Andrew Symonds |ఆస్ట్రేలియన్ మాజీ క్రికెటర్ ఆండ్రూ సైమండ్స్ కన్నుమూత
ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ ఆండ్రూ సైమండ్స్ రోడ్డు ప్రమాదంలో శనివారం కన్నుమూశారు. అతడి హఠాన్మరణంతో క్రికెట్ ప్రపంచంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ ఆండ్రూ సైమండ్స్ రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. శనివారం రాత్రి 11 సమయంలో టౌన్స్ విల్లే లో జరిగిన కారు యాక్సిడెంట్ లో అతడు మరణించినట్లు పోలీసులు వెల్లడించారు. సైమండ్స్ ప్రయాణిస్తున్న కారు బోల్తా పడటంతో త్రీవగాయాలతో అతడు మృత్యువాత పడ్డట్లు పోలీసులు తెలిపారు. కారులో అతడు ఒంటరిగానే ప్రయాణిస్తున్నట్లు పేర్కొన్నారు. అండ్రూ సైమండ్స్ మరణంతో క్రికెట్ ప్రేమికులు విషాదంలో మునిగిపోయారు.
ఆల్ రౌండర్ గా ఆస్ట్రేలియాకు ఎన్నో గొప్ప విజయాల్ని అందించారు ఆండ్రూ సైమండ్స్. 1998 నుంచి 2009 వరకు దాదాపు 11 ఏళ్లు ఆస్ట్రేలియా నేషనల్ టీమ్ కు ప్రాతినిథ్యం వహించాడు సైమండ్స్. 1998లో పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ తో వన్డే క్రికెట్ లోకి సైమండ్స్ అరంగేట్రం చేశారు. తన చివరి వన్డే మ్యాచ్ కూడా అతడు పాకిస్థాన్ పైనే ఆడటం గమనార్హం. వన్డేల్లో అడుగుపెట్టిన ఆరేళ్ల తర్వాత అతడికి టెస్టు జట్టులోకి పిలుపువచ్చింది. తొలి టెస్ట్ ను శ్రీలంకపై ఆడాడు. ఆస్ట్రేలియా తరఫున రెండు ప్రపంచకప్ లలో ప్రాతినిథ్యం వహించాడు.
కెరీర్ లో 198 వన్డేలు ఆడిన సైమండ్స్ 5088 రన్స్, 133 వికెట్లు తీశాడు. దూకుడుకు మారుపేరుగా నిలిచిన అతడు ఎక్కువగా టెస్ట్ లు ఆడలేకపోయారు. కేవలం 26 టెస్టులతో అతడి కెరీర్ ముగిసింది. 2008లో హర్భజన్ సింగ్, సైమండ్స్ మధ్య నెలకొన్న మంకీ గేట్ వివాదం క్రికెట్ ప్రపంచాన్ని కుదిపేసింది. హర్భజన్ పై జాత్యాంహకార వ్యాఖ్యలు చేసి సైమండ్స్ చిక్కుల్లో పడ్డాడు.
సంబంధిత కథనం
టాపిక్