తొలి మ్యాచ్‌లో భారీ శతకంతో విజృంభించిన అతడి తర్వాత ఇంతవరకు కేకేఆర్ ఆటగాళ్లు సెంచరీ నమోదు చేయలేదు. తాజాగా వెంకటేష్ అయ్యర్ ముంబయిపై అద్భుత శతకంతో ఆకట్టుకున్నాడు. ఈ మ్యాచ్‌లో అతడు 49 బంతుల్లో 100 పరుగులు పూర్తి చేశాడు. మొత్తంగా 51 బంతుల్లో 104 రన్స్ చేశాడు. ఇందులో 6 ఫోర్లు, 9 సిక్సర్లు ఉన్నాయి.

ముంబయి బౌలర్లను లక్ష్యంగా చేసుకుని వెంకటేష్ అయ్యర్ ధాటిగా ఆడాడు. వరుస పెట్టి బౌండరీలు, సిక్సర్ల వర్షం కురిపించాడు. అతడి దూకుడుకు కోల్‌కతా ముంబయి ఇండియన్స్ ముందు భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. వెంకటేష్ అయ్యర్‌కు ఐపీఎల్‌లో ఇదే తొలి శతకం. కేకేఆర్ తరఫున సెంచరీ చేసిన రెండో ఆటగాడిగా వెంకటేష్ రికార్డు సృష్టించాడు.

గత సీజన్‌లో వెంకటేష్ అయ్యర్ పెద్దగా రాణించనప్పటికీ.. కేకేఆర్ జట్టు అతడిని రిటేన్ చేసుకుంది. గత ఐపీఎల్‌లో 12 మ్యాచ్‌ల్లో అతడు 16.55 సగటుతో కేవలం 182 పరుగులు మాత్రమే చేశాడు. కానీ ఈ సీజన్‌లో మాత్రం అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. ఇప్పటికే ఐదు మ్యాచ్‌ల్లో కలిపి 234 పరుగులతో ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్నాడు. ఇందులో ఓ శతకం, ఓ అర్ధ సెంచరీ ఉన్నాయి.

ముంబయి ఇండియన్స్‌తో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. వాంఖడే వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో వెంకటేష్ అయ్యర్(104) సెంచరీతో కదం తొక్కగా.. చివర్లో రసెల్(21) మెరుపులు మెరిపించాడు. అయితే మిగిలిన వారు పెద్దగా రాణించకపోవడంతో కేకేఆర్ ఆశించిన స్కోరు చేయలేకపోయింది. అయినప్పటికీ వెంకటేష్ సెంచరీతో మెరుగైన స్కోరు సాధించింది. ముంబయి బౌలర్లలో హృతిక్ షోకీన్ 2 సెంచరీలు చేయగా.. కేమరూన్ గ్రీన్, డ్వాన్ జన్సెన్, పియూష్ చావ్లా, రిలే మెరిడెత్ తలో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.

WhatsApp channel