Djokovic’s father controversy: సిగ్గుచేటు.. రష్యా మద్దతుదారులతో జోకొవిచ్ తండ్రి.. రష్యా వర్ధిల్లాలి అంటూ నినాదాలు-djokovics father controversy as he poses with russian supporters at australian open ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Djokovics Father Controversy As He Poses With Russian Supporters At Australian Open

Djokovic’s father controversy: సిగ్గుచేటు.. రష్యా మద్దతుదారులతో జోకొవిచ్ తండ్రి.. రష్యా వర్ధిల్లాలి అంటూ నినాదాలు

Hari Prasad S HT Telugu
Jan 26, 2023 01:04 PM IST

Djokovic’s father controversy: సిగ్గుచేటు అంటూ రష్యా మద్దతుదారులతో జోకొవిచ్ తండ్రి ఉండటాన్ని తీవ్రంగా తప్పుబడుతూ సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. అతడు రష్యా వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేయడం తీవ్ర దుమారం రేపుతోంది.

రష్యా మద్దతుదారుతో జోకొవిచ్ తండ్రి సర్డాన్ జోకొవిచ్
రష్యా మద్దతుదారుతో జోకొవిచ్ తండ్రి సర్డాన్ జోకొవిచ్

Djokovic’s father controversy: ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ టోర్నీలో రష్యా జెండాలను కూడా నిషేధించారు నిర్వాహకులు. ఉక్రెయిన్ పై రష్యా దాడిని ఖండిస్తూ ప్రపంచ దేశాలు రష్యాను ఒంటరిని చేశాయి. కానీ టెన్నిస్ స్టార్ ప్లేయర్ నొవాక్ జోకొవిచ్ తండ్రి మాత్రం ఆస్ట్రేలియన్ ఓపెన్ సందర్భంగా అదే రష్యన్ మద్దతుదారులతో కలిసి ఫొటోలకు పోజులివ్వడం, రష్యా వర్దిల్లాలి అంటూ నినాదాలు చేయడం తీవ్ర దుమారం రేపుతోంది.

ట్రెండింగ్ వార్తలు

బుధవారం (జనవరి 25) మెల్‌బోర్న్ లోని రాడ్ లేవర్ అరెనాలో జోకొవిచ్ ఆడిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ చూడటానికి అతని తండ్రి సర్డాన్ జోకొవిచ్ వచ్చాడు. ఈ సందర్భంగా స్టేడియం బయట ఉన్న రష్యా మద్దతుదారులతో కలిసి అతడు ఫొటోలు దిగాడు. రష్యా వర్ధిల్లాలి అనే నినాదం చేశాడు. అంతేకాదు ఈ మ్యాచ్ కు జెడ్ అనే అక్షరం ఉన్న టీషర్ట్ వేసుకొని వచ్చిన వ్యక్తితో కనిపించాడు.

ఉక్రెయిన్ పై రష్యా దాడికి మద్దతిస్తున్న వాళ్ల చిహ్నం ఈ జెడ్ అనే అక్షరం. అలాంటి టీషర్ట్ వేసుకున్న వ్యక్తితో ఉండటం, రష్యాకు మద్దతుగా నినాదాలు చేయడంపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పుతిన్ ఫొటో ఉన్న రష్యా జెండా పట్టుకున్న ఓ వ్యక్తి పక్కనే సర్డాన్ జోకొవిచ్ నిలబడిన వీడియో ఒకటి యూట్యూబ్ లో కనిపించింది.

ఈ మ్యాచ్ చూడటానికి రష్యా జెండాలతో వచ్చిన నలుగురు వ్యక్తులను వెంటనే స్టేడియం నుంచి బయటకు పంపించేశారు. ఈ జెండాలపై ఆస్ట్రేలియన్ ఓపెన్ నిర్వాహకులు నిషేధం విధించారు. ఆస్ట్రేలియాలో ఉక్రెయిన్ రాయబారిగా ఉన్న వాసిల్ మిరోష్నిచెంకో కూడా ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

సాధారణంగా ఆస్ట్రేలియన్ ఓపెన్ మ్యాచ్ లు జరుగుతున్న సమయంలో ఆయా దేశాల జెండాలు పట్టుకోవడం తప్పేమీ కాదు. అయితే ప్రస్తుతం రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం నేపథ్యంలో రష్యాతోపాటు బెలారస్ జెండాలను నిషేధించారు.

అయితే ఇప్పుడో స్టార్ ప్లేయర్ తండ్రే ఇలా నిరసనకారులకు మద్దతుగా నినాదాలు చేయడం కొత్త వివాదానికి దారి తీసింది. సర్డాన్ జోకొవిచ్ కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. అతడు చేసిన పని సిగ్గు చేటు అంటూ కొందరు తీవ్రంగా స్పందిస్తున్నారు.

WhatsApp channel

సంబంధిత కథనం