Ind vs SA: సఫారీల పనిపట్టిన చహల్‌, హర్షల్‌.. టీమిండియా బోణీ-chahal and harshal bowl india to win and keep series alive against south africa ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Ind Vs Sa: సఫారీల పనిపట్టిన చహల్‌, హర్షల్‌.. టీమిండియా బోణీ

Ind vs SA: సఫారీల పనిపట్టిన చహల్‌, హర్షల్‌.. టీమిండియా బోణీ

Hari Prasad S HT Telugu
Jun 14, 2022 10:24 PM IST

మన వైజాగ్‌లో టీమిండియా బోణీ చేసింది. కీలకమైన మ్యాచ్‌లో విజయం సాధించి సిరీస్‌పై ఆశలు సజీవంగా ఉంచింది. బ్యాటింగ్‌లో ఓపెనర్లు, బౌలింగ్‌లో చహల్‌, హర్షల్‌ చెలరేగి టీమ్‌ను గెలిపించారు.

<p>టీమిండియాకు బోణీ అందించిన చహల్, హర్షల్ పటేల్</p>
టీమిండియాకు బోణీ అందించిన చహల్, హర్షల్ పటేల్ (AFP)

విశాఖపట్నం: సిరీస్‌లో నిలవాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో టీమిండియా ఆల్‌రౌండ్‌ పర్ఫార్మెన్స్‌తో అదరగొట్టింది. మొదట రుతురాజ్‌ గైక్వాడ్‌ (57), ఇషాన్‌ కిషన్‌ (54) బ్యాట్‌తో చెలరేగగా.. ఆ తర్వాత స్పిన్నర్‌ చహల్‌, పేస్‌ బౌలర్‌ హర్షల్ పటేల్‌ సౌతాఫ్రికా బ్యాటర్ల పని పట్టారు. దీంతో ఆ టీమ్‌ 19.1 ఓవర్లలో 131 రన్స్‌కే ఆలౌటైంది. 48 రన్స్‌తో గెలిచి ఐదు టీ20ల సిరీస్‌లో సౌతాఫ్రికా లీడ్‌ను 2-1కి తగ్గించగలిగింది. హర్షల్‌ 4, చహల్‌ 3 వికెట్లు తీసుకున్నారు.

180 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా రెగ్యులర్‌గా వికెట్లు కోల్పోయింది. తొలి రెండు మ్యాచ్‌లలో చేసిన తప్పులు రిపీట్‌ కాకుండా రిషబ్‌ పంత్‌ జాగ్రత్త పడ్డాడు. బౌలర్లను తెలివిగా ఉపయోగించుకున్నాడు. ఇద్దరు స్పిన్నర్లను ఒకరి తర్వాత మరొకరిని దింపి సఫారీలపై ఒత్తిడి పెంచాడు. కెప్టెన్‌ బవుమా (8), హెండ్రిక్స్‌ (23), ప్రిటోరియస్‌ (20), డుసెన్‌ (1), క్లాసెన్‌ (29), డేవిడ్‌ మిల్లర్‌ (3) ఎవరూ క్రీజులో నిలదొక్కుకోలేకపోయారు.

మొదటి నుంచీ సఫారీ బ్యాటర్లు పరుగుల కోసం చెమటోడ్చేలా ఒత్తిడి పెంచారు మన బౌలర్లు. ముఖ్యంగా స్పిన్నర్లు చహల్‌, అక్షర్‌ పటేల్‌ వచ్చిన తర్వాత సౌతాఫ్రికా వరుసగా వికెట్లు కోల్పోయింది. తొలిసారి చహల్‌ తనపై ఉంచిన అంచనాలను అందుకున్నాడు. అతనికి పేస్‌ బౌలర్‌ హర్షల్‌ పటేల్‌ నుంచి చక్కని సహకారం లభించింది.

చెలరేగిన ఓపెనర్లు

అంతకుముందు ఓపెనర్లు చెలరేగడంతో టీమిండియాలో 20 ఓవర్లలో 5 వికెట్లకు 179 రన్స్‌ చేసింది. ఓపెనర్లు రుతురాజ్‌ (57), ఇషాన్‌ కిషన్‌ (54) హాఫ్‌ సెంచరీలతో చెలరేగినా.. మిడిలార్డర్‌లో రిషబ్‌ పంత్‌ (6), శ్రేయస్‌ అయ్యర్‌ (14), దినేష్‌ కార్తీక్‌ (6) దారుణంగా విఫలమయ్యారు. 

చివర్లో హార్దిక్‌ పాండ్యా (21 బంతుల్లో 31) కాస్త మెరుపులు మెరిపించడంతో ఇండియా ఆ మాత్రం స్కోరైనా సాధించింది. మిడిల్‌ ఓవర్లలో సఫారీలు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేశారు. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు ఓపెనర్లు రుతురాజ్‌ గైక్వాడ్‌, ఇషాన్‌ కిషన్‌ కళ్లు చెదిరే ఆరంభాన్నిచ్చారు. ముఖ్యంగా రుతురాజ్‌ చెలరేగి ఆడాడు. 

వచ్చీ రాగానే బౌండరీలతో రెచ్చిపోయాడు. నోక్యా వేసిన ఓవర్లో ఏకంగా ఐదు ఫోర్లు బాదాడు. దీంతో పవర్‌ ప్లే ముగిసే సమయానికి ఇండియా వికెట్‌ నష్టపోకుండా 57 రన్స్‌ చేసింది. ఇదే ఊపులో రుతురాజ్‌ 30 బాల్స్‌లోనే హాఫ్‌ సెంచరీ చేశాడు. తర్వాత కాసేపటికి 57 రన్స్‌ చేసి స్పిన్నర్‌ కేశవ్‌ మహరాజ్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. దీంతో 97 పరుగుల తొలి వికెట్‌ భాగస్వామ్యానికి తెరపడింది.

రుతురాజ్‌ ఇన్నింగ్స్‌లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లు ఉన్నాయి. అతడు ఔటైన తర్వాత ఇషాన్‌ కిషన్‌ జోరు పెంచాడు. కిషన్‌ కూడా 31 బాల్స్‌లోనే హాఫ్‌ సెంచరీ చేశాడు. అయితే అతడు కూడా ఆ తర్వాత కాసేపటికే ప్రిటోరియస్‌ బౌలింగ్‌లో దూరంగా వెళ్తున్న బాల్‌ను భారీ షాట్‌ ఆడబోయి ఔటయ్యాడు. ఇషాన్‌ 35 బాల్స్‌లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 54 రన్స్‌ చేశాడు.

Whats_app_banner