Mohsin Khan: పది రోజులుగా మా నాన్న ఐసీయూలో ఉన్నాడు అయినా.. చివరి ఓవర్ హీరో మోసిన్ ఖాన్-mohsin khan explains how he overcame the pain of his father who was in icu and win it for lsg ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Mohsin Khan: పది రోజులుగా మా నాన్న ఐసీయూలో ఉన్నాడు అయినా.. చివరి ఓవర్ హీరో మోసిన్ ఖాన్

Mohsin Khan: పది రోజులుగా మా నాన్న ఐసీయూలో ఉన్నాడు అయినా.. చివరి ఓవర్ హీరో మోసిన్ ఖాన్

Hari Prasad S HT Telugu
May 17, 2023 07:51 AM IST

Mohsin Khan: పది రోజులుగా మా నాన్న ఐసీయూలో ఉన్నాడు అయినా ఆ బాధను దిగమింగుతూ లక్నోను గెలిపించానని చెప్పాడు చివరి ఓవర్ హీరో మోసిన్ ఖాన్. ఆ ఓవర్లో కేవలం ఐదు పరుగులు మాత్రమే ఇచ్చి ముంబై కొంప ముంచాడు.

లక్నో బౌలర్ మోసిన్ ఖాన్
లక్నో బౌలర్ మోసిన్ ఖాన్ (PTI)

Mohsin Khan: ఐపీఎల్లో మోసిన్ ఖాన్ ఒక్క ఓవర్ తోనే హీరో అయిపోయాడు. ముంబై ఇండియన్స్ తో మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్ అయిన మోసిన్.. చివరి ఓవర్లో 11 పరుగుల లక్ష్యాన్ని కాపాడి అందరినీ షాక్‌కు గురి చేశాడు. అయితే ఈ మ్యాచ్ కు ముందు పది రోజులుగా తన తండ్రి ఐసీయూలో ఉన్నాడని, అయినా ఆ బాధను దిగమింగుతూ చివరి ఓవర్ ను విజయవంతంగా వేశానని మ్యాచ్ తర్వాత మోసిన్ చెప్పాడు.

ఈ 24 ఏళ్ల యూపీ బౌలర్ ఇప్పుడో సంచలనం. ఈ ఏడాది ఐపీఎల్లో కేవలం రెండో మ్యాచ్ ఆడుతూ.. చివరి ఓవర్ ఒత్తిడిని అధిగమిస్తూ అతడు వేసిన బౌలింగ్ క్రికెట్ ప్రపంచంలో కొత్త చర్చకు దారితీసింది. పైగా అతడు గాయం కారణంగా ఏడాది తర్వాత ఇప్పుడిప్పుడే మళ్లీ క్రికెట్ ఆడటం మొదలుపెట్టాడు.

"ఇది నాకు కష్టకాలం. గాయం కారణంగా ఏడాది తర్వాత ఆడుతున్నాను. మా నాన్న పది రోజులు ఐసీయూలో ఉన్న తర్వాత నిన్ననే డిశ్చార్జ్ అయ్యారు. నేను ఆయన కోసం ఈ విజయం సాధించిపెట్టాను. ఆయన నన్ను చూస్తున్నారన్న నమ్మకం ఉంది" అని మోసిన్ అన్నాడు.

ఇక తనకు మద్దతుగా నిలిచిన జట్టుకు థ్యాంక్స్ చెప్పాడు. "టీమ్, సపోర్ట్ స్టాప్ కు రుణపడి ఉంటాను. గౌతమ్ గంభీర్ సర్, విజయ్ దహియా సర్ లు నేను గత మ్యాచ్ లో సరిగా ఆడకపోయినా ఈ మ్యాచ్ లో ఆడించారు" అని చెప్పుకొచ్చాడు.

చివరి ఓవర్ ప్లాన్ ఇదీ..

ఇక తన చివరి ఓవర్ ప్లాన్ గురించి కూడా అతడు వివరించాడు. "నేను ప్రాక్టీస్ చేసినదానిని అమలు చేయడమే ప్లాన్. కృనాల్ నాతో మాట్లాడినప్పుడు కూడా అదే చెప్పాను. రనప్ కూడా మార్చలేదు. మరీ ఆందోళన చెందకుండా, స్కోరుబోర్డు వైపు చూడకుండా.. ఆరు బాల్స్ ముగించాలని అనుకున్నాను. వికెట్ నెమ్మదిగా ఉండటంతో స్లోబాల్స్ వేయాలనుకున్నాను. రెండు బాల్స్ వేసిన తర్వాత యార్కర్ వైపు చూశాను. బాల్ రివర్స్ స్వింగ్ కూడా అయ్యింది" అని మోసిన్ ఖాన్ చెప్పాడు.

చివరి ఓవర్లో ముంబై గెలవాలంటే 11 పరుగులు అవసరం. టిమ్ డేవిడ్, కామెరాన్ గ్రీన్ లాంటి హిట్టర్లు క్రీజులో ఉండటంతో ఇక గెలుపు లాంఛనమే అనుకున్నారు. కానీ మోసిన్ ఖాన్ మాత్రం కేవలం 5 పరుగులే ఇచ్చాడు. దీంతో ఎంఐ 5 పరుగులతో ఓడి.. ప్లేఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది.

WhatsApp channel

సంబంధిత కథనం