Cricketers Income | క్రికెటర్ల సంపాదన.. 1983లో ఎంత? ఇప్పుడెంతో తెలుసా?
Cricketers Income.. ఇప్పుడు ప్రపంచంలో అత్యంత ధనికవంతమైన క్రికెట్ బోర్డు మన బీసీసీఐ. దాని నికర విలువ రూ.14 వేల కోట్లకుపైమాటే. బోర్డు ఖజానాలో డబ్బు మూటలు పెరుగుతున్న కొద్దీ క్రికెటర్ల సంపాదన కూడా పెరిగిపోయింది. ఇప్పుడీ స్థితిలో నిలవడానికి కారణమైన 1983 వరల్డ్‌కప్ స్టార్లు అందుకున్న మొత్తం ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు.
Cricketers Income,, 1983 క్రికెట్ వరల్డ్‌కప్.. భారత క్రికెట్ చరిత్రనే మలుపు తిప్పింది. అండర్‌డాగ్స్ కాదు కదా అసలు ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన కపిల్ డెవిల్స్ డిఫెండింగ్ ఛాంపియన్ వెస్టిండీస్‌ను మట్టికరిపించి విశ్వవిజేతగా నిలిచింది. ఆ విజయం కోట్లాది మంది యువతలో ఎంతో స్ఫూర్తి నింపింది. వాళ్లను క్రికెట్ వైపు అడుగులు వేసేలా చేసింది. ఆ విజయం తర్వాత ఇండియన్ క్రికెట్ మళ్లీ వెనుదిరిగి చూడలేదు. ఆ విజయాన్నే పెట్టుబడిగా చేసుకున్న భారత క్రికెట్ బోర్డు బీసీసీఐ.. ఇండియాలో క్రికెట్‌ను ఓ బిజినెస్‌గా మార్చేసింది.
ఇప్పుడు ప్రపంచంలో అత్యంత ధనికవంతమైన క్రికెట్ బోర్డు మన బీసీసీఐ. దాని నికర విలువ రూ. 14 వేల కోట్లకుపైమాటే. బోర్డు ఖజానాలో డబ్బు మూటలు పెరుగుతున్న కొద్దీ మన క్రికెటర్ల సంపాదన కూడా భారీగా పెరిగిపోయింది. అయితే ఇండియాలో క్రికెట్ ఇప్పుడీ స్థితిలో నిలవడానికి కారణమైన 1983 వరల్డ్‌కప్ స్టార్లు అప్పట్లో అందుకున్న మొత్తం ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఇప్పటి క్రికెటర్ల సంపాదనతో అసలు ఏమాత్రం పోల్చలేని రెమ్యునరేషన్ వాళ్లకు ఇచ్చారు.
1983 వరల్డ్‌కప్ విజేతల రెమ్యునరేషన్ ఇదీ..
ఇప్పుడైతే వరల్డ్ క్రికెట్‌లో టీమిండియా టాప్ టీమ్స్‌లో ఒకటి. ఏ టోర్నీలో అయినా కచ్చితంగా ఫేవరెట్స్ లిస్ట్‌లో ఉంటుంది. అయితే 40 ఏళ్ల కిందట క్రికెట్‌లో, అందులోనూ వన్డేల్లో పసికూనల్లో ఒకటి. అలాంటి పరిస్థితుల్లో 1983 వరల్డ్‌కప్ బరిలోకి దిగిన సమయంలో మన కపిల్ సేన కప్పు గెలుస్తుందని ఎవరూ ఊహించలేదు. కానీ అనూహ్యంగా హేమాహేమీల్లాంటి టీమ్స్‌ను వెనక్కినెట్టి, ఫైనల్లో రెండుసార్లు చాంపియన్ వెస్టిండీస్‌ను చిత్తు చేసి మరీ కప్పు గెలిచింది.
ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే అలాంటి టీమ్‌పై కోట్ల వర్షం కురిసేది. స్పాన్సర్లు క్యూ కట్టేవారు. కానీ అంతటి ఘనత సాధించిన అప్పటి టీమ్‌లోని ఒక్కో సభ్యుడు బీసీసీఐ నుంచి అందుకున్న మొత్తమెంతో తెలుసా? కేవలం రూ. 2,100 మాత్రమే. మ్యాచ్ ఫీజు రూ. 1,500. అప్పట్లో అదే చాలా ఎక్కువ అని అనేవాళ్లు కూడా ఉంటారు. కానీ ఇప్పటి ద్రవ్యోల్బణంతో పోల్చి చూసినా ఆ మొత్తం చాలా తక్కువే అవుతుంది. ఇప్పటి రంజీల్లో ఆడే క్రికెటర్ కూడా ఒక రోజుకు రూ. 60 వేల వరకూ అందుకుంటున్నారు. ఆ వరల్డ్‌కప్ హీరోలు మొత్తం కలిపి అందుకున్నది రూ. 29,400 మాత్రమే. వాళ్లకు ఇచ్చిన మొత్తానికి సంబంధించిన డాక్యుమెంట్ ఒకటి ఆ మధ్య వైరల్‌గా మారింది.
