Cricket Funny Video: డాట్ బాల్‌కు 3 పరుగులు.. వీడియో చూస్తే నవ్వకుండా ఉండలేరు!-funny video in errors from fielding team in european cricket series ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Cricket Funny Video: డాట్ బాల్‌కు 3 పరుగులు.. వీడియో చూస్తే నవ్వకుండా ఉండలేరు!

Cricket Funny Video: డాట్ బాల్‌కు 3 పరుగులు.. వీడియో చూస్తే నవ్వకుండా ఉండలేరు!

Maragani Govardhan HT Telugu
Jun 10, 2022 08:36 PM IST

క్రికెట్ ఫన్నీ సంఘటనలు జరగడం సాధారణమే. కానీ ఈ వీడియో చూస్తే నవ్వకుండా మాత్రం ఉండలేరు. డాట్ బాల్‌కు మూడు పరుగులు చేశారు బ్యాటర్లు. రనౌట్ చేయకుండా ఓవర్ త్రో ద్వారా ఫీల్డర్లు పరుగులు సమర్పించుకున్నారు.

ఫన్నీ క్రికెట్ వైరల్
ఫన్నీ క్రికెట్ వైరల్ (Twitter)

క్రికెట్‌లో స్టంప్స్ మధ్య బ్యాటర్లు పరుగులు తీసే సమయంలో ఎన్నో ఫన్నీ సంఘటనలు చోటు చేసుకుంటూ ఉంటాయి. ఓవర్ త్రో వేసినప్పుడు ఫీల్డర్ పక్కనే బంతి ఉన్నప్పటికీ పరుగులు తీయడమో లేక ఫీల్డర్ రనౌట్ చేసే సమయంలో ఓవర్ త్రో వేసినప్పుడు అదనపు పరుగు బ్యాటర్ చేయడం ఇలా ఎన్నో విచిత్ర సంఘటనలు జరుగుతుంటాయి. కానీ యూరోపియన్ క్రికెట్ లీగ్‌లో జరిగిన ఈ సంఘటన మాత్రం అన్నింటికీ విభిన్నం. ఎందుకంటే బంతి పిచ్ కూడా దాటకుండానే ఒకటి కాదు రెండు కాదు.. మూడు పరుగులు రాబట్టారు బ్యాట్స్‌మెన్. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

యూరోపియన్ క్రికెట్ లీగ్‌లో భాగంగా వినోహార్డీ సీసీ, ప్రేగ్ బార్బేరియన్ బ్యాటర్స్ జట్ల మధ్య జరుగుతోంది. ప్రేగ్ బ్యాటర్లు జాన్హర్ గోర్, ఆండ్రూ సిమ్స్ బంతిని పక్కన ఉంచుకుని మూడు పరుగులు పిండుకున్నారు. ముందుగా బౌలర్ బంతిని వేయగా.. బ్యాటర్ దాన్ని కొట్టేందుకు ప్రయత్నిస్తాడు. అయితే అది డాట్ బాల్‌గా కీపర్ చేతిలోకి వెళ్తుంది, ఇంతలో బ్యాటర్ క్రీజులో నుంచి ముందుకు కదలడం గమనించిన కీపర్.. బంతిని వికెట్ల వైపు విసురుతాడు. అయితే వికెట్లకు దొరక్కుండా బంతి ముందుకు వెళ్తుంది. ఇది అదనుగా చేసుకుని బ్యాటర్లు రన్‌కు ప్రయత్నిస్తాడు. ఈలోపే బంతిని అందుకున్న కీపర్ నాన్‌స్ట్రైకింగ్ ఎండ్‌లో బౌలర్ వైపు బంతిని విసురుతాడు. అది కూడా వికెట్లకు దొరక్కుండా కాస్త దూరంగా వెళ్తుంది.

ఈ గ్యాప్‌లో బ్యాటర్ క్రీజులోకి వెళ్తాడు. మళ్లీ బంతిని విసరగా.. ఈ సారి కూడా బంతి వికెట్లకు తగలకపోవడంతో మూడో పరుగుకు ప్రయత్నిస్తారు బ్యాటర్లు. సాధారణ డాట్ బాల్‌గా ఉండాల్సిన తరుణంలో మూడు పరుగులు జోడించారు ప్రేగ్ బ్యాటర్లు. వీడియో చూస్తుంటే ఆద్యంతం ఫన్నీగా సాగుతుంది. బ్యాటర్లు పరుగులు తీయడం చూస్తుంటే బెస్ట్ ఫన్నీ క్రికెట్ వీడియోల్లో ఒకటిగా ఇది నిలుస్తుంది.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు కూడా విశేషంగా స్పందిస్తున్నారు. వీడియోలో మంచి కామెడీ ఉందంటూ నెజిజన్లు కామెంట్లు విసురుతున్నారు. క్రికెట్ పారడీ నడుస్తుందంటూ పోస్టు పెడుతున్నారు.

WhatsApp channel

టాపిక్