Ashes Series: ఇంగ్లండ్ 'యాషెస్' ఆశలు సజీవం: మూడో టెస్టులో ఆస్ట్రేలియాపై ఉత్కంఠ గెలుపు
Ashes Series: యాషెస్ సిరీస్ మూడో టెస్టులో ఆస్ట్రేలియాపై ఇంగ్లండ్ విజయం సాధించింది. దీంతో సిరీస్ చేజారకుండా ఆశలు సజీవంగా నిలుపుకోగలిగింది.
Ashes Series: ప్రతిష్టాత్మక యాషెస్ టెస్టు సిరీస్‍లో ఇంగ్లండ్ ఆశలు సజీవంగా నిలిచాయి. లీడ్స్ వేదికగా జరిగిన మూడో టెస్టులో నేడు (జూలై 9) ఆస్ట్రేలియాపై మూడు వికెట్ల తేడాతో ఆతిథ్య ఇంగ్లిష్ జట్టు విజయం సాధించింది. ఈ ఐదు టెస్టుల యాషెస్ సిరీస్‍లో తొలి రెండు మ్యాచ్‍ల్లో ఓడిన ఇంగ్లండ్.. ఈ మూడో టెస్టు గెలిచి సిరీస్ చేజారకుండా ఆశలను సజీవంగా నిలుపుకోగలిగింది. మ్యాచ్ నాలుగో రోజైన నేడు 251 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి ఉత్కంఠ పోరులో ఇంగ్లండ్ విజయం సాధించింది. హ్యారీ బ్రూక్ (75 పరుగులు) సత్తా చాటగా.. చివర్లో క్రిస్ వోక్స్ (32 పరుగులు నాటౌట్), మార్క్ వుడ్ (16 పరుగులు నాటౌట్) రాణించటంతో ఉత్కంఠ పోరులో ఇంగ్లండ్ గెలిచింది. రెండో ఇన్నింగ్స్‌లో ఏడు వికెట్లకు 254 పరుగులు చేసి.. మూడు వికెట్ల తేడాతో మ్యాచ్ నాలుగో రోజే స్టోక్స్ సేన విజయం సాధించింది. ఆస్ట్రేలియా బౌలర్లలో మిచెల్ స్టార్క్ ఐదు వికెట్లు తీయగా.. కమిన్స్, మిచెల్ మార్ష్‌కు చెరో వికెట్ దక్కింది.
ట్రెండింగ్ వార్తలు
251 పరుగుల లక్ష్యంతో 27 రన్స్ ఓవర్ నైట్ స్కోరుతో నాలుగో రోజు బ్యాటింగ్ కొనసాగించింది ఇంగ్లండ్. ఇంగ్లిష్ ఓపెనర్ బెన్ డకెట్ (23)ను, ఆ తర్వాత మోయిన్ అలీ (5)ని వెనువెంటనే ఔట్ చేశాడు ఆస్ట్రేలియా పేసర్ స్టార్క్. కాసేపు దీటుగా ఆడిన జాక్ క్రాలీ (44) కూడా పెవిలియన్ చేరటంతో 93 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది ఇంగ్లండ్.
ఆ తర్వాత సీనియర్ ప్లేయర్ జో రూట్ (21), హ్యారీ బ్రూక్ కాసేపు జోరుగా ఆడారు. ఆసీస్ బౌలింగ్‍ను ధీటుగా అడ్డుకున్నారు. అయితే, ఈ క్రమంలో రూట్‍ను కమిన్స్ ఔట్ చేయటంతో మ్యాచ్ రసవత్తరంగా మారింది. ఇంగ్లండ్ కెప్టెన్ స్టోక్స్ (13), జానీ బెయిర్ స్టో (5)ను ఆసీస్ పేసర్ స్టార్క్ పెవిలియన్ పంపి.. దెబ్బ తీశాడు. అయితే, మరో ఎండ్‍లో బ్రూక్ మాత్రం ఎదురుదాడి చేశాడు. క్రిస్ వోక్స్ సాయంతో దూసుకెళ్లాడు. 67 బంతుల్లోనే అర్ధ శతకానికి చేరాడు. అయితే, బ్రూక్‍ను కూడా స్టార్క్ ఔట్ చేయటంతో ఇంగ్లిష్ జట్టు కష్టాల్లో పడింది. ఆ సమయంలో వోక్స్‌కు జత కలిశాడు వుడ్. ఆ తర్వాత ఇద్దరూ ఆచితూచి ఆడి ఇంగ్లండ్‍ను విజయం వైపుగా నడిపించారు. చివర్లో వుడ్ కేవలం 8 బంతుల్లో 16 పరుగులు చేశాడు. మొత్తంగా ఉత్కంఠ పోరులో వోక్స్, వుడ్ చివర్లో రాణించటంతో ఇంగ్లండ్ విజయం సాధించింది.
ఈ యాషెస్ మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 263 పరుగులకు తొలి రోజే ఆటౌలైంది. మిచెల్ మార్ష్ (118) సెంచరీతో అదరగొట్టాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 237 పరుగులకే కుప్పకూలింది. రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 224 పరుగులకే చాపచుట్టేసింది. దీంతో ఇంగ్లండ్ ముంగిట 251 పరుగుల లక్ష్యం నిలిచింది. ఈ టార్గెట్‍ను నేడు ఛేదించింది ఇంగ్లండ్. రెండో ఇన్నింగ్స్‌లో ఏడు వికెట్లు కోల్పోయి 254 పరుగులు చేసింది ఇంగ్లండ్. అయితే, ఈ మ్యాచ్‍లో ఒక్క ఇన్నింగ్స్‌లోనూ 300 పరుగులు నమోదు కాకపోవడం విశేషం.