ఇప్పటి క్రికెటర్ల సంపాదన ఇదీ..
ఇక ఇప్పటి టీమిండియా క్రికెటర్ల సంపాదన చూస్తే కళ్లు తేలేస్తారు. ఇప్పటి ప్లేయర్స్‌ను బీసీసీఐ నాలుగు కేటగిరీలుగా విభజించింది. ఏ+, ఏ, బీ, సీ కేటగిరీలుగా చేసి ఒక్కో కేటగిరీకి ఒక్కో మొత్తం ఇస్తోంది. అత్యధికంగా ఏ+ కేటగిరీలోని ప్లేయర్స్ అయిన విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, జస్‌ప్రీత్ బుమ్రా ఏడాది రూ. 7 కోట్లు అందుకుంటున్నారు. అంతెందుకు గ్రేడ్ సిలో ఉన్న అక్షర్ పటేల్, విహారి, దీపక్ చహర్‌లాంటి ప్లేయర్స్‌కు కూడా బీసీసీఐ ఏడాదికి రూ. కోటి ఇస్తోంది. ఇది కేవలం కాంట్రాక్ట్ మొత్తమే. మ్యాచ్ ఫీజులు, ఐపీఎల్ రెమ్యునరేషన్, స్పాన్సర్‌షిప్స్ అన్నీ అదనమే. ఆ లెక్కన కోహ్లి సంపాదన ఏడాదికి కొన్ని వందల కోట్లు ఉంటుంది.
ఇక మ్యాచ్ ఫీజు చూసుకున్నా చాలా చాలా ఎక్కువే. ఒక టెస్ట్ మ్యాచ్ ఆడే ప్లేయర్‌కు రూ. 15 లక్షలు, ఒక వన్డేకు రూ. 6 లక్షలు, ఒక టీ20కి రూ. 3 లక్షలు ఇస్తున్నారు. ఈ మ్యాచ్ ఫీజు కాకుండా వ్యక్తిగత ప్రదర్శన ఆధారంగా బోనస్‌లు కూడా ఉంటాయి. టెస్ట్ లేదా వన్డేలో సెంచరీ చేసిన ప్లేయర్‌కు మ్యాచ్ ఫీజుకు అదనంగా రూ. 5 లక్షలు, టెస్టుల్లో డబుల్ సెంచరీ చేస్తే రూ. 7 లక్షలు, వన్డేలు లేదా టెస్టుల్లో 5 వికెట్లు తీసిన ప్లేయర్‌కు రూ. 5 లక్షలు, టెస్టుల్లో 10 వికెట్లు తీసిన బౌలర్‌కు రూ. 7 లక్షలు ఇస్తారు.
మహిళా క్రికెటర్లకూ భారీగానే..
ఈ మధ్య మహిళా క్రికెటర్లను కూడా కేటగిరీలుగా చేసి బీసీసీఐ ఏడాదికి కొంత మొత్తం ఇస్తోంది. ఇది కూడా భారీగానే ఉంది. మిథాలీ రాజ్, స్మృతి మంధానా, హర్మన్‌ప్రీత్‌కౌర్, పూనమ్ యాదవ్ వంటి ప్లేయర్స్‌కు ఏడాదికి రూ. 50 లక్షలు ఇస్తోంది బీసీసీఐ. డొమెస్టిక్ క్రికెట్‌లో సీనియర్ వుమెన్ టీమ్‌లో ఆడే వారికి కూడా మ్యాచ్ డే ఫీజుగా రూ. 20 వేలు చెల్లిస్తారు. ఈ లెక్కన 1983 వరల్డ్‌కప్ గెలిచిన టీమ్‌కు, ఇప్పటి టీమ్‌కు అందుతున్న మొత్తంలో ఎంత భారీ వ్యత్యాసముందో అర్థమవుతుంది.
సంబంధిత కథనం