SRH vs KKR: వరుసగా రెండో మ్యాచ్‌లో ఆరెంజ్ ఆర్మీ విజయం.. కోల్‌కతాను చిత్తు చేసిన హైదరాబాద్-sunrisers hyderabad won by 23 runs against kolkata knight riders ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Sunrisers Hyderabad Won By 23 Runs Against Kolkata Knight Riders

SRH vs KKR: వరుసగా రెండో మ్యాచ్‌లో ఆరెంజ్ ఆర్మీ విజయం.. కోల్‌కతాను చిత్తు చేసిన హైదరాబాద్

Maragani Govardhan HT Telugu
Apr 14, 2023 11:52 PM IST

SRH vs KKR: ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్‌ 23 పరుగుల తేడాతో విజయం సాధించింది. కోల్‌కతా బ్యాటర్లో నితీష్ రాణా, రింకూ సింక్ అర్ధశతకాలు చేసినప్పటికీ తమ జట్టుకు విజయాన్ని అందించలేకపోయారు.

కోల్‌కతాపై సన్ రైజర్స్ ఘనవిజయం
కోల్‌కతాపై సన్ రైజర్స్ ఘనవిజయం (AFP)

SRH vs KKR: కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన ఐపీఎల్ 2023 19వ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 23 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 228 పరుగులు చేయగా.. కోల్‌కతా 7 వికెట్ల నష్టానికి 205 పరుగులే చేయగలిగింది. 229 పరుగులు భారీ లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన కోల్‌కతా బ్యాటర్లలో నితీశ్ రాణా(75), రింకూ సింగ్(58) అర్ధశతకాలతో ఆకట్టుకున్నప్పటికీ జట్టుకు విజయాన్ని మాత్రం అందించలేకపోయారు. హైదరాబాద్ బౌలర్లలో మయాంక్ మార్కండే, మార్కో జన్సెన్ చెరో 2 వికెట్లతో రాణించగా.. భువి, ఉమ్రాన్, నటరాజన్ తలో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.

229 పరుగుల లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన కోల్‌కతాకు శుభారంభమేమి దక్కలేదు. పరుగుల ఖాతా తెరవకముందే కేకేఆర్ ఓపెనర్ రహమతుల్లా గుర్బాజ్‌ను డకౌట్‌గా వెనక్కి పంపించాడు భువనేశ్వర్. ఆ కాసేపటికే వెంకటేష్ అయ్యర్‌(10)ను మార్కో జన్సెన్ ఔట్ చేశాడు. ఆ తర్వాతి బంతికే సునీల్ నరైన్‌(0)ను పెవిలియన్ చేర్చాడు. దీంతో 20 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతూ కష్టాల్లో పడింది కోల్‌కతా ఇలాంటి సమయంలో కెప్టెన్ నితీష్ రాణా.. ఓపెనర్ జగదీశన్‌(36)తో కలిసి కీలక ఇన్నింగ్స్ ఆడాడు.

ముఖ్యంగా ఉమ్రాన్ మాలిక్ వేసిన ఆరో ఓవర్లో ఓ 2 సిక్సర్లు సహా నాలుగు ఫోర్లతో విరుచుకుపడ్డాడు నితీష్ రాణా. ఆ ఓవర్లో 28 పరుగులు కేకేఆర్ రాబట్టింది. దీంతో మ్యాచ్‌పై ఆశలు చిగురించాయి. అప్పటి నుంచి ప్రతి ఓవర్లోనో బౌండరీలు సిక్సర్లతో దూసుకెళ్లారు నితీశ్. జగదీషన్‌తో కలిసి అతడు 64 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. అయితే వీరి జోడీ బలపడుతున్న తరుణంలో సన్‌రైజర్స్ గత మ్యాచ్ హీరో మయాంక్ మార్కాండే మలుపు తిప్పాడు. జగదీశన్‌ను ఔట్ చేశాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ఆండ్రూ రసెల్‌ను కూడా మార్కాండే ఎక్కువ సేపు క్రీజలో ఉండనీయలేదు.

ఇలాంటి సమయంలో నితీష్ రాణా.. గత మ్యాచ్‌లో అదరగొట్టిన రింకూ సింగ్ హైదరాబాద్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. ఉన్నంత సేపు బౌండరీల వర్షం కురిపించారు. భువనేశ్వర్ మినహా ప్రతి బౌలర్‌ను ఓ ఆటాడుకున్నారు. వరుస పెట్టి సిక్సర్లు, బౌండరీలతో హోరెత్తించారు. వీరిద్దరూ క్రీజులో ఉంటే మ్యాచ్ కేకేఆర్ గెలుస్తుందేమోనేంతగా అదరగొట్టారు. అయితే 19వ ఓవర్ వేసిన నటరాజన్ నితీష్ రాణాను ఔట్ చేయడంతో మ్యాచ్ మలుపుతిరిగింది. అయితే ఆ ఓవర్లో రింకూ సింగ్ రెండు ఫోర్లు బాదడంతో మ్యాచ్ చివరి వరకు కొనసాగింది.

చివరి ఓవర్లో ఉమ్రాన్ మాలిక్ మాయాజాలం..

ఆఖరు ఓవర్లో కేకేఆర్ విజయానికి ఆరు బంతుల్లో 32 పరుగుల అవసరమయ్యాయి. క్రీజులో శార్దూల్ ఠాకూర్, రింకూ సింగ్ ఉన్నారు. తొలి బంతికే శార్దూల్‌ను ఔట్ చేశాడు ఉమ్రాన్ మాలిక్. ఆ తర్వాత బంతికి సింగిల్ రావడంతో హైదరాబాద్ గెలుపు దాదాపు ఖాయమైంది. 5 బంతుల్లో 32 పరుగులు అవసరం కాగా.. ఆ తదుపరి బంతిని సింగిల్ తీశాడు ఉమేష్ యాదవ్. దీంతో ఫలితం 4 బంతుల్లో 31 పరుగులగా మారింది. అనంతరం తర్వాత రెండు బంతులు డాట్ బాల్స్ కాగా.. ఐదో బంతికి రింకూ సింగ్ సిక్సర్ కొడతాడు. చివరి బంతికి సింగిల్ రావడంతో హైదరాబాద్ 23 పరుగుల తేడాతో విజయం సాధించింది.

మ్యాచ్‌ విజయం దాదాపు హైదరాబాద్ వైపే ఉన్నప్పటికీ పలు ఫీల్డింగ్ పొరపాట్లు, క్యాచ్ డ్రాప్‌ల కారణంగా గేమ్ చివరి వరకు సాగింది. హైదరాబాద్ ఫీల్డర్లు పలు మార్లు క్యాచ్‌ల జారవిడిచారు. ఈ మ్యాచ్‌లో అర్ధశతకంతో ఆకట్టుకున్న హ్యారీ బ్రూక్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.

ఈ మ్యాచ్‌లో కోల్‌కతాపై సన్‌రైజర్స్ 4 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది. హ్యారీ బ్రూక్ సెంచరీ(100*)తో కదం తొక్కగా.. కెప్టెన్ మార్కక్రమ్(50) అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు. చివర్లో అభిషేక్ శర్మ 17 బంతుల్లో 32 పరుగులతో మెరుపులు మెరిపించాడు. కోల్‌కతా బౌలర్లలో ఆండ్రూ రసెల్ 3 వికెట్లు తీశాడు.

WhatsApp channel